ఈ బానిసత్వం గాంధీల పట్ల కాదు

Follow

తెలంగాణ ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చనుండటాన్ని చూసి, కాంగ్రెస్ వాదులకు ఏమిటీ బానిసత్వమని కొందరు ఆశ్చర్యపోవచ్చు. దేశానికి గాంధీ కుటుంబం చేసిన సేవలు తప్పకుండా చెప్పుకోదగినవే. స్వాతంత్య్ర పోరాటకాలంలో మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు. ఉద్యమకాలంలో ఉద్యమ నాయకులుగా, స్వాతంత్య్రం తర్వాత ప్రధాన మంత్రులుగా, ప్రతిపక్ష నేతలుగా, వివిధ రాష్ర్టాలలో కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శనం చేసిన వారుగా ఆ కుటుంబపు సేవలు ఎనలేనివి. అదే సమయంలో గత 140 ఏండ్ల చరిత్రను సమీక్షించుకుంటే పోరాటాలు, త్యాగాలు జరిపిన మహామహులు ఎందరో ఉన్నారు. స్వాతంత్య్ర ఫలాలను గాంధీ వంశం వలె ఇంతగా అనుభవించలేకపోయినవారు కూడా చాలామంది కనిపిస్తారు. కానీ పథకాలకు, నిర్మాణాలకు వరుసగా పేర్లన్నీ గాంధీ కుటుంబానికే ఎందుకన్నది ప్రశ్న.
వాస్తవానికి ఈ చర్చ కొత్తది కాదు. కేవలం క్యాంటీన్ల పేరు మార్పుతో మొదలవుతున్నది కాదు. ఆ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడం, లేదా పాత పేర్లను ఈ కుటుంబం వారి పేర్ల పైకి మార్చటం జరిగినప్పుడల్లా విమర్శకులు అది గాంధీల పట్ల కాంగ్రెస్ వాదుల బానిసత్వమని అంటుంటారు. అయితే, ఈ విషయాన్ని మరికొంత వివరంగా అర్థం చేసుకోవటం అవసరం. ఈ ధోరణి గాంధీ కుటుంబం పట్ల బానిసత్వం అనుకుంటే, అదైనా ఎందుకు? వారు యథాతథంగా గాంధీలు అయినందుకా? పైన చెప్పుకున్నట్టు స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి దేశం కోసం ఎన్నెన్నో చేసినందువల్లనా? కేవలం, స్వచ్ఛంగా, సూటిగా, అందుకోసం మాత్రమే అయితే అందులో ఆక్షేపించవలసింది ఏమీ ఉండకూడదు. అదేవిధంగా పోరాటాలు, త్యాగాలు చేసిన మహా మహులు ఇంకెందరో ఉన్న స్థితిలో వారికి గాంధీ కుటుంబపు స్థాయిలో కాకున్నా కనీసం సముచిత గౌరవం ఎందుకు ఇవ్వటం లేదనే ప్రశ్న ఒకటున్నది. ఇది కూడా పాత ప్రశ్నే.
ఉదాహరణకు సుభాష్ చంద్రబోస్. ఆయన మరణించిన 80 సంవత్సరాల తర్వాత కూడా వయోవృద్ధులను మొదలుకొని, స్వాతంత్య్రోద్యమం గురించి ఏమీ తెలియని యువతరం వరకు, అందరినీ ఉత్తేజపరిచే నాయకుడాయన . నెహ్రూ కన్న ఎక్కువగా. తన విషయమై జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని తన ప్రస్తుత వారసుల వరకు ఏమి చేశారో, ఏమి చేయలేదే మనకు పూర్తిగా కాకున్నా కొంతవరకు తెలుసు. జపాన్ రాజధాని టోక్యో నగర సమీపాన రెంకోజీ టెంపుల్ ఆవరణలో నేటికీ భద్రంగా ఉండిపోయిన ఆయన అస్థికలను స్వదేశానికి తెప్పించేందుకు గాంధీ కుటుంబ పాలకులు చూపుతూ వచ్చిన విముఖత మనకు తెలియజెప్పేది కూడా తగినంత ఉంది.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉదంతం మరొక దృష్టాంతం. ఆ విషయమై, గాంధీజీ మనుమడైన సుప్రసిద్ధ రచయిత రాజ్‌మోహన్ గాంధీ రాసిన ఈ వాక్యాలను గమనించండి. ‘1989లో జవహర్‌లాల్ నెహ్రూ జన్మదిన శత వార్షికోత్సవాల సందర్భంగా వెయ్యి బిల్ బోర్డులు వెలిసాయి. ఆయనకు స్మారకంగా టెలివిజన్ సీరియళ్లు ప్రసారమయ్యాయి. అనేకానేక ఇతర ఉత్సవాలు, కార్యక్రమాలు జరిగాయి. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత నాలుగు మాసాలకు 1975 అక్టోబర్ 31న పటేల్ శతవార్షికోత్సవ సమయంలో, ఇందుకు పూర్తి భిన్నంగా, మనకేమీ కన్పించలేదు. ప్రభుత్వం గాని, ప్రభుత్వ వ్యవస్థలు గాని ఆ విషయాన్ని అసలు పరిగణనలోకి తీసుకోలేదు’
కనుక ఈ ధోరణి గతం నుంచీ ఉన్నది. గాంధీ కుటుంబాన్ని మాత్రమే ఆకాశానికి ఎత్తి మిగిలిన మహా మహులను తొక్కివేయటం. ఆ కుటుంబం చుట్టే పార్టీని తిప్పటం. పార్టీ వాదులను విధేయులుగా, విధేయులను బానిసలుగా మార్చుకోవటం. ఈ ధోరణికి అంకురార్పణ మొదటితరం నాయకుడైన మోతీలాల్ నుంచే జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసిన వారికి తెలుసు. ఆయన కుమారుడైన జవహర్‌లాల్ ప్రతిభాసంపన్నత, అభ్యుదయ భావాల పట్ల ఏ మాత్రం సందేహం ఉండనక్కరలేదు. అదే సమయంలో ఆయన సమ ఉజ్జీలను కాదని నెహ్రూను పార్టీ అధ్యక్షుడిని చేయించటంలో మోతీలాల్ పాత్ర తక్కువది కాదు. అంతకన్న ఎక్కువ గమనించదగ్గది. ఇందిరాగాంధీని అధ్యక్షురాలు చేయటంలో నెహ్రూ బంధు ప్రీతి, వారసత్వ కాంక్ష. విషయం ఏమంటే, ఇటువంటివి ఆధారం చేసుకొని గాంధీ కుటుంబీకులు అధికారాన్ని వశం చేసుకోగా, ఇందిరాగాంధీ ప్రధాని అయినప్పటినుంచి వారికి అధికారం ఎట్లా వంశపారంపర్యమైందో తెలిసిందే. ఆ విధంగా అధికారం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వాదులు అన్నీ ఆ కుటుంబం చుట్టూ వలయాలుగా తిరగటం మొదలై స్థిరపడింది.
ఇందిరా క్యాంటిన్ల విషయానికి వస్తే, తన పాలనలో పేదలకు అనుకూలమైన సంక్షేమ చర్యలు కొన్ని ఆమె తీసుకున్నారు. అందుకు కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటి, యథాతథంగా కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి, అప్పటి భారతదేశపు విస్తృత ప్రజానీక ఆర్థిక, సామాజిక స్థితిగతుల రీత్యా ప్రగతిశీల స్వభావం కొంత వచ్చింది. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన అన్ని దేశాలలో కనిపించిన పరిస్థితే అది. ఆ దేశాలన్నింటా మన తరహా రాజ్యాంగాలు, నెహ్రూను పోలిన నాయకులే రూపు తీసుకోవటం జరిగింది. ఆ విధంగా అది వలస పాలనానంతర కాలపు యుగ స్వభావమైంది. అయితే, 1947 నుంచి మొదలుకొని 1966లో ఇందిరాగాంధీ ప్రధాని అయిన 20 ఏండ్ల మధ్య కాలంలో అభివృద్ధి తగినంత లేక అశాంతి పెరగటం, రకరకాల ఉద్యమాలు, ప్రాంతీయ పార్టీల బలాలు ఒకవైపు కన్పించాయి. మరొకవైపు కాంగ్రెస్ పార్టీలోనే గ్రూపు రాజకీయాలు పెరిగాయి. ఈ పరిస్థితుల నుంచి తరుణోపాయంగా సామాన్య ప్రజలను వెంట చేర్చుకోవటానికి ఇందిరాగాంధీకి గతానికి మించిన సంక్షేమ చర్యలు, నినాదాలు తప్పనిసరి అవసరమయ్యాయి. ఆ వ్యూహం ఆమె కోరుకున్న ఫలితాలనిచ్చింది. తన సంక్షేమ చర్యల నేపథ్యం ఇది.
దీనంతటి మధ్య ఒక ముఖ్యమైన పరిణామాన్ని గమనిస్తే గాని, కాంగ్రెస్‌లో మనం ప్రస్తుతం చూస్తున్న బానిస ధోరణులకు మూలాలు ఎక్కడున్నాయో అర్థం కాదు. ఆ మూలాలు, బానిస ధోరణులు కూడా ఇందిర కాలం నుంచి ఉన్నాయి. ఆమె కన్న ముందు నెహ్రూ, లాల్ బహదూర్‌ల పట్ల గౌరవం, సాధారణ విధేయతలు ఉండేవి. నెహ్రూతో కొందరు నాయకులకు విధానపరమైన భిన్నాభిప్రాయాలున్నా అవి ప్రజాస్వామిక పరిధిలోనే. వారిని ఆయన కూడా సమాన ఫాయీలో గౌరవించేవారు. అప్పుడు పార్టీ జయాపజయాలను నాయకుల నుంచి కార్యకర్తల వరకు ప్రభుత్వ విధానాలు, వాటి సాఫల్య వైఫల్యాల పరిధిలో చూసేవారు. స్వయంగా తమ గెలుపు ఓటములను కూడా అదే పరిధి నుంచి అర్థం చేసుకోవటం తప్ప, వాటిని నెహ్రూ చుట్టూ తిప్పి చూసేవారు కాదు. నాయకునితో సహా మొత్తం పార్టీ ఒక ప్రజాస్వామిక వ్యవస్థగా ఉండేది. నెహ్రూ వ్యవహరణ కూడా అందుకు అనుగుణమే తప్ప, వారిని ఒక వ్యక్తిగా తన చుట్టూ తిప్పుకోవటం, అది క్రమంగా బానిస ధోరణిగా మారటం జరగలేదు.
ఇందిరాగాంధీ కాలం నుంచి ఈ పరిస్థితులు క్రమంగా మారాయి. పైన పేర్కొన్న సామాజిక పరిణామాలు, రాజకీయ పరిస్థితులు కొత్త శక్తుల రాక అందుకు కారణం. పార్టీ బలం అస్థిరంగా మారి గెలుపోటముల మధ్య ఊగిసలాడసాగింది. అంతర్గత రాజకీయం కూడా వెనుకటి స్థాయిలో స్థిరత్వం లేకుండా పోయింది. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నెహ్రూ నాయకత్వం పట్ల ఉండినటువంటి గౌరవ విధేయతలు తగ్గాయి. అప్పటి పార్టీ సిద్ధాంతాలు, విధానాలు దేశం కోసం, ప్రజల కోసం, అనే భావనలుండగా, ఈసరికి అది పలచబడుతూ సంక్షేమమన్నది ఒక విశ్వాసంగా, నిబద్ధతగా కాకుండా ఒక గెలుపు ఎత్తుగడగా మారసాగాయి. నాయకత్వానికి, నాయక శ్రేణులకు, కార్యకర్తలకు కూడా. రాజకీయమన్నది లోగడ కొంత సంఘసేవ, కొంత స్వప్రయోజనం కాగా, ఇప్పుడు సర్వస్వం స్వప్రయోజనమే కాసాగింది. సంఘసేవ అన్నది కేవలం ప్రజలను వంచించే ముసుగు అయింది. సంక్షేమాలు, ఉచితాలు పోటాపోటీ పాపులిజంగా మారాయి. గెలిపించి అధికారాన్నిచ్చేదే పార్టీ, అటువంటివాడే నాయకుడయ్యాడు. వాటిని కేంద్రం చేసుకొని బానిస వ్యవస్థలు ఏర్పడ్డాయి. అధికారం పట్ల బానిసత్వం నాయకుని పట్ల బానిసత్వమైంది.
ఇందిరాగాంధీ కాలానికి సంబంధించి పరిణామ క్రమంలో జరిగింది ఇదే. ఆ వ్యవస్థలు ఆమె ఎన్నికలలో గెలిపించగలదనే ఆశ ఉన్నకాలాలలో ఆమె చుట్టూ ఏర్పడి తిరిగాయి. గెలిపించలేదనుకున్నప్పుడు తన నుంచి, పార్టీ నుంచి దూరమయ్యాయి. తిరిగి గెలిపించగలదనుకున్నప్పుడు మళ్లీ దగ్గరయ్యాయి. అదొక రాజకీయ వినిమయ సంబంధం. ఇందిర తర్వాత ఆమె లేకుండానే కొంత కాలం కాంగ్రెస్ పార్టీ, ఆ వెనుక అదే కుటుంబానికి చెందిన ఆమె కుమారుడు, ఇంకా తర్వాత ఇతర కుటుంబీకులు, కొంత కాలం అధికారం సంపాదించి ప్రస్తుతం ఇంకా కొద్దిగా ఆశలు మిగుల్చుతుండటం. ఇదీ పరిస్థితి. ప్రయత్నపూర్వకంగా తమ చుట్టూ తిప్పుకున్న అధికారం, సదరు అధికారంతో నిర్మించుకున్న ఆశ్రిత వలయం గాంధీ కుటుంబానికి పెట్టని కోటలుగా మారాయి. వాటిని సాధనాలుగా చేసుకొని పార్టీలో సమాంతర నాయకత్వమన్నది లేకుండా చేసుకోగలిగారు. అది కూడా సమర్థతే. ఈ కళలు, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు పరిశోధన జరిపి గ్రంథస్థం చేయదగ్గవి.
ఈ విధమైన పరిస్థితుల మధ్య, తమ రాజకీయ ఉనికిని, గెలుపును, అధికారాన్ని కోరుకునేవారు గాంధీ కుటుంబ నామస్మరణ చేస్తూ, ఆ వ్యవస్థకు లోబడి బానిస పాత్రలు పోషించక తప్పదు. అధికారం కోసం వారిది విధిలేని బానిసత్వమే తప్ప, యథాతథంగా ఆ కుటుంబం పట్ల ఒకప్పుడు ఉండిన గౌరవాభిమానాలు, విధేయతలు ఎంతమాత్రం కావు. ఆ కుటుంబపు నామస్మరణ ఎంత జీవితావసరమో, అందులో భాగంగా ప్రతి పథకానికి వారి పేర్లు ఎడాపెడా పెట్టి భజనలు చేయటం కూడా అటువంటి జీవితావసరమే. సుప్రసిద్ధ కవి అద్దేపల్లి రామ్మోహనరావు సుమారు 50 ఏండ్ల కిందట రాసిన ‘ఏమి చెయ్యాలేమి చెయ్యాలీ జనులార మీరు ఇందిరమ్మకు భజన చేయాలీ’ అనే కవిత గుర్తుకు వచ్చింది.
– టంకశాల అశోక్
తెలంగాణ ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చనుండటాన్ని చూసి, కాంగ్రెస్ వాదులకు ఏమిటీ బానిసత్వమని కొందరు ఆశ్చర్యపోవచ్చు. దేశానికి గాంధీ కుటుంబం చేసిన సేవలు తప్పకుండా చెప్పుకోదగినవే. స్వాతంత్య్ర పోరాటకాలంలో మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు. ఉద్యమకాలంలో ఉద్యమ నాయకులుగా, స్వాతంత్య్రం తర్వాత ప్రధాన మంత్రులుగా, ప్రతిపక్ష నేతలుగా, వివిధ రాష్ర్టాలలో కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శనం చేసిన వారుగా ఆ కుటుంబపు సేవలు ఎనలేనివి. అదే సమయంలో గత 140 ఏండ్ల చరిత్రను సమీక్షించుకుంటే పోరాటాలు, త్యాగాలు జరిపిన మహామహులు ఎందరో ఉన్నారు.