పేదల భూములపై సర్కారు కన్ను!​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Assigned Lands
  • అసైన్డ్‌ భూములను చెరబడుతున్న రేవంత్‌ సర్కార్‌
  • పారిశ్రామిక పార్కుల పేరిట పేదలు, దళితుల భూములకు ఎసరు
  • ఆరూర్‌లో 193 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌
  • ప్రభుత్వం తీరుపై రైతుల ఆగ్రహం
  • భూములు ఇచ్చేందుకు నిరాకరణ
  • ఇటీవలే చెర్యాల్‌లో 120 ఎకరాల అసైన్డ్‌ భూముల సేకరణకు నోటిఫికేషన్‌
  • రెండువారాలు గడవకముందే ఆరూర్‌లో భూసేకరణకు మరో నోటిఫికేషన్‌
  • త్వరలో కొండాపూర్‌, సంగారెడ్డి మండలాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌..?
  • ప్రభుత్వం తీరుపై దళిత, పేద రైతులు, ప్రతిపక్షాల ఆగ్రహం

సంగారెడ్డి,జూన్‌ 18(నమస్తే తెలంగాణ) : అసైన్డ్‌ భూములను రేవంత్‌ సర్కార్‌ చెరబడుతోంది. పేద రైతులు, దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను పారిశ్రామిక పార్కుల పేరిట తిరిగి లాక్కుంటున్నది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్యాల్‌లో పారిశ్రామిక పార్కు కోసం 120 ఎకరాల అసైన్డ్‌ భూముల సేకరణకు ఇటీవలే సర్కార్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా సదాశివపేట మండలం ఆరూర్‌లో పారిశ్రామిక పార్కు పేరిట మరో 193 ఎకరాల అసైన్డ్‌ భూముల సేకరణకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. చెర్యాల్‌లో భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చి రెండు వారాలు గడవక ముందే, ప్రభుత్వం ఆరూర్‌లో భూసేకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేయడం గమనార్హం. త్వరలోనే కొండాపూర్‌, సంగారెడ్డి మండలాల్లో సైతం పారిశ్రామిక పార్కుల ఏర్పా టు కోసం అసైన్డ్‌ భూములు సేకరించేందు కు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది.

కొండాపూర్‌ మండలంలో 200 నుంచి 300 ఎకరాలు, సంగారెడ్డి మండలంలో సైతం 200 ఎకరాలకు పైగా అసైన్డ్‌భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారంలోకి వస్తే అసైన్డ్‌ భూములపై పేద, దళిత, గిరిజన రైతులకు హక్కు లు కల్పిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ లు ఇచ్చింది. తీరా ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో వరుసగా పేద, దళిత రైతుల అసైన్డ్‌ భూములు పారిశ్రామిక పార్కుల పేరిట తిరిగి స్వాధీనం చేసుకోవడంపై అసైన్డ్‌ భూముల రైతులు, ప్రతిపక్షాలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నాయి.

దశాబ్దాల క్రితం జీవనోపాధి కోసం పేదలు, దళిత, గిరిజనులకు ఇచ్చిన భూములను పారిశ్రామిక పార్కుల పేరిట తిరిగి తీసుకోవడం సరికాదని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. చెర్యాల్‌, ఆరూర్‌ గ్రామాల్లో జాతీ య రహదారికి సమీపంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే, పంటలు పండే భూములను ప్రభుత్వం పరిశ్రమల కోసం సేకరించడంపై రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు విలువ తక్కువగా ఉన్న, పరిశ్రమల ఏర్పాటు కోసం డిమాండ్‌ చేస్తున్న నారాయణఖేడ్‌ లాంటి ప్రాంతంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని, తద్వారా రైతులకు తక్కువ నష్టం జరగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

సంగారెడ్డి, కొండాపూర్‌ మండలాల్లో త్వరలో భూసేకరణ?

రేవంత్‌ సర్కార్‌ సంగారెడ్డి నియోజకవర్గంలోని అసైన్డ్‌ భూములపై కన్నేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక పార్కుల పేరిట అసైన్డ్‌భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడంపై రైతు లు, ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు. చెర్యాల, ఆరూర్‌లో అసైన్డ్‌భూముల సేకరణకు నోటిఫికేషన్లు జారీ కాగా, త్వరలో సంగారెడ్డి, కొండాపూర్‌ మండలాల్లో సైతం అసైన్డ్‌భూముల సేకరణకు ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. సంగారెడ్డి మండలం ఫసల్‌వాది లో సర్వే నెంబరు 543లో సుమారు 200 ఎకరాలకుపైగా అసైన్డ్‌ భూమి ఉన్నట్లు సమాచారం.

పారిశ్రామిక పార్కు పేరిట సర్వేనెంబరు 543లో 150 ఎకరాలకుపైగా అసైన్డ్‌భూములను సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. కొండాపూర్‌ మండలంలోని మునిదేవునిపల్లిలోని సర్వేనెంబరు 92లో సుమారు 400 ఎకరాల వరకు అసైన్డ్‌, ప్రభుత్వ భూమి ఉంది. సర్వేనెంబరు 92లో జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ కంపెనీల ఏర్పాటుకు అసైన్డ్‌భూముల సేకరణకు ప్రభు త్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొం డాపూర్‌ మండలంలోని మాందాపూర్‌లో ని సర్వే నెంబరు 22లోని సైతం పరిశ్రమల కోసం అసైన్డ్‌భూముల సేకరణకు ప్రభు త్వం నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలు ఉన్న ట్లు తెలిసింది. సంగారెడ్డి నియోజకవర్గం లో అసైన్డ్‌భూముల సేకరణ వెనుక జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ కీలక నాయకుడి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

అరూర్‌లో 193 ఎకరాలపై కన్ను

కాంగ్రెస్‌ సర్కార్‌ పారిశ్రామిక పార్కుల పేరిట సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారులకు సమీపంలోని విలువైన అసైన్డ్‌ భూముల సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇటీవల కంది మండలం చెర్యాల్‌లో హైదరాబాద్‌-ముంబై హైవేకు సమీపంలో సర్వేనెంబరు 741లోని 120 ఎకరాల అసైన్డ్‌ భూముల సేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఐఐటీ హైదరాబాద్‌కు సమీపంలోని విలువైన, పంటలు పండే భూములు ఇచ్చేందుకు దళిత, పేద రైతులు నిరాకరిస్తున్నారు.

దీంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇది ఇలా ఉండగానే ప్రభుత్వం పారిశ్రామిక పార్కు పేరిట బుధవారం సదాశివపేట మండలం ఆరూర్‌లోని హైదరాబాద్‌-ముంబయి జాతీయ రహదారికి సమీపంలోని 193.14 ఎకరాల అసైన్డ్‌భూముల సేకరణకు నోటిఫికేషన్‌ జారీచేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దశాబ్దాల క్రితం 134 మంది దళిత, పేద రైతులకు ఇచ్చిన 193.14 ఎకరాల అసైన్డ్‌ భూములను పారిశ్రామిక పార్కు కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సర్వే నెంబరు 224లో 44 ఎకరాలు, సర్వే నెంబరు 263లో 80.34 ఎకరాలు, సర్వే నెంబరు 268లో 68.20 ఎకరాల అసైన్డ్‌ భూములను పరిశ్రమల కోసం ప్రభుత్వం సేకరించనున్నది.

ప్రభుత్వం సేకరించ తలపెట్టిన భూములు పంటలు పండేవి. అలాగే ఈ భూముల విలువ ఎకరం రూ. కోటి నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతున్నాయి. ఇంత విలువైన భూములను అప్పనంగా అప్పగించేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఇరు పక్కల పెద్దల భూములు ఉన్నప్పటికీ, వాటి జోలికి వెళ్లకుండా పేద రైతులకు ఇచ్చిన అసైన్డ్‌భూములను మాత్రమే ప్రభుత్వం సేకరించే ప్రయత్నం చేయడంపై రైతులు రగిలిపోతున్నారు.

​అసైన్డ్‌ భూములను రేవంత్‌ సర్కార్‌ చెరబడుతోంది. పేద రైతులు, దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను పారిశ్రామిక పార్కుల పేరిట తిరిగి లాక్కుంటున్నది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్యాల్‌లో పారిశ్రామిక పార్కు కోసం 120 ఎకరాల అసైన్డ్‌ భూముల సేకరణకు ఇటీవలే సర్కార్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *