ఆ పది మండలాలకు రైతు భరోసా రద్దు!​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Rythhu Bharosa
  • లక్ష ఎకరాలకు పైగా అందని పెట్టుబడి సాయం
  • కన్నీటి పర్యంతమవుతున్న రంగారెడ్డి జిల్లా రైతులు
  • కీసరలో రోజంతా పొలాల్లోనే అన్నదాతల నిరసన
  • సర్కారు నిర్ణయంపై భగ్గుమంటున్న రైతుసంఘాలు
  • తహసీల్దార్‌కు మహేశ్వరం రైతుల వినతిపత్రం
  • రైతులకు అన్యాయం చేస్తే ఏమొస్తదని మండిపాటు
  • 19న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక
  • పెట్టుబడి సాయాన్ని రద్దు చేయడం అన్యాయం
  • సమస్య పరిష్కామయ్యేదాకా పోరాటం: సబిత

రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సెలవిచ్చారు. ఆయన ప్రకటించి నాలుగైదు రోజులు కూడా గడవకముందే రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల రైతులకు రైతుభరోసాను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పంట పెట్టుబడుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయా మండలాల పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఠంచనుగా రైతుబంధు ఇచ్చి గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమకు అండగా నిలిస్తే.. రేవంత్‌ సర్కారు వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలతో తమను బలిచేస్తున్నదని మండిపడుతున్నారు. కేసీఆర్‌ తెచ్చిన పెట్టుబడి సాయాన్ని తమకు ఇవ్వాల్సిందేనని పోరుబాటకు సిద్ధమయ్యారు. కీసరలో బుధవారం రోజంతా పంట పొలాల్లో నిలబడి రైతులు నిరసన తెలిపారు. రైతు భరోసాను తమకూ ఇవ్వాలని కోరుతూ మహేశ్వరం తహసీల్దార్‌కు రైతులు వినతిపత్రం ఇచ్చారు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో/ బడంగ్‌పేట/కీసర, జూన్‌ 18 ( నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల్లో రైతుభరోసా పథకాన్ని రద్దు చేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతులు తమ పొలాల్లోనే నిరసన వ్యక్తంచేస్తూ.. రేవంత్‌ సర్కార్‌పై పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారు.

రైతుభరోసా ఎలా నిలిపేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, బాలాపూర్‌, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌, హయత్‌నగర్‌, రాజేందర్‌నగర్‌, శంషాబాద్‌ తదితర మండలాల్లో ఉన్న రైతులకు రైతుభరోసా బ్యాన్‌ చేశారని సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్‌ నగర శివారుల్లో ఉన్న రైతులు ఎక్కువ శాతం ఆకుకూరలు, కూరగాయలు పండించేవారని గుర్తుచేశారు.

రవాణా సౌకర్యం, మార్కెట్‌ అందుబాటులో ఉండటం, త్వరగా చేతికొచ్చే పంటలు కనుక రైతులు కూరగాయలు, ఆకుకూరలపై ఎక్కువ దృష్టి పెట్టేవారని చెప్పారు. హైదరాబాద్‌ శివారు మండలాల్లో ఉన్న రైతులకు రైతుభరోసాను బ్యాన్‌ చేయడం ఏమిటని మండిపడ్డారు. వారికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మంగళం పాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కీసరలో రైతుల నిరసన

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని కీసరకు చెందిన పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కీసరలో బుధవారం రైతులంతా కలిసి తమ పొలాల్లో నిరసన వ్యక్తంచేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న వేలాది మంది రైతులకు ఇప్పటివరకు రైతుభరోసా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మూడుచింతలపల్లి మండల రైతులకు రైతుభరోసా ఇచ్చి, మేడ్చల్‌, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్‌ మండల్లాలోని రైతులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు.

తమ నియోజకవర్గంలోని రైతుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఒక్క మండలానికే రైతుభరోసా ఇవ్వడంలో అంత ర్యం ఏమిటని నిలదీశారు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున్న ధర్నాకు దిగుతామని ప్రకటించారు. రైతులను పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముద్దం శివయాదవ్‌, ముద్దం మల్లేశ్‌, సుంకరి కృష్ణారెడ్డి, రామిడి ప్రతాప్‌రెడ్డి, రామిడి నర్సింహారెడ్డి, చెట్టి మధుయాదవ్‌, కరెంట్‌ బాల్‌రెడ్డి, రామిడి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహేశ్వరం తహసీల్దార్‌కు వినతిపత్రం

మహేశ్వరం మండలంలో రైతుభరోసాను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు మహేశ్వరం తహసీల్దార్‌ సైదులుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. పోర్టు సిటీలో ఉన్న కందుకూరు మండల రైతులకు రైతుభరోసా ఇచ్చి మహేశ్వరం మండల రైతులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మహేశ్వరం మండలంలో ఎంత వ్యవసాయ భూమి ఉన్నదో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని డిమాండ్‌ చేశారు.

అధికారులు గుడ్డిగా వ్యవహరించి రైతులు వ్యవసాయం చేస్తలేరన్నట్టు ధ్రువీకరించడం బాధాకరమని పేర్కొన్నారు. అర్హులైన రైతులకు రైతుభరోసా ఇవ్వకపోతే మహేశ్వరం నియోజకవర్గవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజునాయక్‌, కర్రోళ్ల చంద్రయ్య, అంబయ్యయాదవ్‌, వెంకటేశ్వరరెడ్డి, యాదగిరి, ప్రభాకర్‌, ఆదిల్‌, రాయప్ప, నర్సింగ్‌తోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

​రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల్లో రైతుభరోసా పథకాన్ని రద్దు చేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *