తొలుత పరిశ్రమలు.. ఆనక నివాసాలు!

Follow

- మరో 193 ఎకరాల అసైన్డ్ భూములకు ఎసరు
- సంగారెడ్డిలో నాయకులు, రియల్టర్ల కుమ్మక్కు
- ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ నోటిఫికేషన్
- ఇదివరకే 2109 ఎకరాల సేకరణకు ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): కొందరు అధికారపార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి కంపెనీల పేరుతో విలువైన భూములను చేజిక్కించుకునేందుకు హైడ్రామాకు తెరలేపారు. వారు ప్రభుత్వం భూసేకరణ చేయనున్నదని రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారినుంచి భూములను కొట్టేసేందుకు పకడ్బందీ పథకాన్ని అమలు చేస్తున్నారని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో 193ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు నెలల్లో మూడోసారి భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయడం ఈ ఆరోపణలకు బలాన్నిస్తున్నది. గతంలో ఏపీఐఐసీ ఏర్పాటుచేసిన పారిశ్రామికవాడలు ఇప్పుడు జనావాసాలుగా మారినట్టే మళ్లీ అదే తరహా కుయుక్తికి తెరతీసినట్టు తెలుస్తున్నది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలో 134 మంది రైతులనుంచి 193.14ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు బుధవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ భూములను పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం సేకరిస్తున్నట్టు తెలిపింది. ఈ భూములపై ఎటువంటి క్రయవిక్రయాలు, లావాదేవీలు జరపరాదని, అభ్యంతరం ఉన్నవారు 60 రోజుల్లోగా కలెక్టర్ లేక ఆర్డీవో కార్యాలయంలో తమ అభ్యంతరాలను నమోదు చేయవచ్చని కోరారు. ఇదిలావుండగా, గత నెల ఒకటిన నిమ్జ్ కోసం సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలంలోని గుంజేటి, మామిడిగి, గణేశ్‌పూర్ తదితర గ్రామాల పరిధిలో దాదాపు 800 మంది రైతులనుంచి 1456 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. మూడు నెలల క్రితం కూడా న్యాలకల్ మండలం హుసెల్లి గ్రామం పరిధిలో 491 మంది రైతుల నుంచి 653.08 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 2,302ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది.
అసలు కథ ఇది…!
ఈ భూసేకరణ వెనుక కథ వేరే ఉన్నదని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో భూముల విలువ భారీగా పెరగడంతో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. దీంతో స్థానిక అధికారపార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ఈ విలువైన భూములను చేజిక్కించుకునేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే వారి కన్ను పడిన భూముల్లో పారిశ్రామికవాడ వస్తున్నట్టు, త్వరలో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు ముందుగా ప్రచారం చేస్తారు. అనంతరం భూ యజమానులతో ధర మాట్లాడుకుంటారు.
ధర నిర్ణయం అయ్యాక.. అనుకున్నట్లుగానే ప్రభుత్వం నుంచి భూసేకరణ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ.10-15లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనుండగా, వీరు కూడా ముందు మాట్లాడకున్న విధంగా ఎకరాకు కొంత ముట్టజెప్తారు. అనంతరం టీజీఐఐసీ కంపెనీల పేరుతో వారు కోరుకున్న కంపెనీకి భూములను కేటాయిస్తుంది. మొదలు కంపెనీ పేర భూకేటాయింపు జరుగగా, అనంతరం కంపెనీ దివాళా తీసిందనే కారణంతో అక్కడ రియల్ ఎస్టేట్ టవర్లు ఏర్పడతాయి. ఒకవేళ అవి అసైన్డ్ భూములైతే వారికి రెట్టింపు లాభం వస్తుందని స్థానికులు చెప్తున్నారు. అసైన్డ్ భూములు ఇతరుల పేర రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం లేనందున ముందుగా ధర మాట్లాడుకొని వారి పట్టాలను ప్రభుత్వానికి సరెండర్ చేయిస్తారు. పట్టా భూములకన్నా అసైన్డ్ భూముల యజమానులకు కొంత తక్కువ ధర చెల్లిస్తారని, ఈ భూముల ద్వారా వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు చెప్తున్నారు.
సంగారెడ్డిలో ఆకాశాన్నంటుతున్న భూముల ధరలు..
సంగారెడ్డి, పటాన్‌చెరు తదితర ప్రాంతాలు ముంబై హైవేకు ఆనుకొని ఉండటం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ఇక్కడ భూముల ధరలు భారీగా పెరిగాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం ఎకరాకు రూ.50 లక్షలకు తక్కువలేదని, హైవేకు సమీపంలో ఉంటే మాత్రం ధర కోట్లల్లో పలుకుతున్నదని స్థానికులు చెప్తున్నారు. లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విలాసవంతమైన విల్లా ప్రాజెక్టులు భారీగా వస్తుండడంతో వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ ప్రాంతం హాట్ కేక్‌లా తయారైందని అంటున్నారు. దీంతో స్థానిక అధికారపార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల భూములను తక్కువ ధరలకు చేజిక్కించుకునేందుకు అనేక రకాల కుయుక్తులు పన్నుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ముందు కంపెనీ.. తరువాత రియల్ ఎస్టేట్
సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల్లో గతంలో ఏపీఐఐసీ ఏర్పాటుచేసిన పారిశ్రామికవాడలు చాలావరకు ఇప్పుడు జనావాసాలుగా మారిపోయాయి. వాటిల్లో బడా అపార్ట్‌మెంట్లు వెలిశాయి. గతంలో కొంతకాలం పరిశ్రమలుగా కొనసాగిన కంపెనీలు ఇప్పుడు కానరాకుండా పోయాయి. ఇందులో ఎక్కువశాతం ప్రభుత్వం నుంచి అరకొర ధరలకు భూములు కొనుగోలుచేసి, పరిశ్రమల కోసం ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు అందుకున్న కంపెనీలే ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు స్థానిక నేతలు, రియల్ వ్యాపారులు పరిశ్రమల పేరుతో భూములను పొంది అనంతరం రియల్ ఎస్టేట్‌కు ఉపయోగించుకోవచ్చనే వ్యూహంతో ఉన్నట్టు, ఇందులో భాగంగానే వరుస భూసేకరణ నోటిఫికేషన్లు జారీ అవుతున్నట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు అధికారపార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి కంపెనీల పేరుతో విలువైన భూములను చేజిక్కించుకునేందుకు హైడ్రామాకు తెరలేపారు.