పాశమైలారం ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు..

Follow

CM Revanth Reddy: పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాదస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. రేవంత్ వెంట మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజనర్సింహా తదితరులు ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అధికారులకు కీలక సూచనలు చేశారు.
ప్రమాదం జరిగిన తీరు, పరిశ్రమలకు సంబంధించిన విషయాలపై పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులతో రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో పరిశ్రమలశాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా..? బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా..? అని అధికారులను ప్రశ్నించారు. ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దు.. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని, నిపుణులతో చర్చించిన తరువాతే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పాశమైలారం పారిశ్రామిక వాడలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఫ్యాక్టరీలపైకూడా నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక అధికారులతో కాకుండా బయట నుంచి అధికారులను పిలిపించి విచారణ జరిపించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ కు సూచించారు. ఘటన జరిగి 24గంటలు గడిచినా యాజమాన్యం ఇంకా ఘటనాస్థలికి రాలేదని, ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి శ్రీధరబాబు అన్నారు. కంపనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, క్షతగాత్రుల వైద్యంకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని ప్యాక్టరీ యాజమాన్యం చెప్పింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 37 మంది చనిపోయినట్లు తెలిసింది. మృతుల సంఖ్య ఇంకా పేరిగే అవకాశం ఉంది.
పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాదస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.