ఖమేనీ వారసుడెవరు?

Follow

- భీకరంగా తలపడుతున్న ఇజ్రాయెల్-ఇరాన్
- ఖమేనీని అంతమొందించడమే ఇజ్రాయెల్ లక్ష్యం
- ఖమేనీ వారసులుగా తెరపైకి పలువురి పేర్లు
- మొదటి వరుసలో ఆయన రెండో కుమారుడు మొజ్తాబా
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌తో ఢీ అంటే ఢీ అంటున్న ఇరాన్ తగ్గేదేలేదని సంకేతాలిస్తున్నది. ఆ దేశంతో తాడోపేడో తేల్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది. అమ్ములపొది నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీస్తున్నది. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మాత్రం జాడ లేకుండా పోయారు. ఆయన బంకర్‌లోకి వెళ్లిపోయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, ఆయన ఎక్కడున్నారో తమకు తెలుసని, కానీ ప్రస్తుతానికి ఆయనకు హాని తలపెట్టబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అయితే, ఆయనను అంతమొందించాలని ఇజ్రాయెల్ గట్టి పట్టుదలగా ఉన్నది. ఆయన మరణిస్తే తప్ప ఇరు దేశాల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలకు తెరపడవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు పట్టిన గతే ఖమేనీకి కూడా పడుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. ఒకవేళ ఈ యుద్ధంలో ఖమేనీ మరణిస్తే ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరన్న చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.
మొజ్తాబా ఖమేనీ
ఈయన అయతొల్లా ఖమేనీ రెండో కుమారుడు. ఈ రేసులో ముందువరుసలో ఉన్నది ఆయనే. 1969లో జన్మించిన మొజ్తాబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తోపాటు ఇరాన్ మతాధికారులతోనూ సత్సంబంధాలున్నాయి. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో ఆయన పనిచేశారు. ఇప్పుడు తెరవెనక బలమైన ప్రభావం కలిగిన మధ్యస్థ స్థాయి మతాధికారి.
అలీరెజా అరాఫీ
ఈ రేసులో వినిపిస్తున్న మరో పేరు అలీరెజా అరాఫీ. ఖమేనీకి నమ్మినబంటు. నిపుణుల అసెంబ్లీకి ఆయన డిప్యూటీ చైర్మన్‌గా, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా, కోమ్‌లో శుక్రవారం ప్రార్థనల లీడర్‌గా ఇలా పలు కీలక పదవుల్లో ఉన్నారు. ఇరాన్ అధికార నిర్మాణంలో ఆయనుకున్న విస్తృతమై అధికారాలు ఆయనను ఈ రేసులో నిలబెట్టాయి.
అలీ అస్ఘర్ హెజాజీ
సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయంలో అలీ అస్ఘర్ రాజకీయ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇరాన్ నిఘా యంత్రాంగంలో చాలా కాలం పాటు పాలుపంచుకున్నాడు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట.
ఘోలమ్ హొస్సేన్ మోసేనీ ఎజీ
ఖమేనీ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్న వారిలో ఘోలమ్ కూడా ఉన్నారు. న్యాయ, నిఘా వ్యవస్థలో ఆయన దశాబ్దాలపాటు సేవలు అందించారు. అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీనెజాద్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ మంత్రిగా పనిచేశారు. అలాగే, అటార్నీ జనరల్, న్యాయవ్యవస్థ ప్రతినిధిగా కూడా పనిచేశారు.
రెండున్నర దశాబ్దాలుగా ఖమేనీ
వార్తల్లో వ్యక్తిగా నిలిచిన ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ 1989లో అయతొల్లా రుహొల్లా వారసుడిగా అధికారం చేపట్టారు. రెండున్నర దశాబ్దాలుగా ఆయన ఇనుప పిడికిళ్లతో ఇరాన్‌ను పాలిస్తున్నారు. ఇరాన్ న్యాయవ్యవస్థ, సాయుధ బలగాలు, అధికారిక మీడియాతోపాటు గార్డియన్ కౌన్సిల్ వంటి కీలక సంస్థలపై ఆయనకు మంచి పట్టుంది. ఇరాన్‌లో ఆయన చెప్పిందే వేదం. పశ్చిమ దేశాలంటే మరీ ముఖ్యంగా అమెరికా అంటే ఆయనకు అసహ్యం.
ఇజ్రాయెల్‌తో ఢీ అంటే ఢీ అంటున్న ఇరాన్ తగ్గేదేలేదని సంకేతాలిస్తున్నది. ఆ దేశంతో తాడోపేడో తేల్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది.