ఇరాన్‌తో చర్చలు ల్లేవ్

Follow

- నాయకత్వ మార్పు అనివార్యం..
- ఇజ్రాయెల్ మంత్రుల వ్యాఖ్యలు
జెరూసలెం: ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ మంత్రులు బుధవారం స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే వరకు ఇరాన్‌పై తాము ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కొనసాగుతుందని వారు ప్రకటించారు. ఇస్లామిక్ దేశమైన ఇరాన్‌లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. టెహ్రాన్‌పై నుంచి పెనుగాలులు వీచాయి. ప్రసార మాధ్యమం నుంచి ఇతర లక్ష్యాల దాకా ప్రభుత్వ చిహ్నాలపై బాంబులు పడి అవి ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. నియంతృత్వాలు ఇలాగే కుప్పకూలిపోతాయి అంటూ కట్జ్ తన పోస్టులో రాశారు. ఇరాన్‌తో ఎటువంటి సంప్రదింపులు ఉండవని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రి గిడియాన్ సార్ విదేశీ రాయబారుల వద్ద ప్రకటించారు. టెల్ అవీవ్ సమీపంలో ఆదివారం ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో 9 మంది పౌరులు మరణించిన బాట్ యామ్ ప్రాంతాన్ని ఆయన విదేశీ రాయబారులతో కలసి సందర్శించారు.
తమ లక్ష్యాలను సాధించే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన చెప్పారు. జనావాస కేంద్రాలపై ఇరాన్ పాలకులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి పౌరులను హతమారుస్తున్నారని ఆయన అన్నారు. వారు తప్పు చేస్తున్నారని, ఇజ్రాయెల్ ప్రజలు వివేకవంతులని, ఆపరేషన్ రైజింగ్ లయన్‌ని వారు బలపరుస్తారన్న విషయం ఇరాన్‌కు అర్థం కావడం లేదని సార్ వ్యాఖ్యానించారు. భారత్‌తో సహా 30 దేశాలకు పైగా రాయబారులు క్షిపణి దాడి జరిగిన ప్రదేశం వద్ద సమావేశమయ్యారు. వారికి ఇజ్రాయెల్ వైఖరిని ఆయన వివరించారు. అంతకుముందు అదే ప్రదేశంలో విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహరాల మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఎదురవుతున్న ముప్పు తొలగించడానికి జరుగుతున్న ఈ ఆపరేషన్ లక్ష్యాలను సాధించగలమన్న విశ్వాసం తమకు పూర్తిగా ఉందని చెప్పారు. తమ లక్ష్యాలను సాధించే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ మంత్రులు బుధవారం స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే వరకు ఇరాన్‌పై తాము ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కొనసాగుతుందని వారు ప్రకటించారు.