ఉపగ్రహం సాయంతో.. 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ!

Follow

- చైనా వైద్యుల అద్భుత ఆవిష్కరణ
బీజింగ్: చైనా డాక్టర్లు అద్భుతం సృష్టించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారు 5000 కిలోమీటర్ల దూరంలోని రోగులకు శస్త్రచికిత్స అందించారు. ఆరోగ్య సంరక్షణలో దీనిని విప్లవాత్మక పరిణామంగా భావిస్తున్నారు. ఈ శస్త్ర చికిత్సకు పీఎల్‌ఏ జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ రాంగ్ లియూ నేతృత్వం వహించారు. ఈ వైద్య బృందం లాసాలో ఉండి రోబోల సాయంతో 5 వేల కిలోమీటర్ల దూరంలోని బీజింగ్‌లో ఇద్దరు రోగులకు సంక్లిష్టమైన కాలేయ శస్త్రచికిత్సలు నిర్వహించింది.
ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఎంతో సుదూర ప్రాంతంలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స చేయడం ఇదే మొదటిసారి. ఈ శస్త్ర చికిత్సలు విజయవంతం కావడంతో ఇకపై మారుమూల ప్రాంతాలు, యుద్ధక్షేత్రాలు, విపత్తుల్లో చిక్కుకున్న ప్రదేశాల్లో కూడా ఈ పద్ధతుల్లో ఆపరేషన్ చేయవచ్చని ఆ వైద్య బృందం పేర్కొంది.
ఆపరేషన్ చేసిన విధానం
భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోని ఆప్‌స్టార్-6డీ ఉపగ్రహం సాయంతో 68 ఏండ్ల లివర్ క్యాన్సర్ రోగికి, 56 ఏండ్ల హెపటిక్ హెమాంగియోమా రోగికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ రెండు ఆపరేషన్లను కేవలం 105 నుంచి 124 నిమిషాల్లో ముగించారు. ఈ ఆపరేషన్లలో రోగులు కేవలం 20 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే నష్టపోయారని, ఆపై వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని, 24 గంటల్లోనే వారిని ఇంటికి పంపించామని వైద్య బృందం తెలిపింది.
లాసాలోని దవాఖానలో ఉన్న చీఫ్ సర్జన్ రోబోల సాయంతో ఈ ఆపరేషన్లు చేశారు. సర్జికల్ రోబోల ద్వారా ఇకపై 5000 కిలోమీటర్ల నుంచి 1.50 లక్షల కిలోమీటర్ల దూరంలోని రోగులకు సైతం ఆపరేషన్ చేయవచ్చని ఆ బృందం పేర్కొన్నది.
చైనా డాక్టర్లు అద్భుతం సృష్టించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారు 5000 కిలోమీటర్ల దూరంలోని రోగులకు శస్త్రచికిత్స అందించారు. ఆరోగ్య సంరక్షణలో దీనిని విప్లవాత్మక పరిణామంగా భావిస్తున్నారు.