పీఎంశ్రీ నిధుల దుర్వినియోగం?

Follow

- కౌడిపల్లి మండలంలో పలు పాఠశాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు
- జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని పలువురి డిమాండ్
కౌడిపల్లి, జూన్ 18: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పాఠశాలకు పేజ్-1 కింద రూ.10 లక్షల నిధులు పీఎంశ్రీ పథకం ద్వారా మంజూరయ్యారు. రెండో విడతలో పేజ్-2 కింద కౌడిపల్లి బాలుర ఉన్నత పాఠశాలకు రూ. 7.95 లక్షల నిధులు మంజూరయ్యాయి. బుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో అధిక మొత్తంలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులను ఫీల్డ్ విజిట్, టూర్‌కు తీసుకెళ్లేందుకు తక్కువ వ్యయం చేసి, ఎక్కువ నిధులు ఖర్చుచూపెట్టి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
విద్యార్థులను ఫీల్డ్ విజిటింగ్ నిమిత్తం బుజిరంపేట నుంచి మెదక్ చర్చికి బస్సులో తీసుకెళ్లినందుకు రూ.86,500 ఖర్చు అయినట్లు లెక్క చూపించి చెక్కును హెచ్‌ఎం తండ్రి పేరున రాసిచ్చినట్లు తెలిసింది. ఫీల్డ్ విజిట్ నిమిత్తం తునికిలోని రామానాయుడు విజ్ఞాన జ్యోతి విద్యాసంస్థలకు డీసీఎంలో విద్యార్థులను తీసుకెళ్లినందుకు రూ.46వేలు ఖర్చు చూపించారు. హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియాన్ని చూపించడానికి బస్సులో తీసుకెళ్లినందుకు రూ.49వేలు ఖర్చుచేసినట్లు లెక్కలు చూపించారు. సామాజిక విద్యా అవగాహనపై విద్యార్థులకు ఆట వస్తువులు, స్టేషనరి కొనుగోలుకు దాదాపు రూ.30 వేలు ఖర్చుచేశారు. విద్యార్థికి రూ.500 చొప్పున రూ.68వేలు ఖర్చు చేసినట్లు చూపించారు.
పీఎంశ్రీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరైతే రూ.8లక్షల ఖర్చు చూపించి పాఠశాల ప్రాంగణంలో శాశ్వత ఆట వస్తువుల నిర్మాణానికి రూ.2లక్షలు ఖర్చు చేయకుండా బ్యాంకు ఖాతాలో ఉంచినట్లు తెలిసింది. కౌడిపల్లి బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఇద్దరు ఆయాలను నియమించి వారికి సగం చొప్పున వేతనాలు చెల్లించి, మిగతా సగం వేతనాలు తన భర్త ఖాతాలో జమచేసిన విషయం మీడియా ద్వారా వెలుగుచూసింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పీఎంశ్రీ నిధుల వినియోగంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయపై బుజిరంపేట హెచ్‌ఎంను ‘నమస్తే తెలంగాణ’వివరణ కోరగా.. తమ పాఠశాలకు రూ.10లక్షల నిధులు మంజూరు కాగా, రూ.8.08 లక్షలు ఖర్చుచేశామని, మిగతా డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పాఠశాలకు పేజ్-1 కింద రూ.10 లక్షల నిధులు పీఎంశ్రీ పథకం ద్వారా మంజూరయ్యారు. రెండో విడతలో పేజ్-2 కింద కౌడిపల్లి బాలుర ఉన్నత పాఠశాలకు రూ. 7.95 లక్షల నిధులు మంజూరయ్యాయి.