పెద్దపల్లి బస్‌ డిపో సేవలు ప్రారంభమెప్పుడు?​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Karimnagar4
  • ఆఫీసులు ఖాళీ చేసి స్థలాలు అప్పగించినా ముందుకు సాగని ప్రక్రియ
  • అలాట్‌మెంట్‌ కాని బస్సులు.. ప్రారంభం కాని డిపో సేవలు
  • ప్రయాణికుల ఇబ్బందులు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మిగులుతున్నది. గతేడాది ప్రభుత్వం మంజూరు చేసినా, సేవల ప్రారంభం, నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. పాత బస్టేషన్‌ సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఖాళీ చేయించి, 4.31 ఎకరాల స్థలాన్ని అప్పగించినా ప్రక్రియ ముందుకు సాగకపోవడం, బస్సులు అలాట్‌మెంట్‌ కాకపోవడంపై ప్రయాణికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.

పెద్దపల్లి, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తికావస్తున్నది. గోదావరిఖని, మంథనిలో డిపోలున్నా పెద్దపల్లిలో లేక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎన్నో రోజులుగా ఉన్నది. ఈ క్రమంలో గతేడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపల్లికి డిపో మంజూరు చేసింది.

డిపోకు కావాల్సిన స్థలం కోసం అన్వేషణ చేయగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆనుకొని ఉన్న ఎంపీడీఓ కార్యాలయ సముదాయంతోపాటు సమీపంలోని మరికొన్ని కార్యాలయాలను ఖాళీ చేయించి, సర్వే నంబర్‌ 592, సర్వే నంబర్‌ 589లో 4.31ఎకరాల స్థలాన్ని నూతన డిపోకు కేటాయిస్తూ గతేడాది సెప్టెంబర్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు.

డిపో నిర్మాణానికి ఆర్టీసీ బోర్డు 11కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేయగా, గత డిసెంబర్‌ 4న పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం బహిరంగ సభకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి వేదికపై నుంచే వర్చువల్‌గా డిపో పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తయినా ఇంకా నిర్మాణ పనులు మొదలు కాలేదు.

కార్యాలయాలు ఖాళీ చేసి అప్పగించి నెలలు గడుస్తున్నా పనులు చేపట్టకపోవడం, బస్సుల అలాట్‌మెంట్‌, అధికారులు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేసి సేవలను ప్రారంభించాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేస్తుండడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అదే ములుగుకు మంజూరు చేసిన డిపోను నిర్మాణ పనులతో సంబంధం లేకుండా సేవలను ఇటీవల ప్రారంభించారని, పెద్దపల్లిలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే సేవలను ప్రారంభించాలని జిల్లా కేంద్రం ప్రజలు, ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

​పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మిగులుతున్నది. గతేడాది ప్రభుత్వం మంజూరు చేసినా, సేవల ప్రారంభం, నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *