అయినోళ్లకే అందలం!​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
01
  • జీవో నం. 68 నుంచి కొన్ని ఏజెన్సీలకే మినహాయింపు
  • ఆధారపడిన 209 ఏజెన్సీల పొట్టకొట్టిన ప్రజాపాలన సర్కార్‌
  • రేవంత్‌రెడ్డి శాఖలో ఆప్తులకు అందలం ఎక్కించడంపై తీవ్ర విమర్శలు
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నవ నిర్మాణ్‌ అసోసియేట్‌
  • నోటీసుల ఇచ్చామంటూనే చర్యల విషయంలో అధికారుల తాత్సారం
  • కేబీఆర్‌ పార్కు కేంద్రంగా ప్రకటన దందాపై నోరు విప్పని ప్రభుత్వం
  • అన్యాయంపై రోడ్డెక్కిన వందలాది ఏజెన్సీలు

సిటీబ్యూరో, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ) : కాకులను కొట్టి గద్దలకు పంచిన చందంగా కాంగ్రెస్‌ సర్కారు వ్యవహరిస్తోంది. వందల కోట్ల రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెడుతున్నది. ఈ విషయంలో చిన్న, మధ్యతరగతి వ్యాపారుల పొట్ట కొడుతోంది. ఇదీ ఒకటి రెండు సందర్భాలు అనుకుంటే పొరపాటే. ఏ పాలసీ తీసుకువచ్చినా, ఏ విధానం అమలు చేసినా పేదలను కొట్టి, పెద్ద గద్దలకు పంచుతోంది. ఇటీవల గ్రేటర్‌ మున్సిపాలిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన అవుట్‌డోర్‌ మీడియా ప్రకటనల విషయంలో కాంగ్రెస్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా జీవో నం. 68 నుంచి మినహాయింపు ఇచ్చి తన ఆప్తులను అందలం ఎక్కించింది. ఈ పరిశ్రమపై ఆధారపడిన 209 ఏజెన్సీల పొట్ట కొట్టేలా జీవోకే తూట్లు పొడిచింది.

హోర్డింగుల పేరిట నిబంధనలను కాలరాసి కొందరి జేబులు నింపుతోందని.. ఈ రంగంపై ఆధారపడిన వందలాది ఏజెన్సీ నిర్వాహకులు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. ప్రజా పాలన పేరిట కాంగ్రెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యుల అండదండలతో మినహాయింపు పొంది ప్రచారం పేరిట దందా చేస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అవుట్‌ డోర్‌ ప్రకటనలను క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతో అమలులో ఉన్న జీవో నం. 68ను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే మార్పులు చేసింది. వాణిజ్య ప్రకటనల కోసం ఏర్పాటు చేసే బోర్డులు 15 ఫీట్లకు తగ్గకుండా ఉండాలి. కానీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ కొందరికి మాత్రమే ఆ జీవో నుంచి మినహాయింపునిచ్చింది. నిజానికి ప్రభుత్వాలు చేసే చట్టాలు, నిబంధనలు అందరికీ వర్తించేలా ఉంటాయి.

కానీ కాంగ్రెస్‌ పాలనలో ఆప్తుల కోసం మినహాయింపులతో పాటు, సవరణలు కూడా జరుగుతాయని చెప్పడానికి తాజా ఘటననే నిదర్శనంగా నిలుస్తోంది. వాస్తవంగా ప్రకటన విధానంపై సమగ్ర విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. కానీ ఒకరిద్దరి చేతుల్లోనే ఈ వ్యవహారం పెట్టడంతో అటు జీహెచ్‌ఎంసీ ఆదాయానికి, ఇటు ఈ రంగంపై ఆధారపడి ఉన్న దాదాపు 209 మంది ఏజెన్సీలకు నష్టం జరుగుతున్నది. గతంలో ఏటా జీహెచ్‌ఎంసీ ప్రకటన రూపంలో రూ. 80 కోట్ల మేర ఆదాయం వస్తే గడిచిన ఏడాదిన్నర కాలంగా రూ.30 కోట్లు కూడా రాకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం.

కండ్ల ముందే అక్రమం..

కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు సమీపంలో 484 గజాల స్థలంలో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టును నవ నిర్మాణ్‌ అసోసియేట్‌కు ప్రభుత్వం అప్పగించింది. వాస్తవంగా ఈ సంస్థ టెండర్‌ దక్కించుకున్న తీరు నుంచి ప్రాజెక్టు పనులు చేపడుతున్న ప్రస్తుతం వరకు వివాదాస్పదంగానే ఉంది. వాస్తవంగా టెండర్‌ ప్రక్రియ మొదలు పెట్టకుండానే ప్రభుత్వం నుంచి కేబీఆర్‌ పార్కు వద్ద జీవో నం. 68 నుంచి మినహాయింపులు ఇస్తూ జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగానే సదరు పనులు దక్కించుకున్న నవ నిర్మాణ్‌ అసోసియేట్‌ టెండర్‌ నిబంధనలను అడుగడుగునా ఉల్లంఘనలు జరుపుతున్నది. కేటాయించిన స్థలం కంటే అనధికారికంగా మరో వెయ్యి గజాల స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చాకనే నిబంధనల ప్రకారం ప్రకటనలు, గ్రౌండ్‌ లెవల్‌లో క్యాఫిటెరియా, కాంప్లెక్స్‌ అనుకుని ఎల్‌ఈడీ సైన్‌బోర్డులు ఏర్పాటు చేసుకుని ఆదాయం వైపు అడుగులు వేయాలి.

కానీ నిబంధనలకు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎల్‌ఈడీ భారీ స్క్రీన్‌ ఏర్పాటు చేసి గడిచిన 20 రోజులుగా అక్రమ దందాకు తెరలేపారు. కండ్ల ముందు అక్రమ సంపాదనకు తెరలేపిన నవ నిర్మాణ్‌ అసోసియేట్‌ జోలికి సంబంధిత విభాగం అధికారులు వెళ్లడం లేదు. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సందర్భంగా సభ్యులు ఈ సంస్థకు ఈ ప్రాజెక్టు ఎలా అప్పగిస్తారని, నిబంధనలు ఉల్లంఘించిన చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి. అధికారులు మాత్రం ఎల్‌ఈడీ స్క్రీన్‌ ప్రచారంపై నోటీసులు ఇచ్చామని చెబుతున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని అడ్డుకట్టలే కపోతున్నారు.

సదరు సంస్థపై ఈగ వాలకుండా చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రకటనలో విభాగంలో ఉండి..జీహెచ్‌ఎంసీకి రూ.110కోట్లకు పైగా టోకరా వేసిన వ్యక్తులు అడ్డదారిలో వస్తే పనులెట్ల అప్పగిస్తారని కార్పొరేటర్లు వంగ మధుసూదన్‌రెడ్డి, ఆవుల రవీందర్‌ రెడ్డిలు ప్రశ్నించారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు విషయంలో సదరు నవ నిర్మాణ్‌ అసోసియేట్‌పై ఎందుకు అంత ప్రేమ అని మండిపడ్డారు. ప్రాజెక్టు పూర్తి కాకముందే ప్రకటనలు మొదలు పెట్టిన సదరు ఏజెన్సీపై కఠినంగా వ్యవహరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

​కాకులను కొట్టి గద్దలకు పంచిన చందంగా కాంగ్రెస్‌ సర్కారు వ్యవహరిస్తోంది. వందల కోట్ల రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెడుతున్నది. ఈ విషయంలో చిన్న, మధ్యతరగతి వ్యాపారుల పొట్ట కొడుతోంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *