నేను పేరుకే అధ్యక్షుడిని.. నేనెప్పటికీ..: బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు కీలక కామెంట్స్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

“నేను పేరుకే అధ్యక్షుడిని… నేనెప్పటికీ కార్యకర్తను… మీ సేవకుడినే..” అని బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్.రామచంద్రరావు అన్నారు. కార్యకర్తలే ఈ పార్టీకి నిజమైన సారథులని తెలిపారు.

“ఉమ్మడి ఏపీలో జనసంఘ్ అభ్యర్థి పోటీచేస్తే వెయ్యి ఓట్లు మాత్రమే వచ్చాయని, కమ్యూనిస్టు పార్టీ గెలిచింది. ఆనాడు జనసంఘ్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు టపాసులు కాల్చారు. ఇదేందని కమ్యూనిస్టులు అడిగితే గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని సంబురాలు చేసుకుంటున్నామని చెప్పారు.

ఇవాళ అదే ఉత్సాహంతో తెలంగాణలో 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ, 3 ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకున్నాం. పార్టీ కోసం సైకిల్ పై రాష్ట్రమంతటా తిరుగుతూ ఎంతో కష్టపడ్డాం. బీజేపీ ఈ స్థాయికి వచ్చిందంటే… ఎంతో మంది కార్యకర్తల, నాయకులు త్యాగాలున్నాయి. మీ చెమట కష్టంతోనే బీజేపీ ఎదిగింది. అందరి ఆశీస్సులతో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం గర్వంగా ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. నక్సలైట్ల తూటాలకు బలైన బీజేపీ నాయకుల బలిదానాలవల్లే పార్టీ ఈ స్థాయికి ఎదిగింది. బీజేపీ మాస్ క్యాడర్ పార్టీ… సిద్ధాంత బలమున్న పార్టీ. కలిసికట్టుగా పనిచేసి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దాం.

బీజేపీలో కొత్త, పాత అనే పంచాయితీ లేదు. నది ప్రవహించాలంటే కొత్త నీరు రావాల్సిందే. తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాల్సిందే. యువకుల్లారా… మహిళలారా… బీజేపీలోకి రండి. 33 శాతం రిజర్వేషన్ల అమలుతో మహిళలకు ఎన్నో అవకాశాలు రాబోతున్నాయ్. తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గెలుపే లక్ష్యంగా పనిచేస్తా.

బీఆర్ఎస్, కాంగ్రెస్ వాట్సాప్ వర్సిటీలను పెట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని పోరాడదాం. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులకు దమ్ముంటే… నేరుగా ఎదురుగా పోరాడదాం రండి. మీరు దమ్ములేని పిరికిపందలు కాబట్టే వెనుకుండి ఫేక్ న్యూస్ ప్రచారం, ట్రోల్ వంటివి చేస్తున్నారు. నేను క్రిమినల్ లాయర్ ను.. ఫేక్ న్యూస్ సూత్రధారులను బోనులో నిలబెట్టేందుకూ వెనుకాడను.

రామచంద్రరావు సౌమ్యుడు కాదు… ఏబీవీపీగా ఉన్నప్పుడే జైలుకు వెళ్లొచ్చినోడిని. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నోడిని. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నా సిద్ధాంతాన్ని వీడకుండా పనిచేసినోడిని. నేను సౌమ్యుడినే.. యుద్ధంలోకి దిగితే యోధుడినే… కత్తి దూయడంలో ముందుంటా. విద్యార్థులు, న్యాయవాదులతో, పేదల పక్షాన న్యాయ పోరాటం చేసినోడిని. ఇకపై తెలంగాణ ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలకు సిద్ధం. కలిసికట్టుగా అందరితో కలిసి పనిచేస్తా…. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తా” అని తెలిపారు.

​”నేను సౌమ్యుడినే.. యుద్ధంలోకి దిగితే యోధుడినే… కత్తి దూయడంలో ముందుంటా” అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *