అధైర్య పడొద్దు.. అండగా ఉండాం

Follow

- కుంటయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
- పిల్లల చదువు, పెళ్లిళ్ల బాధ్యత తీసుకుంటాం
- ఆత్మహత్యకు కారకులను ఏ ఒక్కరినీ వదిలిపెట్టం
- న్యాయం కోసం కోర్టుకెళ్తాం
- పోలీసులు సివిల్ మ్యాటర్‌లో దూరి అరాచకాలు సృష్టిస్తున్నారు
- బాధితుడిపైనే ఉల్టా కేసు పెట్టారు
- సెటిల్‌మెంట్లకు పోలీస్‌స్టేషన్లు అడ్డాగా మారాయి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కుటుంబసభ్యులకు ఓదార్పు
- మాజీ ఎంపీటీసీ కుంటయ్య మృతదేహానికి నివాళి
‘తన భూమిని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని, తమ బీఆర్‌ఎస్ కార్యకర్త, మాజీ ఎంపీటీసీ కుంటయ్య పోలీసులను ఆశ్రయిస్తే ఉల్టా అతడిపైనే కేసు పెట్టారు. పోలీసుల వేధింపుల వల్లే అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుంటయ్య చావుకు కారకులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోం. కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తాం’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలోని పోలీస్ స్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారాయని, సివిల్ మ్యాటర్లో తలదూర్చి పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామ బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, బుధవారం మృతదేహానికి పూలమాల వేసి కేటీఆర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల, జూన్ 18 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల రూరల్ : బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య ఆత్మహత్య చేసుకోవడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసుల వేధింపుల వల్లే కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కుంటయ్య తన బాధను చెప్పుకోలేదని, చెప్పి ఉంటే ఆదుకునేవాళ్లమని చెప్పారు. రెండు రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చి, అదే రోజు రాత్రి ఇలా అఘాయిత్యం చేసుకోవడం తనను కలిచివేసిందని చెమ్మగిల్లిన కళ్లతో కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
కాంగ్రెస్ నాయకుడు తన భూమిని కబ్జా చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడిపైనే ఉల్టా కేసులు బనాయించి, వేధింపులకు గురిచేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని, పోలీసుల తీరు మార్చుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ నాయకులు ఏం చేప్తే అది చేయడాన్నే తమ డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ నేతలు ఎవరూ ఇంత చిల్లర పనులు చేయలేదని, పోలీసులు హుందాగా వ్యవహరించారని హితవుపలికారు.
కుటుంబానికి మేమున్నాం
కుంటయ్య కుటుంబానికి అండగా తామున్నామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆయన దహన సంస్కారాలన్నీ పార్టీ దగ్గరుండి చూసుకుంటుందని భార్య విజయకు ధైర్యం చెప్పారు. ఆయన కూతుళ్లు భార్గవి, దీక్షిత చదువులు, పెళ్లిళ్లు అన్నింటికీ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా పార్టీ వెన్నంటి ఉంటుందని, అధైర్య పడొద్దంటూ మనో ధైర్యం కల్పించారు. పురుగుల మందు తాగిన కుంటయ్యను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. నిబద్ధతగల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య లేని లోటు పార్టీకి తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఈ రోజు కుంటయ్యకి జరిగింది. రేపు మరొకరికి జరగొచ్చు. ఈ అరాచకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అదుపుచేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్దకర్మ జరిగే వరకు పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులూ దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కేటీఆర్ వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, బీఆర్‌ఎస్ జిల్లా, సిరిసిల్ల పట్టణాధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, నాయకులు బొల్లి రామ్మోహన్, పడిగెల రాజు, కోడి అంతయ్య, అడ్డగట్ల భాస్కర్, కుర్మ రాజయ్య, తదితరులు ఉన్నారు.
తరలివచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త కుంటయ్యను బతికించేందుకు నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. గడ్డి మందు తాగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సిరిసిల్ల దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కేటీఆర్ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం ఎల్లారెడ్డిపేటలో అశ్విని దవాఖానకు తీసుకెళ్లారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణితో కలిసి నాయకులంతా దవాఖానకు తరలివెళ్లారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్న కేటీఆర్ హైదరాబాద్‌కు తీసుకు రావాలంటూ చెప్పడంతో తరలించే ప్రయత్నంలోనే అతను తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.
ఆయన మరణ వార్త తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సిరిసిల్లకు తరలి వచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశారు. కుంటయ్య అంతిమయాత్రకు పార్టీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీగా హాజరై, కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పార్టీ నేతలు ఉన్నారు.
‘తన భూమిని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని, తమ బీఆర్‌ఎస్ కార్యకర్త, మాజీ ఎంపీటీసీ కుంటయ్య పోలీసులను ఆశ్రయిస్తే ఉల్టా అతడిపైనే కేసు పెట్టారు. పోలీసుల వేధింపుల వల్లే అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.