ప్రాజెక్టులతో పర్యావ‘రణం’

Follow
విభిన్న సంసృ్కతులు, కీలక పర్యావరణ వ్యవస్థలతో జీవవైవిధ్య హాట్ స్పాట్ ఈశాన్య భారతం. వనరుల దోపిడీకి నెలవుగా మారింది. బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో విస్తారమైన ఖనిజ సంపదను ఉపయోగించుకునే యత్నాలు చేస్తున్నాయి. అసోంలోని గౌహతి సమీపంలో సోనాపూర్‌లో జరిగిన రెండో జియాలజీ, మైనింగ్ శాఖ మంత్రుల సమావేశంలో ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశం అయింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఖనిజ సంపన్న భూమిని గుర్తించింది. దీనివల్ల దాదాపు 3 వేల విభిన్న గనులు ఉపయోగంలోకి వస్తాయి. అదే సమయంలో సిక్కింలోని తీస్తా, అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ వంటి నదులపై భారీ ఎత్తున డామ్‌లు, జలవిద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేందుకు పెద్ద ఇంధన కంపెనీలు, ప్రభుత్వ రంగంలోని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌ఇఇపిసిఒ) వంటి సంస్థలు ముందుకు వస్తున్నాయి.
ప్రభుత్వాలు చొరవతో ఆర్థికాభివృద్ధికి హామీ ఇస్తున్నా, తీవ్రమైన పర్యావరణ, సామాజిక ముప్పు పొంచి ఉంది. ఈశాన్య భారతం పర్యావరణ సమతుల్యత, వ్యవసాయ ఉత్పాదకత, టూరిజం, మొత్తం సుస్థిరతకు ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయి. పరిఢవిల్లుతున్న ఖనిజాలు, వాగ్దానాలు, ప్రమాదాలు ఈశాన్య ప్రాంతంలో సున్నపురాయి, బొగ్గు, చమురు వంటి ముఖ్యమైన ఖనిజ సంపద ఉంది. మైనింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వాలు, చమురు అన్వేషణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌యు)లో ప్రయత్నిస్తున్నాయని కేంద్ర గనుల శాఖమంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
జిఎస్‌ఐ సాగిస్తున్న పరిశోధనలు ఈ ప్రాంతాన్ని మైనింగ్ హబ్‌గా మారుస్తుందని కేంద్ర గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు అన్నారు. అసోంలోని దిమా హసావో జిల్లాలోని ఉమ్రాంగ్సో ప్రాంతంలో ఏడు సున్నపురాయి బ్లాక్‌లను వేలం వేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Chief Minister Himanta Biswa Sarma) ప్రకటించారు. ఇప్పటికే ఐదు బ్లాక్‌ల వేలం పూర్తయింది. మిగిలిన రెండు బ్లాక్‌లను 2025 ఆగస్టు నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. బ్రిటీష్ కాలం నాటినుంచి ఈశాన్య భారతంలో వనరుల దోపిడీ సాగుతోంది. అప్పట్లోనే చమురు అన్వేషణ, వనరుల వెలికితీత సాగింది. భారతదేశం చమురు, ఖనిజ ఉత్పత్తికి గణనీయంగా దోహదపడుతున్నప్పటికీ స్థానిక ప్రజల ప్రయోజనాలు పరిరక్షించబడడం లేదు. అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు ఈ ఖనిజ సంపదవల్ల వస్తున్న సంపద, ఆదాయం తక్కువ.
ఈ ప్రాంతంలో మైనింగ్‌ను క్రమబద్ధీకరించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణనష్టం అవుతోంది. పర్యావరణ వ్యవస్థ కూడా క్షిణిస్తోంది. అసోంలోని కర్సీ అంగ్లాంగ్ జిల్లాలో ర్యాట్ -హోల్ బొగ్గు తవ్వకాలవల్ల ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రాణ నష్టం అందుకు ఉదాహరణ. చెట్ల నరికివేత, అటవీ నిర్మూలన, కొండలు యథేచ్ఛగా తవ్వివేయడం, చిత్తడి నేలల నాశనం కారణంగా ఈ ప్రాంతంలో తరచు కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతోంది. పెద్ద ఎత్తున మైనింగ్ వల్ల పర్యావరణానికి, ఈ ప్రాంత సుస్థిరతకు ప్రమాదకరంగా పరిణమించేలా ఉంది. ఒకపక్క ఖనిజాల తవ్వకం, మరో పక్క జలవిద్యుత్ ఈశాన్య ప్రాంతం బిజీగా చేసింది. సిక్కింలోని తీస్తా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ నదులపై పెద్ద ఆనకట్టలను నిర్మిస్తున్నారు. పెద్ద ఇంధన కంపనీలు, ప్రభుత్వ రంగ ఎన్‌ఇఇపిసిఒ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి.
వాటిలో 2,000 మెగావాట్ల సుబన్సరి దిగువ జలవిద్యుత్ ప్రాజెక్టు, సియాంగ్ ఎగువన బహుళార్థ సాధక ప్రాజెక్టు ఉన్నాయి. 520 మెగావాట్ల తీస్తా స్టేజ్ 5 ప్రాజెక్టు ప్రతిపాదనను ఈ మధ్య రద్దు చేశారు. ఈ ప్రాంతంలోని నదులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇంధనం, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు చేశారు. కానీ, ఇవి పర్యావరణానికి గణనీయంగా ముప్పుగా మారాయి. సామాజికంగా చాలా నష్టాన్ని తెస్తాయి. ఆనకట్టల నిర్మాణం నదీప్రాంత పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. అడవులు, వ్యవసాయ భూములను ముంచెత్తుతాయి. స్థానిక ప్రజలు స్థానభ్రంసం పొందుతారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్ నది అక్కడి ఆదివాసులు, గిరిజన తెగలకు జీవనాడి. ప్రతిపాదనలో ఉన్న మెగా ఆనకట్టలవల్ల ముప్పును ఎదుర్కొంటున్నారు. ఆనకట్టలు నీటి ప్రవాహాన్ని మార్చగలవు జీవవైవిధ్యాన్నీ నాశనం చేయగలవు.ఇప్పటికే భూకంపాలకు గురయ్యే ప్రాంతంలో భూకంప ప్రమాదాలను మరింత పెంచుతాయి.
సిక్కింలోని తీస్తా నది ఒకప్పుడు సహజమైన నీటి వనరు. దానిపైన భారీ ప్రాజెక్టులు వచ్చాయి. తీస్తా స్టేజ్ 3, 4 వంటి ప్రాజెక్టులవల్ల నదీ గర్భం క్షిణించింది ప్రవాహ వేగం తగ్గింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదాలను పెంచేందుకు తోడ్పడింది. 2013లో సిక్కింలోని తీస్తా డ్యామ్ తెగిపోవడంతో వరదలు సంభవించి, ప్రాణనష్టం జరిగింది. ఈ ఘటన ఈ ప్రాంతం ఇలాంటి ప్రాజెక్టులకు ఎంత దుర్బలంగా ఉంటుందో తెలుపుతోంది. ఎన్‌ఇఇపిసిఒ ప్రమేయం, రాష్ట్రం పర్యావరణ పరిరక్షణ చర్యల కన్నా పవర్ ఉత్పత్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రాజెక్టుల ప్లానింగ్ లోపాలవల్ల ఆనకట్టల దిగువ వరదలకు, నేలకోత మత్య్స సంపద నష్టానికి దారితీస్తున్నాయి. ప్రజల వ్యవసాయం, జీవనోపాధిపైన ప్రభావం చూపాయి. తీస్తా వంటి నదులపై బహుళ ఆనకట్టల కారణంగా సిక్కింలో కీలకమైన పర్యావరణాన్ని దెబ్బతీసింది. ప్రాజెక్టులతో సుందరమైన ప్రకృతి దృశ్యాలు కనుమరుగయ్యాయి.
కార్పొరేట్ దిగ్గజాల మద్దతుతో బిజెపి ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు ప్రాజెక్టుల మంజూరుపైనే తప్ప స్థానిక ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణను పట్టించుకోవడం లేదని, లాభాలు, జాతీయ ఇంధన లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని పర్యవరణ నిపుణులు వాదిస్తున్నారు. ఈశాన్యంలోని కొండ ప్రాంతాలు, భూకంపాలుకు నెలవు. ఇక్కడి దట్టమైన అటవీప్రాంతం కీలకమైనది. సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాలలో కొండచరియలు విరిగి పడే ముప్పు ఉంది. మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకోసం అటవీ నిర్మూలన, కొండలను తవ్వివేయడం వల్ల, చిత్తడి నేలలను చదునుచేయడం వల్ల పర్యావరణ సమస్య మరింత హెచ్చుతుంది. ఆనకట్టల వల్ల నదీ తీరాలు మార్పునకు లోనై, ఆకస్మికంగా ప్రవాహాలు పెరిగే ప్రమాదం మరింత హెచ్చుతుంది. వీటి వల్ల కొండచరియలు విరిగిపడడం, వరదలకు దారితీస్తుంది.
వరద నియంత్రణ, జీవవైరుధ్యానికి కీలకమైన ఈ ప్రాంతంలో భూములు ఆక్రణలకు గురవుతాయి. ఫలితంగా పర్యావరణ ప్రమాదాలు హెచ్చుతాయి. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈశాన్య ప్రాంత ఖనిజ, జలవిద్యుత్ సామర్థ్యం ఆర్థిక వృద్ధిని నడిపించగలదు. మైనింగ్, ఆనకట్టల నిర్మాణాల్లో ప్రమాదాలను అరికట్ట్టేందుకు కఠినమైన నిబంధనలు అనుసరించడం, పర్యావరణ ప్రభావం అంచనా సమాజ ప్రమేయం చాలా అవసరం. మైనింగ్ విషయంలో శాస్త్రీయ పద్ధతులనే అనుసరించాలి. ర్యాట్ హోల్ మైనింగ్ కార్యకలాపాలను నిషేధించాలి. ఆనకట్టలు ప్రాజెక్టులు పర్యావరణానికి అంతరాయాన్ని తగ్గించడానికి, చిన్న, నదీ ప్రవాహాల వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు స్థానిక వనరుల వల్ల నేరుగా ప్రయోజనం పొందేలా చూడాలి. పర్యాటకం, సేంద్రీయ వ్యవసాయం, పునర్వినియోగ ఇంధన ప్రత్యామ్నాయాలు, సౌరశక్తి, సూక్ష్మ- జలవిద్యుత్ ప్రాజెక్టులువంటి పెట్టుబడి పెట్టాలి.
ఈ ప్రాంతంలోని చిత్తడి నేలలు, అడవులు, నదులను సంరక్షించడం, పర్యావరణ పరంగానే కాక ఆర్థిక అవసరం కాదు. దీనివల్ల వ్యవసాయం, టూరిజం, సాంసృ్కతిక వారసత్వానికి మద్దతు లభిస్తుంది. ఈశాన్య ప్రాంతం ఒక కీలక దశలో ఉంది. ఈ ప్రాంతంలో ఖనిజసంపద, జలవిద్యుత్ సామర్థ్యం అభివృద్ధిని వేగవంతం చేయవచ్చు. కానీ, మైనింగ్, మెగా- డ్యామ్‌ల ద్వారా జరుగుతున్న దోపిడీ ప్రస్తుతం పరిణాలు ఈశాన్య ప్రాంతాన్ని పర్యావరణపరంగా, సామాజిక పరంగా విపత్తు ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉంది. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలు, బడా ఇంధన సంస్థలతో కలిసి చమురు వెలికితీత, మైనింగ్‌పరమైన వివాదాల వంటి గత తప్పులనుంచి గుణపాఠం నేర్చుకోవాలి. స్వల్పకాలిక లాభాల కంటే, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్ ఆర్థిక ఆకాంక్షలను సమతుల్యంచేయడం, దాని పర్యావరణ సాంసృ్కతిక ప్రత్యేకతను కాపాడుకోవడంపై ఆధారపడి ఉంది. బాధ్యతాయుతమైన పాలన సమగ్ర అభివృద్ధి ద్వారా మాత్రమే ఈ ప్రాంతం పురోగతికి నమూనాగా ఉద్భవించగలదు.
- గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్)
- (ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)
విభిన్న సంసృ్కతులు, కీలక పర్యావరణ వ్యవస్థలతో జీవవైవిధ్య హాట్ స్పాట్ ఈశాన్య భారతం. వనరుల దోపిడీకి నెలవుగా మారింది. బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో విస్తారమైన ఖనిజ సంపదను ఉపయోగించుకునే యత్నాలు చేస్తున్నాయి. అసోంలోని గౌహతి సమీపంలో సోనాపూర్‌లో జరిగిన రెండో జియాలజీ, మైనింగ్ శాఖ మంత్రుల సమావేశంలో ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశం అయింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఖనిజ సంపన్న