దుమ్ముగూడెం మండలం @ ప్రటళ్ల పల్లి

Follow

- 1975లో గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నిర్మాణం
- నాడు సాగులో 1,500 ఎకరాలు.. నేడు 350 ఎకరాలు
- ‘సీతమ్మ సాగర్ బ్యారేజ్’ పూర్తయితే మునిగిపోనున్న నాటి ఎత్తిపోతల పథకం
- సున్నంబట్టి వద్ద తిరిగి నిర్మించేందుకు అప్పటి సీఎం కేసీఆర్ చొరవ
- రూ.650 కోట్లతో నిర్మించి 42 వేల ఎకరాలకు నీరిచ్చేందుకు ప్రణాళిక
- దుమ్ముగూడెం మండల రైతుల ఆశలన్నీ ప్రగళ్లపల్లి లిఫ్టుపైనే..
పర్ణశాల, జూన్ 29 : ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకంతో దుమ్ముగూడెం మండల రైతులకు విడదీయరాని బంధం ఉంది. 1975లో నిర్మించిన ఈ ప్రాజెక్టు కింద అప్పుడు 1,500 ఎకరాలు సాగులో ఉండేవి. కాలక్రమేణా వలస పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం 350 ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నాయి. అయితే దుమ్ముగూడెం ఆనకట్టపై సుమారు రూ.5 వేల కోట్లతో 36 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా సీతమ్మ బ్యారేజ్ నిర్మాణం జరుగుతున్నది. ఇది పూర్తయితే ప్రగళ్లపల్లి ప్రాజెక్టు పూర్తిగా గోదావరిలో మునిగిపోతుంది. వాస్తవానికి సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ బ్యారేజ్ నిర్మాణం వల్ల దుమ్ముగూడెం మండల రైతులకు ఎలాంటి ఉపయోగమూ లేదు.
దీంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సున్నంబట్టి వద్ద ప్రగళ్లపల్లి లిఫ్టు ఇరిగేషన్‌ను తిరిగి నిర్మించడానికి అధికారులను ఆదేశించారు. నిర్మాణ వ్యయం రూ.650 కోట్లుగా అంచనా వేశారు. ఇది పూర్తయితే సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. తాలిపేరు కాలువలకు అనుసంధానం చేస్తే మరో 12 వేల ఎకరాలు కలుపుకొని మొత్తం 42 వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీటిని అందించవచ్చు. దీంతో ఏజెన్సీలోనే అతిపెద్ద మండలమైన దుమ్ముగూడెం రైతులు ప్రగళ్లపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్వవైభవం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టును త్వరగా నిర్మించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు.
భద్రాద్రి జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలోని ప్రతి ఎకరాకూ నీరు అందాలంటే సున్నంబట్టి – ప్రగళ్లపల్లి మధ్య ఉన్న ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాల్సి ఉంటుంది. మండలంలో సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేస్తున్నారు. వర్షాలు కురిసి వాగులు, చెరువులు నిండితే పది వేల ఎకరాలకు, తాలిపేరు కాలువల ద్వారా మరో 12 వేల ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందుతోంది. వర్షాధారంపై ఆధారపడిన వ్యవసాయం అంతంత మాత్రమే ఉంటుంది. ప్రగళ్లపల్లి ప్రాజెక్టు పునర్మిర్మాణం చేపడితే మండలంలోని చివరి గ్రామాలకు సైతం పుష్కలంగా సాగునీరు అందుతుంది.
దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, కాశీనగరం గ్రామాల పరీవాహకంలో గోదావరి నదిపై 1975లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రగళ్లపల్లి లిఫ్టు ఇరిగేషన్‌కు శంకుస్థాపన చేసి నిర్మాణం చేపట్టారు. అప్పుడు ఈ ప్రాజెక్టు కింద సుమారు 1,500 ఎకరాల ఆయకట్టు ఉండేది. కాలక్రమంలో వలస పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం 350 ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్ముగూడెం ఆనకట్టపై సుమారు రూ.5 వేల కోట్లతో 36 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు.
అయితే దీనివల్ల దుమ్ముగూడెం మండల రైతులకు ఉపయోగం లేకపోవడంతో సున్నంబట్టి వద్ద ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ నిర్మిస్తే సుమారు 30 వేల ఎకరాలకు నీరు అందించవచ్చని, తాలిపేరు కాలువలకు అనుసంధానం చేస్తే మరో 12 వేల ఎకరాలను సాగులోకి తేవొచ్చునని అంచనా వేశారు. దుమ్ముగూడెం మండలంలోని ప్రతి ఎకరాకూ నీరు అందించాలంటే మూడు పంపులు ఏర్పాటు చేసి నిర్మాణం చేపట్టాలని సూచించారు. నిర్మాణం వ్యయాన్ని రూ.650 కోట్లుగా అంచనా వేశారు. ఆ సమయంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో మాట్లాడుతూ సున్నంబట్టి గ్రామం వద్ద ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సుమారు రూ.650 కోట్ల వ్యయాన్ని అంచనా వేశామని, నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, సీతమ్మ బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం గోదావరిలో మునిగిపోతుంది. ఎగువనున్న సున్నంబట్టి గ్రామం వద్ద ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం మళ్లీ నిర్మించాలంటే ముందుగా సీతమ్మ బ్యారేజ్ పూర్తి కావాల్సి ఉంది. దీంతో ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకంపైనే మండల రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు.
ప్రగళ్లపల్లి లిఫ్టును త్వరగా నిర్మించాలి..
సున్నంబట్టి వద్ద గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం (లిఫ్టు) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా నిర్మించాలి. దాన్ని నిర్మిస్తేనే దుమ్ముగూడెం మండలంలోని ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరందుతుంది. ప్రస్తుతం మండల గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములన్నీ వర్షాధారితమే.
-అర్జున్, సున్నంబట్టి గ్రామస్తుడు
42 వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు..
ఒకసారి అనుకోకుండా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసే అవకాశం వచ్చింది. నూతన పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలని చర్చ జరుగుతుండగా నన్ను కేసీఆర్ పలకరించారు. దుమ్ముగూడెం మండలంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. రైతులకు త్రీఫేస్ విద్యుత్ సమస్య ఉందని, ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకాన్ని మళ్లీ నిర్మిస్తే దుమ్ముగూడెం మండలంలో సుమారు 42 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే ఇరిగేషన్ అధికారులను పిలిపించిన కేసీఆర్.. ప్రాజెక్టు నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. తర్వాత అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు బీఆర్‌ఎస్ నాయకులు ఇక్కడ పర్యటించి వెళ్లారు. ప్రగళ్లపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాముఖ్యతను కేసీఆర్‌కు వివరించారు. ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకాన్ని తర్వగా నిర్మించి దుమ్ముగూడెం మండల రైతులకు మేలు చేయాలి.
– సాగి శ్రీనివాసరాజు, బీఆర్‌ఎస్ నాయకుడు, దుమ్ముగూడెం
గిరిజన రైతులకు ఎంతో ఉపయోగం..
దుమ్ముగూడెం మండల రైతులకు ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం కలల ప్రాజెక్టు. దీనిని నిర్మిస్తే మండల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని మండల రైతుల ఆశలన్నీ ఈ ప్రాజెక్టుపైనే ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే వ్యవసాయ పరంగా ఈ మండలం ఎంతో అభివృద్ధి చెందుతుంది.
-రేసు లక్ష్మి, మాజీ ఎంపీపీ,తాటివారిగూడెం
ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకంతో దుమ్ముగూడెం మండల రైతులకు విడదీయరాని బంధం ఉంది. 1975లో నిర్మించిన ఈ ప్రాజెక్టు కింద అప్పుడు 1,500 ఎకరాలు సాగులో ఉండేవి. కాలక్రమేణా వలస పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం 350 ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నాయి.