‘గట్టి’ నేతకు భంగపాటు.. ముఖ్యనేత రాజకీయ ఉచ్చులో చిక్కుకొని విలవిల!​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Cabinet
  • ఒకప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్న నేత
  • పార్టీలో, ప్రభుత్వంలో సమ ప్రాధాన్యం
  • నేడు పదవి కోసం ముఖ్యనేతపై ఆధారపడే పరిస్థితి
  • చక్రంతిప్పి పరోక్షంగా దెబ్బకొట్టిన ముఖ్యనేత
  • అధిష్ఠానానికి నిధులు సమకూర్చే బాధ్యత అప్పగింత
  • పర్సంటేజీ మంత్రి అంటూ ఇంటాబయట ప్రచారం
  • నివేదికలను వివిధ మార్గాల ఢిల్లీ పెద్దలకు చేరవేత

హైదరాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్న నేత.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు.. ముఖ్యమంత్రి ఎంపిక సమయంలోనూ అధిష్ఠానం ఆయన సూచనలను పరిగణలోకి తీసుకున్నదని చెప్తుంటారు. సీఎం కాకపోయినా, ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో పార్టీలో, ప్రభుత్వంలో సమాన ప్రాధాన్యం దక్కింది. ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే పరిస్థితి తలకిందులయ్యింది. ‘మీ శాఖలను తొలిగించాలని అధిష్ఠానం చెప్పింది. కానీ నేను అడ్డుపడటం వల్లే ఇంకా కొనసాగుతున్నారు’ అంటూ ముఖ్యనేత ఆయన ముఖం మీదే చెప్పే స్థాయికి దిగజారిపోయింది. ఇలా ఎందుకు జరిగింది? దీని వెనుక ఉన్నది ఎవరు? అనేది అత్యంత ఆసక్తికరం. కాంగ్రెస్‌ వర్గాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌.

నాడు చక్రం తిప్పిన నేత..

సదరు మంత్రిగారి కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకొని ఉన్నది. ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేశారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల హామీ పత్రంలో ఆయన సంతకం కూడా ఉన్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న తలెత్తినప్పుడు మెజార్టీ నాయకులు ఆయనవైపే చూశారు. సీఎం ఎంపిక సమయంలో అధిష్ఠానం ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకున్నది. కొన్ని సమీకరణలు, లెక్కల కారణంగా ఆయనకు సీఎం పదవి తృటిలో తప్పింది. కానీ పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యనేతతో సమానంగా ప్రాధాన్యం ఉంటుందని అధిష్ఠానం హామీ ఇచ్చింది, రాష్ట్ర నేతలను ఆదేశించింది. మొదట్లో ఆయన ఉంటే తప్ప రాష్ట్ర ముఖ్యనేతలకు ఢిల్లీలో పెద్దల అపాయింట్‌మెంట్లు దొరికేవి కాదు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో ఆయనకు ఒక కుర్చీ, ఫ్లెక్సీలో ఆయన ఫొటో కచ్చితంగా ఉండేది. ముఖ్యమంత్రిని మార్చుతారన్న ప్రచారం తెరమీదికి వచ్చిన ప్రతిసారి ఆయన పేరే వినిపించింది.

‘పెద్ద’ బాధ్యతల పేరుతో..

సదరు మంత్రికి తనతో సమానంగా ప్రాధాన్యం దక్కడంపై ముఖ్యనేత మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్నట్టు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అధిష్ఠానం వద్ద ఆయన పలుకుబడిని చూసి, నేరుగా ఢీకొట్టలేమని నిర్ధారణకు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ప్లాన్‌ వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దలకు నిధులు సమకూర్చే ‘పెద్ద’ శాఖను ఆయనకు అప్పగించినట్టు పేర్కొంటున్నారు. దీనికి మొదట్లో ఆయన అంగీకరించకపోయినా, అధిష్ఠానం పెద్దలను సంతృప్తి పరిచేలా పనిచేసే మార్గమంటూ ఇతర నేతల ద్వారా చెప్పించి, ఒప్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీకి నిధులు సమకూర్చే క్రమంలో బిల్లులకు ధరలు నిర్ణయించారని, వాటిని వసూలు చేసే పనిని ఆయనకు అప్పగించారని చర్చ జరుగుతున్నది.

ఇంటాబయట అవినీతి ముద్ర

పెద్దలను సంతృప్తిపరిచే పని అప్పగించారంటూ సంతోషంగా తీసుకున్న సదరు నేత, నిక్కచ్చిగా బిల్లులు వసూలు చేసినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై ఇంటా, బయట అవినీతి ముద్ర పడిందని పేర్కొంటున్నారు. బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారంటూ ముఖ్యనేత అనుచరులు లీకులు ఇచ్చి ప్రచారం చేశారట. చివరికి ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదంటూ సొంతపార్టీ నేతలతో అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయించినట్టు చర్చ జరుగుతున్నది. మీడియా సంస్థలకు లీకులు ఇచ్చి వరుసగా కథనాలు వచ్చేలా ప్లాన్‌ చేసినట్టు చెప్పుకుంటున్నారు. దీనికితోడు సచివాలయంలో కాంట్రాక్టర్లు నిరసన తెలపడం, రియల్టర్లు ప్రెస్‌మీట్లు పెట్టడం వంటి పరిణామాలు ఢిల్లీ పెద్దల వరకు చేరినట్టు సమాచారం.

నేరుగా అధిష్ఠానానికి ఫిర్యాదులు

రాష్ర్టానికి చెందిన దళిత ఎమ్మెల్యేలు కొందరు సదరు మంత్రి 20 పర్సెంట్‌ అవినీతిపై ఆధారాలతో సహా అధిష్ఠానానికి రహస్యంగా ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణ ముసుగులో ముఖ్యనేతే వ్యూహాత్మకంగా ఆ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపినట్టు ఒక వర్గం కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారు. ఢిల్లీ పెద్దలు వాటిని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జికి పంపించి, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఫిర్యాదుపై రహస్య విచారణ జరపగా ఆరోపణలు నిజమేనంటూ నిర్ధారించినట్టు తెలిసింది. బిల్లుల చెల్లింపులకు 8-16 శాతం కమీషన్‌ తీసుకున్నారని, ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.25 వేల కోట్ల బిల్లుల్లో కమీషన్లు తీసుకున్నారని తేలినట్టు చర్చ జరుగుతున్నది. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా వదల్లేదని అధిష్ఠానానికి నివేదికలు వెళ్లినట్టు సమాచారం.

నేనే రక్షించిన ఇకనైనా మంచిగ చేసుకో!

రాష్ట్రం నుంచి వెళ్లిన నివేదికను చూసి ఢిల్లీ పెద్దలు సదరు మంత్రిపై గుర్రుగా ఉన్నట్టు ముఖ్యనేతకు సమాచారం అందింది. దీంతో ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్లి రెండుమూడు రోజులు మకాం వేశారు. తిరిగి వచ్చిన తర్వాత సదరు మంత్రిని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా ఆయన శాఖలో జరిగిన అవినీతి వివరాలను అధిష్టానం వేర్వురు మార్గాల ద్వారా తెప్పించుకున్నదని తెలిపారట. ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆధారాలతో సహా సమగ్ర నివేదిక ఇచ్చారని చెప్పారట.

బిల్లుల్లో కమీషన్ల ఆరోపణలతో ప్రభుత్వానికి పూరించలేనంత చెడ్డ పేరు వచ్చిందని ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారని వివరించారట. తక్షణమే పర్సేంటేజీలు ఆపేయాలని, అవసరమైతే మీ దగ్గరి నుంచి ఒక కీలక శాఖను తొలిగించాలని ఢిల్లీ పెద్దలు స్పష్టం చేసినట్టు ముఖ్యనేత వివరించారట. అయితే తానే ప్రతిపక్ష పార్టీలను బూచిగా చూపించి ఈసారికి రక్షించగలిగానని చెప్పుకొచ్చినట్టు సమాచారం. దీంతో ఒకసారి వార్నింగ్‌ ఇచ్చి వదిలేద్దామని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారని, వార్నింగ్‌ ఇచ్చే బాధ్యతను కూడా తనపైనే మోపారని చెప్పారట. కాబట్టి ఇకపై అయినా మంచిగా చేసుకోవాలని ముఖ్యనేత సదరు మంత్రికి సూచించినట్టు చెప్పుకుంటున్నారు.

మరోసారి అవినీతి ఆరోపణలు వస్తే ఎవరమూ రక్షించలేమని, అక్కడ తాను చెప్పినా వినే పరిస్థితి లేదని హెచ్చరించినట్టు సమాచారం. దీంతో అధికార పార్టీలోని సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆయనపై సానుభూతి చూపుతున్నట్టు తెలుస్తున్నది. పెద్ద సీటు కోసం పోటీ పడిన నేత ఇప్పుడు అదే నేత దయాదాక్షిణ్యాల మీద మంత్రిగా కొనసాగే దుస్థితికి దిగజారిపోయారని చర్చ జరుగుతున్నది. ముఖ్యనేత వ్యూహాత్మకంగా పన్నిన రాజకీయ ఉచ్చులో ఆయన పూర్తిగా కూరుకుపోయారని, భవిష్యత్తును నాశనం చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

​ఒకప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్న నేత.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు.. ముఖ్యమంత్రి ఎంపిక సమయంలోనూ అధిష్ఠానం ఆయన సూచనలను పరిగణలోకి తీసుకున్నదని చెప్తుంటారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *