పసుపు బోర్డుకు మూడుసార్లు ప్రారంభోత్సవాలా?.. ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Asannagari Jeevan Reddy
  • నేమ్‌ప్లేట్‌ నిజామాబాద్‌లో.. పసుపు బోర్డు ఆఫీస్‌ ఢిల్లీలో
  • రైతులను మరోసారి మోసం చేసిన బీజేపీ సర్కార్‌
  • జిల్లా పర్యటనలో పసుపు మద్దతు ధరపై నోరు మెదపని అమిత్‌షా

ఖలీల్‌వాడి, జూన్‌ 30 : చట్టబద్ధత లేని పసుపు బోర్డుకు మూడుసార్లు ప్రారంభోత్సవాలు చేసి, రైతులను మోసం చేసిన ఘనత బీజే పీ ప్రభుత్వానికే దక్కిందని బీఆర్‌ఎస్‌ పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. పసుపు బోర్డు నేమ్‌ప్లేట్‌ నిజామాబాద్‌లో ఉన్నదని, ఆఫీస్‌ కార్యకలాపాలు మాత్రం ఢిల్లీలో కొనసాగుతున్నాయని, దీంతో జిల్లా పసుపు రైతులకు ఒరిగేదేమిటని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి, ప్రజలను మభ్య పెట్టిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పదేండ్ల తర్వాత కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు.

పసుపు బోర్డు స్థానంలో స్పైసెస్‌ బోర్డు ఎక్స్‌టెన్షన్‌ కార్యాలయాన్ని సాధించానని ఇప్పటివరకు చెప్పుకున్నారని గుర్తుచేశారు. పసుపు బోర్డు కన్నా స్పైసెస్‌ బోర్డు మేలంటూ గప్పాలు కొట్టిన అర్వింద్‌ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారని విమర్శించారు. పసుపు బోర్డు కావాలని అడిగే వారంతా బుద్ధిహీనులంటూ తిట్టిపోసిన అర్వింద్‌ ఇప్పుడు పసుపు బోర్డును తానే సాధించానని ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతుల పోరాటం ఫలితంగానే నామమాత్రంగానైనా పసుపు బోర్డు వచ్చిందని తెలిపారు.

కేసీఆర్‌ కట్టించిన భవనమే దిక్కాయే!

పదేండ్లలో కేసీఆర్‌ ఏం చేశారని పదేపదే ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులకు అదే కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన భవనమే పసుపు బోర్డుకు దిక్కవడమే దీటైన సమాధానమని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రూరల్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని పసుపు బోర్డు కోసం ఎంచుకున్న బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్‌ను విమర్శిస్తారని ధ్వజమెత్తారు.

మద్దతు ధరపై మాట తప్పారు..

పసుపు రైతులకు క్వింటాలుకు రూ.15 వేల మద్దతు ధర ఇస్తామని ప్రకటించి మాట తప్పారని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దళారులు సిండికేట్‌గా మారి రైతులను నిండా ముంచుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పసుపునకు రూ.15 వేల మద్దతు ధర కల్పించడంపై అమిత్‌షా నోరు మెదపకపోవడం రైతులను మోసగించడమే అవుతుందని
పేర్కొన్నారు.

నిధులివ్వరు.. వసతులు కల్పించరు..

గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా ఇందూరు గడ్డమీద ప్రకటించారని, ఏడాదైనా కార్యరూపం దాల్చలేదని తెలిపారు. దీంతో పసుపు రైతుల్లో అసంతృప్తి చెలరేగుతున్న తరుణంలో హడావుడిగా గత జనవరి 14న పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ వర్చువల్‌గా ప్రారంభించారని, ఇప్పుడు అదే కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్‌షా మరోసారి ప్రారంభించి నవ్వుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. ఒక బోర్డుకు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. నిధులు ఇవ్వకుండా వసతులు కల్పించకుండా అద్దె భవనాల్లో ప్రారంభోత్సవాల మీద ప్రారంభోత్సవాలు చేస్తూ ఇంకెంత కాలం రైతులను మోసగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ట్టబద్ధత లేని పసుపు బోర్డుకు మూడుసార్లు ప్రారంభోత్సవాలు చేసి, రైతులను మోసం చేసిన ఘనత బీజే పీ ప్రభుత్వానికే దక్కిందని బీఆర్‌ఎస్‌ పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *