పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: రేవంత్‌ రెడ్డి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
CM Revanth Reddy

Pashamilaram incident : పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాద‌స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాశమైలారం బాధితులకు తెలంగాణ సర్కార్‌ తక్షణ సాయం అందజేస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున అందిస్తామని అన్నారు.

ఇది నష్టపరిహారం కాదని అధికారులకు రేవంత్ సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకుంటామని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ ఘటన దురదృష్టకరం, విషాదమైంది. తెలంగాణలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఘటన పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులకు ఆదేశం ఇచ్చామని రేవంత్ అన్నారు. మృతుల్లో బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల వారు ఉన్నారు. 143 మంది ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీ వద్ద ఉన్నారు. 53 మంది బయటే ఉన్నారు. అధికారికంగా 36 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం, పరిశ్రమ తరుపున కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించాం. తీవ్రంగా గాయాలపాలైన వారికి 10లక్షల రూపాయలు, కొంతకాలం పని చేయలేని వారికి 5లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎవరిది నిర్లక్ష్యం అనేది కమిటీ నివేదికలో తెలుస్తుంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నాం. గాయపడ్డ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది. గాయపడ్డ కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం తరపున విద్యను అందించేలా చూసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలను కూడా కలిశాను. మృతదేహాలను వారివారి స్వగ్రామాలకు పంపించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

​పాశమైలారం బాధితులకు తెలంగాణ సర్కార్‌ తక్షణ సాయం అందజేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *