కాలె ముందరి కాళ్లకు.. కాంగ్రెస్ బంధనాలు

Follow

- ఎనికెపల్లి గోశాల రైతుల సమస్యలపై చేతులెత్తేసిన ఎమ్మెల్యే యాదయ్య
- సీఎంతో మాట్లాడి న్యాయం చేస్తానంటూ ఇన్నాళ్లూ రైతులకు బుజ్జగింపు
- నా వల్ల కాదు.. బీఆర్‌ఎస్ వాళ్లనే కలవండంటూ తేల్చిచెప్పిన కాలె
- తాతల నుంచి వచ్చిన భూముల్ని సర్కారు గుంజుకోవడంపై రైతుల ఆగ్రహం
- నేటి నుంచి ఆందోళనలకు సిద్ధమవుతున్న ఎనికెపల్లి రైతాంగం
కాలె యాదయ్య… చేవెళ్ల ఎమ్మెల్యే! తనకు ఓట్లేసిన రైతులకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధి. అంతకుమించి… దశాబ్దాలుగా తమ ఆస్తులుగా భావించి ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న ఎనికెపల్లి రైతుల్ని ప్రభుత్వం రోడ్డున పడేస్తే వారి పక్షాన నిలబడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు. అందుకే ఆయన తమ గోడును తీరుస్తారని రైతులు నమ్మారు. అధికారులు వచ్చి బలవంతంగా భూముల్ని గుంజుకుంటున్నా ఆశగా కాలె యాదయ్య వైపు చూశారు.
మీకు నేనున్నా.. అంటూ నెలల తరబడి వారిని బుజ్జగించిన ఆయన చివరకు చేతులెత్తేశారు. వందలాది మంది నిరుపేద రైతు కుటుంబాలను వీధినపడేశారు. పైగా ‘నేనేం చేయలేను… మీరు బీఆర్‌ఎస్ వాళ్లను కలవండి’ అని పరోక్షంగా హితవు పలికారు. దీంతో ఇన్నాళ్లూ ఎమ్మెల్యే దగ్గర తమకేదో న్యాయం దొరుకుతుందని ఆశించినరైతాంగానికి భంగపాటే ఎదురైంది. దిక్కుతోచని స్థితిలో ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు సర్కారు కర్కశత్వంపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 18 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి రెవెన్యూలో సర్వే నంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని ఇందిరమ్మ హయాంలో పంపిణీ చేయగా… గ్రామానికి చెందిన 50 మంది ఎస్సీ బీసీ నిరుపేదలు 70 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆ భూములే తమ ఆస్తులుగా ఆ కుటుంబాలు బతుకుతున్నాయి. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల నిరుపేద రైతులకు చెందిన అసైన్డ్ భూముల్ని ఏదో ఒక ప్రాజెక్టు పేరుతో బలవంతంగా గుంజుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములపైనా కన్నేసిన విషయం తెలిసిందే.
సాగు భూముల్లో గోశాల ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడంతో గత ఆరేడు నెలలుగా ఆ రైతుల కంటి మీద కునుకు కరువైంది. అయితే సుమారు ఏడు నెలల కిందటే అధికారులు ఆ భూముల్లో ప్రభుత్వ భూములంటూ బోర్డులు ఏర్పాటు చేయడంతో రైతులు ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆశ్రయించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో ఇక తమ జీవనోపాధికి ఢోకా లేదని ఆశించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున గెలిచినా కాంగ్రెస్ కండువా మార్చి అసలే అధికార పార్టీలో ఉండటంతో తమకు న్యాయం జరుగుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ వారికి ఇప్పుడు నిరాశే ఎదురైంది.
కలెక్టర్‌తోనే సరిపెట్టారా?
వాస్తవానికి ఎనికెపల్లి రైతుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని ఎమ్మెల్యే కాలె యాదయ్య రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఆ మేరకు సీఎంతో ఈ అంశంపై సంప్రదించారనేది అనుమానమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనీసం ఆ నిరుపేద రైతుల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతే తమ గోడు వినిపించుకొని, న్యాయం చేయాలంటూ వేడుకునే అవకాశముండేది. కానీ యాదయ్య మాత్రం కేవలం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడటానికే పరిమితం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ‘మరో లగచర్ల చేయకండి’ అంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి చెప్పిన ఎమ్మెల్యే.. ఆపై రైతులతో తానేమీ చేయలేనని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. మీకు న్యాయం జరగాలంటే బీఆర్‌ఎస్ వాళ్లను కలవండి, వారు మీ పక్షాన నిలబడతారని పరోక్షంగా సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో యాదయ్య అధికార పార్టీలోకి మారితే తమకేదో న్యాయం జరుగుతుందనుకున్న రైతులు.. కనీసం బీఆర్‌ఎస్‌లో ఉంటే తమ పక్షాన పోరాటం చేసేవారని వాపోతున్నారు.
రైతుల డిమాండును పెడచెవిన పెడుతున్న సర్కారు
సాగు భూముల్లో గోశాల ఏర్పాటు చేస్తామంటున్న ప్రభుత్వం కనీసం దశాబ్దాలుగా తమ కుటుంబాలకు ఆధారమైన భూముల్ని గుంజుకుంటున్నందున కనీసం తమ డిమాండ్లనైనా నెరవేర్చుతుందని ఆశించారు. కానీ ప్రభుత్వం మాత్రం కర్కశంగా వ్యవహరిస్తూ వారి డిమాండ్లను పెడచెవిన పెడుతున్నది.
ఒక్కో రైతుకు సుమారు రెండెకరాల చొప్పున భూమి ఉన్నందున అందులో ఎకరం భూమిని తీసుకొని, మిగిలిన ఎకరమైనా ఇస్తే కాలం వెళ్లదీసుకుంటామని రైతులు కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు చివరకు హైకోర్టును ఆశ్రయించి, న్యాయపోరాటం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట దీనికి సంబంధించి హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. అయితే దీనికే పరిమితం కాకుండా ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని రైతులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు నేటి నుంచి దీక్షలు మొదలుపెట్టే అవకాశాలున్నట్లు తెలిసింది.
కాలె యాదయ్య… చేవెళ్ల ఎమ్మెల్యే! తనకు ఓట్లేసిన రైతులకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధి. అంతకుమించి… దశాబ్దాలుగా తమ ఆస్తులుగా భావించి ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న ఎనికెపల్లి రైతుల్ని ప్రభుత్వం రోడ్డున పడేస్తే వారి పక్షాన నిలబడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు. అందుకే ఆయన తమ గోడును తీరుస్తారని రైతులు నమ్మారు.