ఉగ్రదాడి జరిగితే గతంలో క్యాండిల్ లైట్లతో ర్యాలీ తీసేవాళ్లం.. ఇప్పుడు హైదరాబాద్‌లో తయారైన బ్రహ్మోస్‌తో..: కిషన్ రెడ్డి

Follow

దేశ ప్రజలు మరో 11 ఏళ్ల పాటు ప్రధాని మోదీ పరిపాలనే ఉండాలని కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో “వికసిత భారత్ అమృత కాలం.. సంకల్ప సభ”ను నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ… “11 ఏళ్లుగా మోదీ చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఏడాదిగా మల్కాజ్‌గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధిని వివరించడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. 11 ఏళ్లు పరిపాలన చేయడానికి ప్రజలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం.
యూపీఏ ప్రభుత్వం హయాంలో కుంభకోణాలు, అవినీతిపై ప్రతిరోజు వార్తలు వచ్చేవి. అందుకే 2014లో దేశ ప్రజలు అవినీతి ప్రభుత్వాన్ని కాదని, మోదీని ప్రధానిగా చేశారు. ఏ ఒక్క రోజు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవినీతి జరిగినట్లు వార్తలు రాలేదు. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేది.
Also Read: బీజేపీలో చేరకముందే నేను ప్రధాని మోదీని రెండుసార్లు కలిశాను: ఈటల రాజేందర్
అప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు అద్భుతమైన పరిపాలనను ప్రజలు చూస్తున్నారు. అభివృద్ధిలో దేశం ఎలా ముందుకు వెళ్లాలో ప్రపంచానికి తెలిసేలా మోదీ ప్రభుత్వం పని చేస్తుంది. అప్పుడు పాకిస్థాన్ ఆడిందే ఆటగా.. ఐఎస్‌ఐ ఏజెంట్ల ద్వారా మన దేశాన్ని అంతలాకుతలం చేసింది. అప్పుడు లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. గతంలో ఏదైనా దాడి జరిగితే.. క్యాండిల్ లైట్లతో ర్యాలీ తీసేవాళ్లం. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో తయారైన బ్రహ్మోస్ తో ఎదురు దాడి చేస్తామని పాకిస్థాన్ కి తెలియజేశాం.
ఇప్పుడు ఎక్కడా కూడా ఉగ్రవాద చర్యలకు తావు లేకుండా మోదీ ప్రభుత్వం చేసింది. అప్పుడు ఉగ్రవాద దాడి జరిగితే పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. కానీ, మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా సర్జికల్ స్ట్రైక్ జరిగింది. మొన్న కూడా ఆపరేషన్ సిందూర్ నిర్వహించి మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు మోదీ.
అమెరికాను తలతన్నే విధంగా మన దేశంలో రోడ్లు నిర్మించారు మోదీ. జాతీయ రహదారులను అనుసంధానం చేసిన ఘనత మోదీది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా డెవలప్‌కాలేదు. కానీ మోదీ మాన రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశారు. విద్యుత్ లేకుండా ఏ గ్రామం కూడా ఉండొద్దని మోదీ తలచుకుని, మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా అందించారు.
కొంత మంది రాజకీయ పార్టీలు మోదీపై ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడు ప్రపంచ స్థాయిలో అధినేతల మీటింగ్ జరిగితే మన ప్రధాని ఎక్కడున్నాడని వెతుక్కునే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు మోదీ ప్రధాని అయ్యాక ముందు వరసలో మన ప్రధాని కనిపిస్తున్నారు.
ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబానికి బలి అయ్యింది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలు చేసింది కేసీఆర్ కుటుంబం. ఒక నియంత పాలనతో రాష్ట్రాన్ని వెనుకకు నెట్టారు. ప్రజలు విసుగు చెంది మార్పు కోరుకున్నారు. కేసీఆర్ ను గద్దె దించాలని నిర్ణయించుకున్నారు. కానీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన చేతకాని హామీలతో మరోసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు.
రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, మహిళకు అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది కాంగ్రెస్. ఇపుడు అధికారం చేపట్టాక ఏమి చేయలేక పోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరాలంటే అది బీజేపీ తోనే సాధ్యం. రాష్ట్రం అప్పులను తీర్చాలన్నా, ప్రజలకి అభివృద్ధి అందించాలి అన్నా బీజేపీ తోనే సాధ్యం. తెలంగాణ ఆకాంక్ష తీరాలాంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందించాలని కోరుతున్నాను. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్న ఈటల రాజేందర్ ను అభినందిస్తున్నాను” అని తెలిపారు.
”అప్పుడు లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి” అని అన్నారు.