కుంటయ్య ఆత్మహత్యపై కోర్టుకెళతాం

Follow

- సివిల్ మ్యాటర్స్‌లో దూరి పోలీసుల అరాచకాలు
- న్యాయం కోసం వెళ్తే ఉల్టా కేసు పెట్టి వేధింపులు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
- మాజీ ఎంపీటీసీ కుంటయ్యకు నివాళులర్పించిన కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జూన్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్యకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ మేరకు కోర్టుకు వెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలోని పోలీస్ స్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారాయని, సివిల్ తగదాల్లో పోలీసులు తలదూర్చి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేశాడని.. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. ఉల్టా కేసు పెట్టారంటూ ఆవేదనతోనే కుం టయ్య ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. బుధవారం కుంటయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కుంటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కుంటయ్య తన బాధను చెప్పుకోలేదని, చెప్పి ఉంటే ఆదుకునేవాళ్లమని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కార్యకర్త మరణానికి కారకులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అన్ని విధాలా ఆదుకుంటామని కుంటయ్య భార్య విజయకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. కుంటయ్య కూతుళ్లు భార్గవి (22), దీక్షిత (11) చదువులు, పెళ్లిళ్ల బాధ్యత తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. నిబద్ధతగల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య లేనిలోటు పార్టీకి తీరనిదని ఆవేదన వ్యక్తంచేశారు. కేటీఆర్ వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్‌ఎస్ నేతలు తుల ఉమ, తోట ఆగయ్య, జిందం చక్రపాణి, గజభీంకార్ రాజన్న, బొల్లి రామ్మోహన్, పడిగెల రాజు, కోడి అంతయ్య, అడ్డగట్ల భాస్కర్, కుర్మ రాజయ్య తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ నాయకులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్యకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.