ఉద్యోగులకు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్

Follow

రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వారి పింఛన్ సొమ్మును కాజేస్తున్నది. ఉద్యోగుల కష్టార్జితాన్ని సొంత అవసరాల కోసం వాడుకోవడం శోచనీయం. ఉద్యోగుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటనేది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోకి వస్తారు. ఉద్యోగుల వాటా 10 శాతం, ప్రభుత్వ వాటా 10 శాతాన్ని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాన్) అకౌంట్‌లో జమ చేస్తారు. దీనిపై వడ్డీ కూడా వస్తుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే వచ్చే లాభాలు అదనం. ఇలా జమ అయిన మొత్తం సొమ్ము నుంచి ఉద్యోగి రిటైర్ అయ్యాక 60 శాతం నగదుగా చెల్లిస్తారు. మిగిలిన 40 శాతాన్ని తిరిగి షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడుతారు. దీని నుంచే నెల నెల పెన్షన్ ఇస్తారు.
రాష్ట్రంలో ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో 2.2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారి వేతనం నుంచి ఉద్యోగి వాటాగా నెలకు రూ.100 కోట్లు, ప్రభుత్వ వాటాగా రూ.100 కోట్లు మొత్తంగా రూ.200 కోట్లు ప్రాన్ అకౌంట్‌లో జమ చేయాలి. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి నుంచి 2024 నవంబర్ వరకు 11 నెలలు, 2025 ఏప్రిల్, మే రెండు నెలలు మొత్తం 13 నెలల సొమ్మును జమ చేయలేదు. మొత్తం రూ.2,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రాన్ అకౌంట్‌లో జమ చేయకపోవడంతో సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిబంధనల ప్రకారం 15 రోజుల్లో ఉద్యోగి వాటా, ప్రభుత్వ వాటా జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వం 10 శాతాన్ని కట్ చేస్తున్నది. ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాను మాత్రం చెల్లించడం లేదు. దీంతో ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తున్న 10 శాతం వాటా ప్రభుత్వ ఖాతాలోనే ఉండిపోతున్నాయి.
భవిష్యత్తులో తమకు పెన్షన్ భరోసాగా ఉంటుందనే ఆశతో ఉద్యోగులు సొమ్మును కూడబెట్టుకున్నారు. ఈ సొమ్మును ప్రభుత్వం తన అవసరాలకు వాడుకోవడం ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమే. ఒకవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న బిల్లులు, నాలుగు డీఏల కోసం పోరాటాలు చేస్తున్నారు. ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు అడగవద్దని, తనను కోసినా రూపాయి లేదని సీఎం బహిరంగంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో పింఛన్ కోసం దాచుకున్న సొమ్మును ఇతర పథకాలకు వాడుకోవడం ఉద్యోగులకు ప్రభుత్వం
ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌గానే చూడాలి.
తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచింది. కానీ, అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా సీపీఎస్ రద్దు గురించి మాట్లాడకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బిల్లులు, డీఏలు, ప్రభుత్వం కాజేసిన సొమ్ము కోసం, సీపీఎస్ రద్దు కోసం ప్రగతిశీల పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
– పల్లె నాగరాజు, 85004 31793
(వ్యాసకర్త: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్)
రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వారి పింఛన్ సొమ్మును కాజేస్తున్నది. ఉద్యోగుల కష్టార్జితాన్ని సొంత అవసరాల కోసం వాడుకోవడం శోచనీయం.