అక్షరాలకు ‘దాసు’డు.. ఈ పాత్రికేయ ధీరుడు!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

journalist seven decades

‘పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ’ అంటాడు శ్రీశ్రీ. ప్రఖ్యాత జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి కూడా అలాంటి సేద్యమే చేస్తున్నారు. కాకపోతే, ఆయన చేస్తున్న సేద్యం హలంతో కాదు, కలంతో! పండిస్తున్నది మాత్రం అచ్చంగా మేలిమి బంగారమే! ఏడు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా అక్షర సేద్యం చేస్తున్న ఈ ‘దాసు’డు నేడు వందో పుట్టినరోజు జరుపుకుంటున్నారు! ఆయనని చూస్తే, వృద్ధాప్యం శరీరానికే తప్ప మనసుకి కాదని అనిపిస్తుంది. ఆలోచనలు ఆగిపోయినవాడే అసలైన వృద్ధుడని నిక్కచ్చిగా చెప్పే ఈ కృష్ణమూర్తి, ఇంత లేటు వయసులోనూ ఘాటైన రచనా వ్యాసంగంలో మునిగి తేలుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. చెవులు అంతగా వినిపించవు. కళ్లు అంతగా కనిపించవు.

కానీ, ఆయన మనసు, మెదడు నిత్యనూతన యవ్వనంతో, నిండైన నదీప్రవాహంలా ఆలోచనలతో కళకళలాడుతూ ఉంటాయి. గత పాతికేళ్లుగా అమెరికాలో (America decades) ఉంటున్న ఈ పెద్దాయన మనసు మాత్రం ఇక్కడ మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పేరుకు ఇంగ్లీషు జర్నలిస్టే అయినా, తన మస్తిష్కం తెలుగు భాషా సౌరభాలతో సదా గుబాళిస్తూ ఉంటుంది. ఇదంతా ఆ బడా జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి గురించి విడమరచి చెప్పేందుకు చేస్తున్న ఓ చిరు యత్నమని ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది! ఇప్పటి తరాలకు అంతగా తెలియకపోవచ్చుగానీ, ఆయన పేరు చెబితే ఒకప్పటి జర్నలిస్టులు ‘అబ్బో, చాలా గొప్పవాడు’ అంటూ తలలూపడం పరిపాటి. ఒక్క మాటలో చెప్పాలంటే దాసు కృష్ణమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్రికేయుడే కాదు, కథకుడు, అనువాదకుడు, సంకలన రచయిత, వ్యాఖ్యాత కూడా.

బెజవాడలో పుట్టి పెరిగిన కృష్ణమూర్తి బొంబాయి యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌బి చేశారు. ఎందుకనో న్యాయవాదిగా కొనసాగేందుకు ఇచ్చగించక, నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే, అప్పుడే (1954- 55) ఉస్మానియా వర్శిటీ వారు జర్నలిజంలో డిప్లొమో కోర్సు మొదలుపెట్టడంతో, మరో ఆలోచన లేకుండా అందులో చేరిపోయారు. అలా, ఉస్మానియాలో జర్నలిజం తొలి బ్యాచ్ విద్యార్థిగా చేరి, టాపర్‌గా నిలిచారు. (జర్నలిజంపై మక్కువ ఆయనతోనే ఆగిపోలేదు. ఆయననుంచి స్ఫూర్తి పొందిన ఆయన సోదరుడు దాసు కేశవరావు కూడా చిరకాలం పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. ‘ది హిందూ’ రెసిడెంట్ ఎడిటర్‌గా పదవీ విరమణ చేసిన కేశవరావు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పాత్రికేయ సహచరులకు చిరపరిచితులే) డిప్లొమో చేతబట్టుకుని బయటకొచ్చిన తరువాత కృష్ణమూర్తి వృత్తి జీవితం హైదరాబాద్- అహ్మదాబాద్- ఢిల్లీ నగరాల మధ్య కొనసాగింది.

ఈ ప్రయాణంలో ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్, పేట్రియాట్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ వంటి పత్రికల్లో పనిచేశారు. అయితే, ఎక్కడ పనిచేసినా రిపోర్టింగ్‌ను కాదని డెస్క్ వర్క్‌నే ఎంచుకునేవారు. వార్తా రచనలోనే కాదు, వార్తా కథనాలకు శీర్షికలు పెట్టడంలోనూ, పేజీ లే- అవుట్ లోనూ ఆయనది అందె వేసిన చెయ్యి. జర్నలిస్టుగా రిటైరయ్యాక, ఆల్ ఇండియా రేడియో, ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసి), యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, భారతీయ విద్యాభవన్ వంటి సంస్థలకు తన సేవలు అందించారు. భార్యా వియోగం అనంతరం పాతికేళ్ల క్రితం తన 75 ఏళ్ల వయసులో ఒక్కగానొక్క కూతురు (తామ్రపర్ణి దాసు.. ఆమె కూడా సుప్రసిద్ధ రచయిత్రే) వద్దకు వెళ్లిపోయిన కృష్ణమూర్తి, దేశం కాని దేశంలో ఉన్నా, అక్షర సేద్యాన్ని మాత్రం ఆపలేదు.

తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను, తెలుగు కథలను ఇంగ్లీషువారికి రుచి చూపించేందుకు స్వయంగాను, తన కూతురుతో కలసి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కుమార్తె తామ్రపర్ణితో కలసి ‘లిటరరీ వాయిసెస్ ఆఫ్ ఇండియా’ అనే ఆన్‌లైన్ పత్రికను కొంత కాలంపాటు నడిపారు. తొంభై ఏళ్ల వయసులో ‘సంతోషాబాద్ పాసెంజర్ 1947 అండ్ అదర్ స్టోరీస్’ పేరిట ప్రచురించిన కథాసంపుటి కృష్ణమూర్తికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ ఊపులో అదే ఏడాది ‘ది సీసైడ్ బ్రైడ్ అండ్ అదర్ స్టోరీస్’ పుస్తకాన్ని తీసుకువచ్చారు. తన 93 ఏళ్ల వయసులో తామ్రపర్ణితో కలసి రాసిన ‘ది గ్రేటెస్ట్ తెలుగు స్టోరీస్ ఎవర్ టోల్డ్’ శీర్షికన ప్రచురించిన పుస్తకంలో తెలుగు కథా రచయితలను ఇంగ్లీషువారికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

ఆనాటి చలం మొదలుకుని 2011 వరకూ పేరు ప్రఖ్యాతులున్న రచయితల కథలను అనువదించి, ఈ పుస్తకరూపంలో ఇంగ్లీషు పాఠకులకు అందించారు. తెలుగు కథల విశిష్టతను ఇంగ్లీషు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో తాము ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టామని తామ్రపర్ణి చెబుతారు.‘సీసైడ్ బ్రైడ్ అండ్ అదర్ స్టోరీస్’ పుస్తకంలో రాసిన వాటిలో 12 కథలు కృష్ణమూర్తి 85 ఏళ్ల వయసొచ్చాక రాసినవే. గ్లకోమా కారణంగా ఆయన కంటిచూపు మందగించింది. 20 అడుగుల దూరానికి మించి ఆయనకు చూపు ఆనదు. వృద్ధాప్యం కారణంగా వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది. అయినా ఇవేమీ తన రచనా వ్యాసంగానికి ఆటంకాలు కాలేదు. అలా అనడం కంటే, శారీరక సమస్యలను తన ప్రవృత్తికి ఆటంకాలుగా ఆయన ఏనాడూ భావించలేదు.

ఇప్పటికీ రోజూ మూడు గంటలసేపు రచ నా వ్యాసంగంలో మునిగి తేలే కృష్ణమూర్తి, తన నూరేళ్ల వయసులో ఆత్మకథ రాసేందుకు సంకల్పించడం మరో విశేషం. ఇదంతా ఎలా సాధ్యమవుతోందంటే ఆయన ఓ చిరునవ్వు నవ్వేస్తారు. ‘వృద్ధాప్యం అనేది ప్రాణాంతకమైన రోగం కాదు. తీవ్రమైన నేరం అంతకంటే కాదు. ఇది ఒక మానసిక స్థితి.. అంతే. వృద్ధాప్యం.. సహజంగా జరిగే శారీరక ప్రక్రియ. నా దృష్టిలో నిజమైన వృద్ధులు ఎవరంటే.. ఆలోచించడం మానేసినవారే. ఆ మాటకొస్తే మరణం వృద్ధులనే కాదు, వయసులో ఉన్నవారినీ విడిచిపెట్టదు కదా. ఈ సత్యాన్ని తెలుసుకుంటే, వృద్ధాప్యాన్ని కూడా చక్కగా ఆస్వాదించవచ్చు’ అని చెప్పే కృష్ణమూర్తి నేటి తరానికే కాదు, ఆనాటి తరానికి కూడా ఆదర్శప్రాయులే. బ్రేవో కృష్ణమూర్తి గారూ!

– సిహెచ్ వి రమణారావు (నేడు దాసు కృష్ణమూర్తి నూరవ పుట్టినరోజు సందర్భంగా)

​‘పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ’ అంటాడు శ్రీశ్రీ. ప్రఖ్యాత జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి కూడా అలాంటి సేద్యమే చేస్తున్నారు. కాకపోతే, ఆయన చేస్తున్న సేద్యం హలంతో కాదు, కలంతో! పండిస్తున్నది మాత్రం అచ్చంగా మేలిమి బంగారమే! ఏడు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా అక్షర సేద్యం చేస్తున్న ఈ ‘దాసు’డు నేడు వందో పుట్టినరోజు జరుపుకుంటున్నారు! ఆయనని చూస్తే, వృద్ధాప్యం శరీరానికే తప్ప మనసుకి కాదని అనిపిస్తుంది. ఆలోచనలు ఆగిపోయినవాడే అసలైన వృద్ధుడని నిక్కచ్చిగా చెప్పే ఈ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *