ఏటీఎం సర్కారుపై విచారణేది?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
07
  • ఢిల్లీలో కాంగ్రెస్‌తో కుస్తీ.. రాష్ట్రంలో రేవంత్‌తో దోస్తీ
  • అందుకే విచారణపై బీజేపీ సర్కారు వెనుకడుగు
  • అడుగడుగునా తెలంగాణకు కేంద్రం అన్యాయం
  • పసుపు బోర్డుకు పైసా ఇవ్వకుండా రిబ్బన్‌ కటింగా?
  • బోర్డు కార్యాలయాన్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తరు?
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు

హైదరాబాద్‌, జూన్‌ 29 (నమస్తేతెలంగాణ): రేవంత్‌ సర్కారు ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారిందని నిజామాబాద్‌ గడ్డపై తేల్చిచెప్పిన హోమంత్రి అమిత్‌షా ఈ విషయంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐతో ఎంక్వైరీ చేయించేందుకు అడ్డొస్తున్నదేమిటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిలదీశారు. ఢిల్లీ కాంగ్రెస్‌తో కుస్తీ పడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో దోస్తీ చేయడంలోని ఆంతర్యమేమిటో తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఆదివారం ఎక్స్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

అప్పుడు మోదీ..ఇప్పుడు షా
గతంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారని, కానీ దర్యాప్తు మాత్రం మరిచిపోయారని కేటీఆర్‌ ఎద్దేవాచేశారు. ఇప్పుడు ఇదే తరహాలో అమిత్‌షా రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తున్నదని విమర్శలు గుప్పించి.. విచారణకు ఆదేశించకపోవడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. ‘ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా తెలంగాణకు వచ్చి ఆరోపణలు చేస్తే సరిపోతుందా? పట్టపగలు ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు పంపుతుంటే కండ్లప్పగించి చూస్తారా? కాంగ్రెస్‌కు అడ్డుకట్ట వేయడం చేతగాదా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

కాళేశ్వరంపై బురదజల్లడమెందుకు?
ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డులు తిరగరాసి పంజాబ్‌ను తలదన్ని దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలవడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరంపై అమిత్‌షా బురదజల్లడం దురదృష్టకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ఒక్క ఐఐటీ, ఐఐఎం, మెడికల్‌ కాలేజీ మంజూరు చేయకుండా అన్యాయం చేసిన ఘనత బీజేపీకే దక్కిందని మండిపడ్డారు.

రిబ్బన్‌ కట్‌ చేస్తే ఏం ప్రయోజనం?
‘బడ్జెట్‌లో పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించకుండా దగా చేసిన కేంద్రం.. బోర్డు ఆఫీసుకు రిబ్బన్‌ కట్‌ చేస్తే ప్రయోజనమేమిటి? కనీసం సొంత భవనం కూడా నిర్మించకుండా కేసీఆర్‌ హయాంలో కట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు పెట్టడం సమంజసమేనా? అసలు పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా?’ అని కేటీఆర్‌ నిలదీశారు. గత జనవరి 14న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ నిజామాబాద్‌లోని ఓ హోటల్‌లో వర్చువల్‌గా ప్రారంభించారని, మళ్లీ ఇప్పుడు అమిత్‌ షా ప్రారంభించడం వల్ల కలిగే మేలు ఏమిటో అర్థంకావడంలేదని ఎద్దేవాచేశారు.

తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కేంద్రం
ఏపీలోని టీడీపీ సర్కారు చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు నదుల అనుసంధానం ముసుగులో కేంద్రం బంగారు బాటలు వేస్తూ తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నదని కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. విభజన చట్ట ప్రకారం అడవి బిడ్డలకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి పాతరేయడం, హైదరాబాద్‌ రూపురేఖలు మార్చే ఐటీఐఆర్‌ను రద్దు చేయడం తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం కాదా? అని నిలదీశారు. పేరుకు కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని, ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే యత్నాలకు స్వస్తిపలికి, వరంగల్‌ యువత ఉపాధికి భరోసా ఇవ్వగలరా? అని నిలదీశారు. అడుగడుగునా తెలంగాణకు దగా చేస్తున్న బీజేపీని ప్రజలు నమ్మబోరని, ఆ పార్టీ ఏనాడూ అధికారంలోకి రాబోదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే బీఆర్‌ఎస్సే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.

రేవంత్‌తో కుమ్మక్కు రాజకీయాల కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారును బీజేపీ వెనకేసుకొస్తున్నది. తెలంగాణ గొంతుకగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొలేకే రేవంత్‌తో బీజేపీ మిలాఖత్‌ అయింది.
– కేటీఆర్‌

రేవంత్‌తో కుమ్మక్కు రాజకీయాల కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారును బీజేపీ వెనకేసుకొస్తున్నది. తెలంగాణ గొంతుకగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొలేకే రేవంత్‌తో బీజేపీ మిలాఖత్‌ అయింది.
– కేటీఆర్‌

​రేవంత్‌ సర్కారు ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారిందని నిజామాబాద్‌ గడ్డపై తేల్చిచెప్పిన హోమంత్రి అమిత్‌షా ఈ విషయంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐతో ఎంక్వైరీ చేయించేందుకు అడ్డొస్తున్నదేమిటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిలదీశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *