నేలరాలిన వెలిశాల వేగుచుక్క మారేడుమిల్లి అడవుల్లో అస్తమించిన రవి

Follow

- హతమైన మావోయిస్టు ఆఖరి చర్చల నక్షత్రం
- భార్య సైతం గతంలోనే ఎన్‌కౌంటర్‌లో మృతి
- కడచూపు కోసం ఎదురుచూపులు
- అనేక జ్ఞాపకాలతో రంపచోడవరం వెళ్లిన కుటుంబం
వెలిశాలలో పొడిసిన ఎర్రపొద్దు మారేడుమిల్లిలో గూకింది. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో గాజర్ల కుటుంబ ఆఖరి చుక్క తెగిపడింది. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిపోసిన వెలిశాల నుంచి తుపాకీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందంటూ అడవిబాట పట్టిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. బుధవారం ఉదయం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రవి అస్తమించాడని తెలిసి వెలిశాల తల్లడిల్లింది. గణేశ్ ఎన్‌కౌంటర్ విషయాన్ని ఎవరూ నమ్మలేదు.
ఇలాంటి ఎన్‌కౌంటర్ పుకార్లు అనేకం విన్నాం..ఇదీ అలాంటిదేనని వెలిశాల నమ్మలేదు. భూపాలపల్లి ఎస్పీ కిరణ్‌కరే సమాచారంతో గాజర్ల కుటుంబం విశాఖపట్నం బయలుదేరటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వెలిశాలతోపాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా గాజర్ల కుటుంబ ఉద్యమప్రస్థానంపై విస్తృత చర్చ సాగుతున్నది. గాజర్ల రవి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, రవి చిన్ననాటి స్నేహితులు వారి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు మృతదేహాన్నే కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. ఇప్పుడు రవి మృతదేహాన్నైనా ఇస్తారా? లేదా? అని వెలిశాల ఎదురుచూస్తున్నది.
– జయశంకర్ భూపాలపల్లి, జూన్ 18 (నమస్తేతెలంగాణ)/ టేకుమట్ల/ సుబేదారి
వెలిశాల నుంచి ఏవోబీ దాకా
గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ విద్యార్థి దశలో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులై ఆర్‌ఎస్‌యూలో చేరారు. 1984 వరకు వెలిశాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి 1985లో హన్మకొండలో ఐటీఐ కోర్సులో చేరారు. ఐటీఐలో చదవుతూ ఆర్‌ఎస్‌యూలో కీలకంగా పనిచేశాడు. తను చదువుతున్న విద్యాలయంపై ఎర్ర జెండా ఎగురవేశారు. పోలీసులు ఆయన అరెస్టు చేశారు. ఐటీఐ అనంతరం వరంగల్‌లోని వివేకానంద కాలేజీలో ఇంటర్ చేశారు.
ఆ సమయంలో రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా పనిచేశాడు. వెలిశాల నీటి సంఘం ఎన్నికల్లో రవి సోదరుడు గాజర్ల సారయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దన ఓటమికి అగ్రవర్ణ ఆధిపత్యమే కారణమని భావించిన సారయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన అన్న సారయ్య బాటలో గాజర్ల రవి 1991లో అడవిబాట బట్టారు. రవి సుదీర్ఘ కాలం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పని చేశారు. 1994లో మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు.
ఆ సమయంలో మహదేవ్‌పూర్‌లోని లెంకలగడ్డ వద్ద మందుపాతర పేల్చిన ఘటనతో రవి సంచలనం రేపారు. ఉత్తర తెలంగాణలో జరిగిన అనేక ఎన్‌కౌంటర్ల నుంచి గణేశ్ తప్పించుకున్నదాఖలాలున్నాయని పోలీసు వర్గాల రికార్డు. మావోయిస్టు పార్టీ నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (ఎన్‌టీజడ్‌సీ) ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కేకేడబ్ల్యూ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి అక్కడి నుంచి ఏఓబీకి వెళ్లిపోయారు. ఏవోబీ కార్యదర్శిగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న క్రమంలో అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
వెలిశాల నుంచి ఎందరో..
వెలిశాలకు చెందిన గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, గాజర్ల రవి అలియాస్ గణేశ్, గాజర్ల అశోక్ అలియాస్ ఐతులు అజ్ఞాత బాట పట్టగా వారి వెంట గ్రామానికి చెందిన గంధం చుక్కయ్య, బండి కిష్టస్వామి, గాజర్ల రమేశ్ అలియాస్ నవీన్ సహా ఎంతో మంది అడవిబాట పట్టారు. అలా వెళ్లిన వారిలో గంధం చుక్కయ్య లొంగిపోగా బండి కిష్టస్వామి ఆయన భార్య హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, గాజర్ల రమేశ్ అలియాస్ నవీన్ లాదెళ్ల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. వెలిశాలను ఆనుకొని ఉన్న రామకృష్టాపూర్‌కు చెందిన ఎడ్ల చేరాలు, పిట్టల రఘు, ఆకునూరి శ్యాం, ఆకునూరి భాగ్య సహ మరొకరు ఉద్యమంలోకి వెళ్లారు. వీరిలో పిట్టల రఘు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా మిగిలినవారు లొంగిపోయారు. వెలిశాల, రామకృష్టాపూర్ చుట్టు పక్క గ్రామాల్లో అనేక మంది ఉద్యమబాట పట్టారు.
మా రవన్నకు ఏమీ కాదు..!
ఎన్‌కౌంటర్ వార్త తెలియగానే వెలిశాల గ్రామస్తులు మధ్యాహ్నం వరకూ నమ్మలేదు. మా రవన్నకు ఏమీ కాదు, ఇదివరకు అలాగే అన్నారు. తప్పకుండా బతికే ఉంటాడని ధీమాగా ఉన్నారు. కానీ మధ్యాహ్నం వరకు రవి కుటుంబ సభ్యులకు భూపాలపల్లి ఎస్పీ నుంచి సమాచారం రావడంతో వారు హుటహుటిన ఆంధ్రాలోని రంపచోడవరం బయల్దేరారు. ఆయ్యో బిడ్డా అంటు వెలిశాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లడిల్లారు.
చిన్నప్పటి నుంచి తిరిగిన స్నేహితులు, గ్రామస్తులు, వెలిశాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న స్నేహితులు తమతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. యుక్త వయసులోనే సేవాభావంతో ఉండే వ్యక్తి అని, ఉద్యమంతోనే తాను ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి 1992లో ఆడవి బాట పట్టి నేడు తుపాకీ తూటాలకు బలై 33 ఏళ్ల తర్వత విగతజీవిగా వెలిశాలకు వస్తున్నావా రవన్న అంటూ తోటి స్నేహితులు కన్నీళ్లు దిగమింగుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శవాన్ని అయినా ఇస్తారో, ఇవ్వరో కడసారి చూపైనా చూడాలంటూ గ్రామస్తులు ఆశతో ఎదురుసున్నారు.
వెలిశాలలో పొడిసిన ఎర్రపొద్దు మారేడుమిల్లిలో గూకింది. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో గాజర్ల కుటుంబ ఆఖరి చుక్క తెగిపడింది. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిపోసిన వెలిశాల నుంచి తుపాకీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందంటూ అడవిబాట పట్టిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది.