నేతన్నకు రుణ విముక్తి ఎప్పుడో.. కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన

Follow

- అమలుకు నోచుకోని చేనేత రుణమాఫీ
- గతేడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన
- మూడు నెలల క్రితమే నిధులు మంజూరు
- ఇప్పటి దాకా చిల్లిగవ్వ మాఫీ చేయని సర్కారు
- తాజాగా మార్గదర్శకాలతో ఇంకింత జాప్యం
- రాజీవ్ యువ వికాసానికీ నేతన్నలు దూరం..!
యాదాద్రి భువనగిరి, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేతన్నలకు రుణమాఫీ ఒకడుగు ముం దుకు..రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిం ది. ఇగో మాఫీ చేస్తం.. అగో చేస్తం.. అని ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కావడంలేదు. మాఫీ కోసం నిధులు మంజూరై మూడు నెలలు గడుస్తున్నా చిల్లి గవ్వ కూడా మాఫీ చేయలేదు. పైగా మార్గదర్శకాల పేరుతో ఇంకింత జాప్యం చేస్తున్నండటంతో నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చేనేత కార్మికులు మగ్గాలు ఏర్పాటుకు, ఉత్పత్తికి ముడి సామగ్రి కొనుగోలు చేయడానికి రుణాలు తీసుకుంటారు. ఇందులో ఎక్కువ భాగం కోఆపరేటివ్ సొసైటీలు, బ్యాంకుల ద్వారా పొందుతారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6వేల మంది వరకు రుణాలు తీసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే సుమారు 3వేల మంది వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు తీసుకున్న వారే అర్హులుగా గుర్తిస్తారు. ఎంత రుణం తీసుకున్నా రూ. లక్ష మాత్రమే మాఫీ అవుతుంది. రూ. లక్షకు మించి ఉంటే.. పై డబ్బులు చెల్లిస్తే రూ. లక్ష రుణం మాఫీ అవుతుంది. బ్యాం కుల ఒత్తిడి మేరకు కొందరు బయట అప్పు లు చేసి రుణాలు చెల్లించారు. ఇలా లోన్ క్లోజ్ చేసుకున్న వారికి కూడా స్కీం వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.
మార్చిలోనే నిధులు మంజూరైనా..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత రుణాలు మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అయితే గతేడాది సెప్టెంబర్ 9న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవం సం దర్భంగా రుణమాఫీపై పలు చేనేత కార్మిక సం ఘాలు సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టికి తీసుకెళ్లగా.. వెంటనే మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొంత కాలం పాటు స్తబ్ధుగా ఉన్నారు. ఆ తర్వాత జిల్లాల నుంచి రుణమాఫీ వివరాలన తెప్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 9న నిధులు మంజూరు చేస్తూ చేనేత, జౌళి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు మంజూరై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
మార్గదర్శకాల పేరుతో ఇంకింత జాప్యం..
చేనేత రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీన్ని అనుసరించి లబ్ధిదారుల జాబితాను తయారు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో జిల్లా కమిటీ ఉంటుంది. ఇక్కడ మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితాను తయారు చేస్తారు. ఈ కమిటీ ఆమోదం తర్వాత చేనేత శాఖ డైరెక్టర్ అధ్యక్షతన ఉండే రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రతిపాదనలు పంపిస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రుణమాఫీ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ జరగడానికి సుమారుగా రెండు నెలల వరకు సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. రైతు రుణమాఫీకి లేని మార్గదర్శకాలు నేతన్న రుణమాఫీకి ఎందుకని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కాగా గైడ్‌లైన్స్ పేరుతో పెద్ద సంఖ్యలో అనర్హులుగా పరిగిణించాలని ప్రభుత్వం భావిస్తున్నదనే ప్రచారం జరుగుతున్నది.
రాజీవ్ యువ వికాసానికి దూరం..!
రుణాలు మాఫీ కాకపోవడంతో నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాతవి క్లియర్ కాకపోవడంతో బ్యాంకుల్లో కొత్త రుణాలు అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక సర్కారు తీరుతో రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా రుణాలు పొందడానికి నేతన్నలు దూరం అయ్యే పరిస్థితి దాపురించింది. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా కచ్చితంగా దరఖాస్తుదారుడితోపాటు ఇంట్లోని కుటుంబ సభ్యుల రుణాలు, ఎన్‌పీఏను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు మాఫీ పూర్తి కాకపోవడంతో నేతన్నల కుటుంబ సభ్యులు పథకానికి అనర్హులుగా మారిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా రుణాలు ఇవ్వాలని నేతన్న కోరుతున్నారు.
రైతులకు లేని గైడ్‌లైన్స్ నేతన్నలకు ఎందుకు..?
చేనేత రుణానికి సంబంధించి డబ్బులు చెల్లించాలని, సిబిల్ స్కోర్ తగ్గుతుందని బ్యాంకోళ్లు ఫోన్లు చేసి ఒత్తిడి పెంచుతున్నారు. లక్ష రూపాయాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ నేటికి అమలుకు నోచుకోవడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను చిన్నచూపు చూస్తున్నది. రైతు రుణమాఫీ మాదిరిగానే నేతన్నలకు కూడా వర్తింపజేయాలి. రైతులకు లేని మార్గదర్శకాలు.. నేత కార్మికులకు ఎందుకు..?
– కొంక లక్ష్మీనారాయణ, భూదాన్‌పోచంపల్లి
రాష్ట్రంలో నేతన్నలకు రుణమాఫీ ఒకడుగు ముం దుకు..రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిం ది. ఇగో మాఫీ చేస్తం.. అగో చేస్తం.. అని ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కావడంలేదు.