ఇజ్రాయెల్‌పై హైపర్‌సానిక్ క్షిపణులు

Follow

- టెల్ అవీవ్‌పై ఫతా-1ని ప్రయోగించిన ఇరాన్
- పలు భవనాలు, టవర్లు ధ్వంసం
దుబాయ్, జూన్ 18: ఇజ్రాయెలీ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు వరుసగా ఆరో రోజూ కొనసాగాయి. తమ దేశంలోని అణు, సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై హైపర్‌సానిక్ క్షిపణులను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ‘ఆపరేషన్ ఆనెస్ట్ ప్రామిస్-3’లో భాగంగా 11వ దశలో ‘ఫతా-1’ క్షిపణులను ఉపయోగించామని, ఆక్రమిత భూభాగాల గగనతలంపై ఇరాన్ దళాలు పూర్తి నియంత్రణ సాధించాయని ఐఆర్‌జీసీ వెల్లడించింది. బుధవారం ఉదయం ఇరాన్ క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయెల్‌లో మంటలు చెలరేగి అనేక కార్లు దగ్ధమైనట్లు ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. మెరోన్ ఎయిర్‌బేస్‌ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. దేశవ్యాప్తంగా జరిగిన ఇరాన్ క్షిపణి దాడులలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఇజ్రాయెలీ మీడియా తెలిపింది. అయితే యుద్ధ సమయంలో విధించిన సైనిక సెన్సార్‌షిప్ కారణంగా సున్నితమైన లేదా వ్యూహాత్మక లక్ష్యాలకు సంబంధించిన దాడులపై వార్తలను ప్రచురించడం నిషిద్ధం.
భవనాలు ధ్వంసం
సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమవుతున్న ఫొటోలు, వీడియోలను, నిఘా వర్గాల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ధ్వంసమైన ప్రదేశాలను గుర్తించి మీడియా వార్తలను అందచేస్తున్నది. గత శనివారం టెల్ అవీవ్‌లోని రక్షణ మంత్రిత్వశాఖ కేంద్రకార్యాలయానికి అత్యంత సమీపంలో ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ పెంటగాన్‌గా వ్యవహరించే ఈ ప్రదేశంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, కీలక సైనిక నిఘా విభాగ కార్యాలయాలు ఉన్నాయి. టెల్ అవీవ్‌లోని అనేక ప్రాంతాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులు జరిగాయి. టెల్ అవీవ్‌కు పొరుగున ఉన్న రమాత్ గన్ నగరంలోని అనేక టవర్లు, నివాస సముదాయాలపై ఇరాన్ క్షిపణులు దాడి చేయడంతో భారీ నష్టం వాటిల్లినట్లు అల్ జజీరా తెలిపింది. తొమ్మిది భవనాలు ధ్వంసమైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పేటా టిక్యా నగరంపై కూడా ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడులలో నివాస, వాణిజ్య భవనాలు ధ్వంసమయ్యాయి. బూనీ బ్రాక్‌లో మతపరమైన పాఠశాల ధ్వంసమైనట్లు అల్ జజీరా పేర్కొంది. ఇరాన్ దాడులలో 9 మంది మరణించగా 200 మంది వరకు గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ధ్రువీకరించింది. రిషోన్ లెజియాన్‌లో అనేక ఇళ్లు ధ్వంసం కాగా అపార నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని దేశంలోనే అతిపెద్ద చమురు రిఫైనరీ హైఫా బజాన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై ఇరాన్ క్షిపణులు దాడి చేశా యి. దీంతో కర్మాగారం మూతపడింది.
ఏమిటీ ఫతా-1?
ఇది ఇరాన్ తొలి హైపర్‌సోనిక్ క్షిపణి. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఐరన్ డోమ్, యారో లాంటి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను సైతం ఇది ఛేదించుకుని వెళ్లగలదు. 12 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణి దాదాపు 1,400 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. సింగిల్-స్టేజ్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగించుని ఘన ఇంధనంతో నడిచే ఈ క్షిపణి 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. హైపర్‌సానిక్ ైగ్లెడ్ వెహికల్ (హెచ్‌జీవీ) వార్‌హెడ్‌తో శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలిగేలా రూపొందించిన ఫతా-1 గంటకు 17,900 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు.
ఇజ్రాయెలీ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు వరుసగా ఆరో రోజూ కొనసాగాయి. తమ దేశంలోని అణు, సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై హైపర్‌సానిక్ క్షిపణులను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది.