జిన్‌పింగ్‌కి పదవీగండం!.. రెండు వారాలుగా బయటకు కనిపించని చైనా ప్రెసిడెంట్

Follow

- అధ్యక్ష మార్పు జరగొచ్చంటూ చైనాలో జోరుగా ఊహాగానాలు
న్యూఢిల్లీ, జూన్ 30: ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 5 వరకు రెండు వారాల పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రజలకు కనిపించకుండా పోవడంతో అధ్యక్ష మార్పు జరగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటువంటి అదృశ్యాలు అనూహ్యం కానప్పటికీ అధికారాలను కత్తిరించి, నామమాత్రంగా మిగిల్చి ప్రముఖ నాయకులను పక్కకు తప్పించడం చైనా చరిత్రలో సర్వసాధారణమని నిఘా వర్గాలు సీఎన్‌ఎన్-న్యూస్18కి తెలిపాయి.
జిన్‌పింగ్ భావ వ్యక్తీకరణలు తగ్గిపోవడం, గతంలో పదవీచ్యుతులైన పార్టీ సీనియర్ సభ్యులు తిరిగి ప్రత్యక్షం కావడం అధికార మార్పిడికి సూచనలు కావచ్చని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. గతంలో చైనీస్ కమ్యూనిస్టు పార్టీ(సీపీపీ) ముగ్గురు ప్రముఖ నాయకులను ఇదే పద్ధతిలో పక్కకు తప్పించడం, వారిని లాంఛనంగా పదవి నుంచి బర్తరఫ్ చేయకుండా అధికారాలను కత్తిరించి ఉత్సవ విగ్రహాలుగా మార్చడాన్ని ప్రస్తావించాయి.
తెరపైకి జాంగ్ యూజియా..
చైనాలో అధ్యక్ష పదవి నామమాత్రమే అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) చైర్మన్‌గా జిన్‌పింగ్ పూర్తి అధికారాలను వాడుకున్నారని వారు చెప్పారు. ప్రస్తుతం అధికారం సీఎంసీ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూజియా వద్ద కేంద్రీకృతమై ఉందని, ఆయనకు సీసీసీ సీనియర్ ప్రముఖులు, మాజీ అధ్యక్షుడు హూ జింటావో జాంగ్ మద్దతు ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
భారత్‌పైన ప్రభావమెంత?
చైనాలో అధికార మార్పిడి భారత్‌కు కేవలం భౌగోళిక, రాజకీయ పరిణామమే కాదు ప్రత్యక్షంగా భద్రతాపరమైన ప్రభావాలకు దారితీస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టే కమాండర్లు అధికార కేంద్రాల వద్ద తమ విధేయతను చాటుకోవడానికి అరుణాచల్ ప్రదేశ్ లేక లద్ధాఖ్‌లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలు, పవర్ గ్రిడ్లు, ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై చైనా సైబర్ దాడులు చేయవచ్చని, అంతర్గతంగా అలజడిని సృష్టించేందుకు 2020లో చేసినట్లు నకిలీ వార్తలను ప్రచారం చేయడం వంటి చర్యలకు చైనా పాల్పడవచ్చని భారత నిఘా అధికారులు అంచనా వేస్తున్నారు.
సరిహద్దు వివాదంపై చర్చకు సిద్ధం
భారత్-చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు బీజింగ్ సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు వివాదాలు అత్యంత సంక్లిష్టమైనవని, పరిష్కారానికి సమయం పడుతుందని ఆమె చెప్పారు. అయినప్పటికీ డీలిమిటేషన్‌పై, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడటానికి చర్చలు జరపడంపై సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 5 వరకు రెండు వారాల పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రజలకు కనిపించకుండా పోవడంతో అధ్యక్ష మార్పు జరగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.