ఏది కార్డియాక్ అరెస్ట్? ఏది హార్ట్ ఎటాక్?

Follow

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ (గుండెపోటు) రెండూ ఒక్కటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అవి రెండూ వేర్వేరు.
కార్డియాక్ అరెస్ట్ అంటే?
కార్డియాక్ అరెస్ట్ అనేది ‘ఎలక్ట్రిక్’ సమస్య. గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. ఎలక్ట్రికల్ మాల్ఫంక్షన్ వల్ల గుండె కొట్టుకునే క్రమం తప్పుతుంది. దీన్ని అరిథ్మియా అంటారు. దీంతో ఇతర శరీర భాగాలకు రక్తాన్ని గుండె పంప్ చేసే క్రమానికి ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె నుంచి శరీరంలో కీలక అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు రక్తం పంపించలేదు.
హార్ట్ ఎటాక్ అంటే?
హార్ట్ ఎటాక్ అనేది రక్త సరఫరా (సర్క్యులేషన్)కు సంబంధించిన సమస్య. గుండెకు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడితే ఇది వస్తుంది. గుండెకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని సరఫరా చేసే ధమని పూడుకుపోయినప్పుడు ఇలా జరుగుతుంది. దాన్ని వెంటనే తెరవకపోతే ఆ ధమని గుండెలోని ఏ భాగానికి రక్తం చేరవేస్తుందో ఆ భాగం పనిచేయకుండా పోతుంది.
ఏం జరుగుతుంది?
కార్డియాక్ అరెస్ట్ అయిన సెకండ్లలోనే ఆ వ్యక్తి శ్వాస కోసం గసపోయడం మొదలుపెడతాడు. కాసేపటికే స్పందించలేని స్థితికి చేరుకుంటాడు. సత్వరమే సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్) చేయకపోతే ఆ వ్యక్తి మరణిస్తాడు.
ఇక హార్ట్ ఎటాక్‌లో… ఛాతీలో, శరీర పైభాగంలో తీవ్రమైన అసౌకర్యం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, చల్లటి చెమటలు, వికారం (నాసియా), వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలావరకు లక్షణాలు నెమ్మదిగా మొదలవుతాయి. గుండెపోటు రావడానికి ముందు ఈ లక్షణాలు గంటలు, రోజులు, వారాలపాటు ఉండిపోతాయి. సాధారణంగా గుండె కొట్టుకోవడం వెంటనే ఏమీ ఆగిపోదు. కాకపోతే చికిత్స తీసుకోవడం ఆలస్యం అయ్యేకొద్దీ జరిగే ప్రమాదం ఎక్కువైపోతుంది.
రెండిటి మధ్య లంకె?
చాలా హార్ట్ ఎటాక్‌లు కార్డియాక్ అరెస్టుకు దారితీయవు. కానీ, కార్డియాక్ అరెస్టుకు సాధారణమైన కారణం మాత్రం హార్ట్ ఎటాక్ అని గుర్తుంచుకోవాలి. ఇతర పరిస్థితులు కూడా గుండె కొట్టుకునే క్రమాన్ని దెబ్బతీయవచ్చు. అలా కూడా కార్డియాక్ అరెస్టుకు దారితీయవచ్చు.
ఏంచేయాలి?
- వెంటనే ఎమర్జెన్సీ అంబులెన్స్‌ను పిలవాలి. ఒకవేళ సీపీఆర్ చేయడం తెలిసి ఉంటే వెంటనే మొదలుపెట్టేయాలి. ఎక్స్టర్నల్ డీఫైబ్రిలేటర్ అందుబాటులో ఉంటే దాన్ని వాడాలి.
- బాధితుడికి ఏం జరుగుతున్నదో తెలియకపోయినా కూడా అంబులెన్సుకు కాల్ చేయాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ జరిపిన అధ్యయనం ప్రకారం యాస్పిరిన్ మింగినా కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్‌తో మరణాలు సంభవించే ముప్పు తగ్గుతుంది.
మరో మాట.. హార్ట్ ఎటాక్ లక్షణాలు లింగాన్ని బట్టి మారతాయి. స్త్రీలలో ఛాతీ నొప్పికి తోడుగా దవడ లేదంటే వెన్నునొప్పి కూడా ఉండొచ్చు.
కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ (గుండెపోటు) రెండూ ఒక్కటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అవి రెండూ వేర్వేరు.