జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి..కొత్త కమిషనర్కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి..కొత్త కమిషనర్కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి

Caption of Image.
  • కొత్త స్పెషల్ కమిషనరుకు ఫెడరేషన్ వినతి
  • అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులపై
  • వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్

తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తక్షణం అక్రిడిటేషన్లు ఇవ్వాలనీ, కొత్త ఆరోగ్య విధానాన్ని తీసుకురావాలని కోరింది. శుక్రవారం హైదరాబాద్లోని సమాచార్ భవన్లో సమాచారశాఖ స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న సిహెచ్, ప్రియాంకను ఫెడరేషన్ బృందం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. 

అనంతరం జర్నలిస్టుల సమస్యలపై ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు,కార్యదర్శులు, సభ్యులు స్పెషల్ కమిషనర్తో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఇండ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్టుల సమస్యలు, వేజ్ బోర్డు అమలు, ప్రత్యేక రక్షణ చట్టం, రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకం, మీడియా అకాడమీ శిక్షణా తరగతులు, మీడియా కమిషన్ తదితర అంశాలపై కూలంకషంగా ఫెడరేషన్ అభిప్రాయాలను స్పెషల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. 

ఆక్రిడిటేషన్లకు నాలుగోసారి స్టిక్కర్లు వేయబోతున్నారనీ..ఇది సరికాదన్నారు. జర్నలిస్టుల విధుల నిర్వహణకు ఇది ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆరోగ్య సమస్యలతో పాత్రికేయులు అనేక కష్టాలు అనుభవిస్తున్నారనీ, ఉద్యోగుల కోసం కొత్తగా తెచ్చే ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని కోరారు. 

మీడియా అకాడమీ జర్నలిస్టులకు ఇచ్చే శిక్షణాతరగతుల్లో వివక్ష చూపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎంతమాత్రం సహించరానిదన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పెన్షన్ పథకాన్ని రిటైరైన జర్నలిస్టులకు తెలంగాణలో కూడా అమలుచేయాలని కోరారు. 

రాత్రిపూట మహిళా జర్నలిస్టులకు పనిచేసే చోట నుంచి రవాణా సౌకర్యం కల్పించేలా ఆయా సంస్థలపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని ఫెడరేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మీడియాతోపాటు జర్నలిస్టుల పరిస్థితులను అధ్యయనం చేసి పరిష్కరించేందుకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని స్పెషల్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. 

కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి. రామచందర్, గుడిగ రఘు, విజయానంద్, తాటికొండ కృష్ణ, కార్యదర్శులు సలీమ, ఈ చంద్రశేఖర్, బి. జగదీష్, దామోదర్, బి. రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు పి. విజయ, నాయకులు పద్మనాభరావు, కె.లలిత ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

​జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి..కొత్త కమిషనర్కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *