కాంగ్రెస్‌ రాగానే అభివృద్ధి ఆగిపోయింది.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Gangula Kamalakar
  • కక్షసాధింపులు మాని ప్రగతిపై దృష్టిపెట్టాలి
  • నిలిపివేసిన సీఎం అస్యూరెన్స్‌ ఫండ్స్‌ పనులు వెంటనే చేపట్టాలి

కార్పొరేషన్‌, జూన్‌ 30: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే స్విచ్‌ ఆఫ్‌ చేసిన విధంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, కరీంనగర్‌లోనూ నిలిచిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి, పనులు చేపట్టాలని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం నగరపాలక సంస్థకు వచ్చి నగర కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ని కలిశారు. నగరంలోని వివిధ సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, వీధిదీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా అంశాలు, పలు సమస్యలపై కమిషనర్‌తో చర్చించారు. అనంతరం విలేకరులతో గంగుల మాట్లాడారు. 2023 డిసెంబర్‌ వరకు రూ. వేల కోట్ల నిధులతో నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకపోయామని, అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా సీఎం అస్యూరెన్స్‌ కింద 350 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అస్యూరెన్స్‌ కింద చేపట్టిన 65 అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అభివృద్ధికి సంబంధించి కక్ష సాధింపు వీడి పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నగరంలో అన్ని ప్రాంతాల్లో వీధిదీపాలు ఏర్పాటు చేసి షైనింగ్‌ సీటీగా మార్చామని, కానీ ఆరు నెలలుగా 40 శాతానికి పైగా లైట్లు వెలగడం లేదని, నగరం అంధకారంలోకి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐలాండ్స్‌లో అభివృద్ధి చేసిన ఫౌంటేయిన్స్‌, సుందరీకరణ పనులు అధ్వానంగా మారాయని, అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని సూచించారు. తాము ప్రతి రోజు నీటి సరఫరా చేస్తే, ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి ఇస్తుండడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరం పరిశుభ్రంగా ఉండాలని తమ హయాంలో తీసుకువచ్చిన స్వీపింగ్‌ యంత్రాల నిర్వహణకు పకడ్బందీగా చేపట్టాల్సిన అధికారులు, వాటికి బ్రష్‌లు లేవని పక్కన పెట్టారని విమర్శించారు. ప్రస్తుత వానకాలంలో ఫాగింగ్‌ కూడా చేయడం లేదన్నారు. నగరంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరితే, తన పరిధిలో ఉన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. నగరంలో డంపింగ్‌ యార్డుతో శివారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పరిష్కారానికి తమ హయాంలో బయోమైనింగ్‌ ప్రారంభించామని, కానీ ఇప్పుడు సరిగా సాగడం లేదన్నారు. డంపింగ్‌ యార్డు విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌ హామీ ఇచ్చారని, ఈ విషయంలో కేంద్ర మంత్రి సంజయ్‌ చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. తమకు పోరాటాలు కొత్త కాదని, ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమస్యలపై అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే నగర పాలక సంస్థను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రుద్రరాజు, మాజీ కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, నాంపెల్లి శ్రీనివాస్‌, ఐలేందర్‌, తిరుపతి, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

​రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే స్విచ్‌ ఆఫ్‌ చేసిన విధంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, కరీంనగర్‌లోనూ నిలిచిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి, పనులు చేపట్టాలని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *