కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ వక్రీకరించారు

Follow

- సంప్రదింపుల్లేకుండా కృష్ణా-గోదావరి అనుసంధానం చేయరాదు
- అపెక్స్ కమిటీ మీటింగ్ ఎజెండాలో సుస్పష్టం
- ఒకటో అంశం మాత్రమే చెప్పి ఐదోది దాచేశారు
- బనకచర్లపై ముఖ్యమంత్రి అబద్ధాల వల్లెవేత: హరీశ్
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): కృష్ణా-గోదావరి అనుసంధానానికి సంబంధించి సీఎం రేవంత్ వాస్తవాలను వక్రీకరించారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదింపులు లేకుండా కృష్ణా-గోదావరి అనుసంధానానికి ముందుకెళ్తే.. తెలంగాణ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని అపెక్స్ కమిటీ ఎజెండాలో స్పష్టంగా ఉన్నదని తెలిపారు. సగం మాత్రమే వెల్లడించిన ముఖ్యమంత్రి.. మిగితా అంశాలను దాచేశారని దుయ్యబట్టారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్ వేదికగా కేసీఆర్ అంగీకారం తెలిపారని మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా నాడు అపెక్స్ కౌన్సిల్‌లో జరిగిన అంశాలను కులంకశంగా వివరించారు. తనకు అనుకూలంగా ఉన్న అంశాన్నే చెప్పిన ముఖ్యమంత్రి అదే సమావేశంలోని ఐదవ ఎజెండాను ఉద్దేశపూర్వకంగా దాచేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. తన ట్వీట్‌తోపాటు అప్పటి ఎజెండా కాపీని హరీశ్ షేర్ చేశారు. ఎజెండా నెం.1లో పేర్కొన్న మేరకు ‘ఏపీకి మిగులు జలాల ఆధారంగా రెండు ప్రాజెక్టులు నిర్మించేందుకు జీవో విడుదలైంది. తెలంగాణ ఎగువన ఉన్నందున నీటిపారుదల మొత్తం ఎత్తిపోతల పథకాలపైనే ఆధారపడి జరుగుతున్నది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-II లో రెండు ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు తెలిపింది. రెండు రాష్ర్టాల్లో కృష్ణా నదిపై ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణానికి 1000 టీఎంసీలు నీరు అవసరమని.. మరోవైపు ప్రతి ఏడాది 3000 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోతున్నట్టు కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు.
వృథా అవుతున్న నీటిని అవసరాలకు తగ్గట్టు వాడుకోవడంపై పలు సూచనలు చేశారు. ఈ అంశంపై రెండు రాష్ర్టాలు కూర్చొని వివాదం పరిష్కరించుకోవాలని మాత్రమే అపెక్స్ కౌన్సిల్‌కు సూచించారు’ అని హరీశ్ తెలిపారు. అయితే ఎజెండా-1 లోని అంశాన్ని పట్టుకుని బనకచర్లకు కేసీఆర్ అంగీకారం తెలిపారంటూ ముఖ్యమంత్రి బుధవారంనాటి మీడియా సమావేశంలో అబద్ధాలను వల్లె వేశారని, ఎజెండా-5లోని వాస్తవాలను ఆయన దాచేశారని హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ‘అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఎజెండా-5లో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా గోదావరి నుంచి కృష్ణా నదుల అనుసంధానం చేయరాదని నిపుణుల కమిటీ ఎదుట కేసీఆర్ స్పష్టంగా వెల్లడించారు. ఒక వేళ వెళ్తే అందుకు తెలంగాణ అంగీకరించదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో గతంలో కోరిన విధంగా నిపుణుల కమిటీని నియమించాలని కేసీఆర్ కోరారు’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
కృష్ణా-గోదావరి అనుసంధానానికి సంబంధించి సీఎం రేవంత్ వాస్తవాలను వక్రీకరించారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదింపులు లేకుండా కృష్ణా-గోదావరి అనుసంధానానికి ముందుకెళ్తే.. తెలంగాణ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని అపెక్స్ కమిటీ ఎజెండాలో స్పష్టంగా ఉన్నదని తెలిపారు.