ఒక్క రాత్రికి రూ.2,400 కోట్లు!.. ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు వెచ్చిస్తున్న ఇజ్రాయెల్ !

Follow

న్యూఢిల్లీ, జూన్ 18: ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ క్రమంగా బలహీనపడుతున్నది. దీంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారినట్లు అమెరికా అధికారి ఒకరిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నిర్విరామంగా క్షిపణుల దాడి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యం ఏర్పడింది. గత శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్‌పై రైజింగ్ లయన్ ఆపరేషన్‌ని మొదలుపెట్టిన నాటి నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకుపోయే సామర్ధ్యం ఉన్న దాదాపు 400 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇలాంటి క్షిపణులు ఇరాన్ వద్ద 2,000 వకు ఉన్నట్లు అంచనా. కాగా, భూమి నుంచి చాలా ఎత్తులో వెళ్లే ఈ క్షిపణులను అడ్డుకోవడం కోసమే డిజైన్ చేసిన యారో వ్యవస్థ ఇరాన్ పేల్చిన క్షిపణులలో చాలా వాటిని అడ్డుకోగలిగినప్పటికీ చాలా శ్రమపడాల్సి వచ్చింది.
ఇరాన్ పేల్చిన క్షిపణులలో మూడింట ఒక వంతు క్షిపణులను మాత్రమే ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందని, అయితే ఇరాన్ గగనతలంపై ఆధిపత్యాన్ని ఇజ్రాయెల్ సంపాదించుకోగలిగిందని టెల్ అవీవ్‌లోని అధికారులు వాల్ స్ట్రీట్ జర్నల్‌కి తెలిపారు. అయితే ఇరాన్ అమ్ముల పొదిలో సగానికి పైగా క్షిపణులు ఇంకా ఉన్నాయని, వాటిని భూగర్భ స్థావరాలలో దాచి ఉండవచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టమైనదైనప్పటికీ దాని నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్, యారో సిస్టమ్, అమెరికా సరఫరా చేసే ప్యాట్రియట్స్, థాడ్ బ్యాటరీలతో కూడిన ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ వ్యయం ఆ దేశాన్ని కలవరపెడుతున్నది. రక్షణ కార్యకలాపాల కోసం ఒక్క రోజు రాత్రికి అయ్యే ఖర్చు 28.5 కోట్ల డాలర్లు (రూ.2,400 కోట్లు)గా ఇజ్రాయెల్ నుంచి వెలువడే ఫైనాన్షియల్ డైలీ ది మార్కర్ అంచనా వేసింది. క్షిపణులను అడ్డుకునే యారో సిస్టమ్ ఒక్కోటి 30 లక్షల డాలర్లని (రూ. 25.94 కోట్లు) పత్రిక తెలిపింది.
10-12 రోజులకు సరిపడానే
ఇరాన్ క్షిపణుల ప్రవాహం ప్రతిరోజూ కొనసాగుతుండడంతో ఇజ్రాయెల్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన నిల్వలు నానాటికీ తగ్గిపోతున్నాయి. అమెరికా నుంచి వెంటనే సరఫరా జరగని పక్షంలో ఇజ్రాయెల్ వద్ద క్షిపణి విధ్వంసక వ్యవస్థ మరో 10 నుంచి 12 రోజులకు మించి ఉండదు. ఇప్పటికే ఇజ్రాయెల్ వద్ద నిల్వలు తరిగిపోతున్నాయని, ఏ క్షిపణిని అడ్డుకోవాలో అన్న విషయాన్ని ఎంపిక చేసుకోవలసిన పరిస్థితి త్వరలోనే రావచ్చని ఇజ్రాయెలీ నిఘా వర్గాలు వాల్ స్ట్రీట్ జర్నల్‌కి తెలిపాయి.
ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ క్రమంగా బలహీనపడుతున్నది.