కేసీఆర్‌ సాగుబడికి కితాబు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Mission Kakatiya

రాష్ర్టాన్ని సాధించడంతోనే కేసీఆర్‌ సంతృప్తి పడిపోలేదు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని సుజల, సుఫల సీమగా తీర్చిదిద్దారు. జల సమృద్ధితో జన సౌభాగ్యాన్ని సాధించారు. వెనుకవేయబడిన ప్రాంతాన్ని ముందుకుతెచ్చారు. అపూర్వ మేధోమథనంతో, అద్వితీయ పరిపాలనా పటిమతో అగ్రస్థానంలో నిలబెట్టారు. ఆ అభివృద్ధిలో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. మిషన్‌ కాకతీయ పేరిట చెరువుల పూడికతీతతో శ్రీకారం చుట్టారు. 46 వేల పైచిలుకు చెరువులను, కుంటలను పునరుద్ధరించారు. వ్యవసాయానికి కావాల్సిన కీలక వనరు అయిన సాగునీరు పుష్కలంగా లభించేలా పటిష్ఠమైన చర్యలు చేపట్టారు.

కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల వంటి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేశారు. 1200కుపైగా చెక్‌డ్యామ్‌లను చేపట్టి 650కి పైగా పూర్తిచేశారు. ఈ కృషికి కాళేశ్వరం ఎత్తిపోతల ఓ కీర్తి కిరీటం లాంటిది. మరోవైపు రైతుల పంట పెట్టుబడి సమస్యకు శాశ్వతంగా ముగింపు చెప్తూ రైతుబంధు తీసుకువచ్చారు. విత్తనాలు, ఎరువుల సమస్య లేకుండా చేశారు. చివరి గింజవరకూ సేకరిస్తూ, ధాన్యం కొనుగోళ్లను తారాస్థాయికి తీసుకువెళ్లారు. గోదాముల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ధాన్యం నిల్వ సమస్య తీర్చారు. రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకూ భరోసా కల్పించారు.

ఇవన్నీ కూడా కేంద్రం సహాయ నిరాకరణ మధ్యనే జరిగాయనేది వాస్తవం. ఇప్పుడు అదే కేంద్రం విడుదల చేసిన అర్థ గణాంకాలు తెలంగాణ సాధించిన సస్యవిప్లవానికి దివిటీ పడుతున్నాయి. దార్శనిక నేత పాలనలో తెలంగాణ అంచెలంచెలుగా దేశానికి ధాన్యాగారంగా ఎదిగిన వైనాన్ని వేనోళ్ల చాటుతున్నాయి. 2011-12 నుంచి 2023-24 మధ్యకాలంలో దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగిన సంపద సృష్టిపై కేంద్రం తాజాగా నివేదికను విడుదల చేసింది. రాష్ట్రం ఏర్పాటైన ఏడాది, అంటే 2014-15లో, తెలంగాణలో సాగు దిగుబడి విలువ రూ.45 వేల కోట్లు.

బీఆర్‌ఎస్‌ పరిపాలన చివరి ఏడాది, అంటే 2023-24లో రైతులు పండించిన పంట విలువ అక్షరాలా రూ.1.16 లక్షల కోట్లు. పదేండ్ల పాలనలో రూ.70 వేల కోట్ల దిగుబడి విలువ పెరిగి రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిపింది. ఇదీ సంపద పెంచే చేతులు సాధించిన అభివృద్ధి. ఇదీ కేసీఆర్‌ సంకల్పసిద్ధి. ఇది కేవలం సాగురంగంలో సాధించిన సంపద. పారిశ్రామిక, ఐటీ ఇతరరంగాల్లో సాధించిన అభివృద్ధి వేరే కథ. రూ.80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతిని చూసే కుళ్లుబోతు నేతలకు ఇది అర్థం కాదు. లేదా కండ్లు మూసుకున్నట్టు నటిస్తారు. కాదు కాదు, అసలు అభివృద్ధే జరుగలేదని బుకాయించజూస్తారు. కేసీఆర్‌ వల్ల రాష్ట్రం అప్పులపాలైందని దబాయించజూస్తారు.

నిజం నిప్పులాంటిది. దానిని గడ్డీగాదం వేసి కప్పాలనుకుంటే మాడి మసైపోతాయి. నిజం జాజ్వల్యమానంగా ఎగదన్నుకువస్తుంది తప్ప అణగిపోదు. కేసీఆర్‌ పాలన తెలంగాణకు అపూర్వ స్వర్ణయుగాన్ని సాధించి చూపింది. ఇది ప్రజలకు అనుభవపూర్వకంగా తెలిసిన నిజం. ఈ నిజానికి మసిపూసేందుకు కాంగ్రెస్‌ సర్కారు పెద్దలు చెయ్యని చేతా లేదు, కుయ్యని కూతా లేదు. గాలివాటంగా గద్దెనెక్కి, పరిపాలన చేతకాక రోజుకోసారి బీఆర్‌ఎస్‌ పరిపాలనపై ‘వైరభక్తి’ చాటుకుంటుంటారు. భరోసా లేని పాలనతో ఏ రంగంలోనూ సుపరిపాలన సాధించలేక చతికిలబడి, తమ తప్పులన్నీ ఇదివరకటి సర్కారు ఖాతాలోకి తోసేయాలని చూస్తుంటారు. కానీ, నిజం ఎగదన్నుకువస్తుంది. సమున్నతంగా రెపరెపలాడుతుంది. కేసీఆర్‌ సమర్థ నాయకత్వంలో దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ మారిందనేది దాస్తే దాగని సత్యం. చావులేని ఆ సత్యం మార్మోగుతుంది అనునిత్యం.

​రాష్ర్టాన్ని సాధించడంతోనే కేసీఆర్‌ సంతృ ప్తి పడిపోలేదు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని సుజల, సుఫల సీమగా తీర్చిదిద్దారు. జల సమృద్ధితో జన సౌభాగ్యాన్ని సాధించారు. వెనుకవేయబడిన ప్రాంతాన్ని ముందుకుతెచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *