చదువు కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త.. విద్యార్థి వీసాల జారీ ప్రక్రియ మళ్లీ ప్రారంభం.. కానీ, ఒక షరతుతో..

Follow

US Student Visas: అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమెరికా విదేశాంగ శాఖ విదేశీయుల కోసం విద్యార్థి వీసా దరఖాస్తులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో ఈ యేడాది మే చివరి వారం నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగును తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా.. సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేస్తూ వీసా అపాయింట్‌మెంట్ల ప్రక్రియను పునరుద్దరిస్తూ అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను యూఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమతమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేటు సెట్టింగ్స్ ను మార్చుకుని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తరువాతే వీసా మంజూరు చేస్తారు.
ఉదాహరణకు.. ఎవరైనా విద్యార్థి తమ సోషల్ మీడియా ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వారి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాతనే వారికి అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తూ వీసా అందుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
జ్ఞాన్‌ధాన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ మెహ్రా బిజినెస్ టుడేతో మాట్లాడుతూ.. విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను పున:ప్రారంభించడం చాలా ఉపశమనం కలిగించింది. మేము ఊహించనట్లుగానే విరామం ఎల్లప్పుడూ తాత్కాలికమే. సోషల్ మీడియా స్క్రీనింగ్ పై విద్యార్థులకు ఒక సలహా ఇస్తున్నా.. అదేమిటంటే.. నా అభిప్రాయం ప్రకారం విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలో దేనిని తొలగించే ప్రయత్నం చేయొద్దు. పరిశీలన సమయంలో అధికారులకు గత డేటా కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాల్లో తొలగించిన పోస్టులు, తదితర ఆకస్మిక మార్పులు అనుమానాన్ని రేకెత్తించవచ్చు. పారదర్శకంగా ఉండటం మంచిది అంటూ సూచించారు.
అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.