ఫీజు బకాయిలపై ఉమ్మడి పోరు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
College
  • ఏకతాటిపైకి కళాశాలల యాజమాన్యాలు
  • రేవంత్‌రెడ్డి సర్కారు ఎదుట 4 డిమాండ్లు
  • 8 వేల కోట్ల బకాయిల విడుదలకు పోరుబాట
  • వారంలో సీఎం, మంత్రులను కలిసే యోచన
  • స్పందన లేకుంటే తదుపరి కార్యాచరణ

హైదరాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో విసిగి వేసారిపోయిన కాలేజీల యాజమాన్యాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఇన్నాళ్లు వేర్వేరుగా పోరాడిన ఇంజనీరింగ్‌, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్‌ కాలేజీల యాజమాన్యాలన్నీ కన్సార్షియంగా ఏర్పాటయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లో సమావేశమై వేర్వేరుగా కాకుండా రూ. 8వేల కోట్ల బకాయిల విడుదలకు ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఎనిమిది సంఘాలు కలిసి ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ హైయ్యర్‌ ఇనిస్టిట్యూషన్స్‌’ (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ)గా ఏర్పడ్డాయి. అధ్యక్షుడిగా నిమ్మటూరి రమేశ్‌బాబు, సెక్రటరీ జనరల్‌గా కేఎస్‌ రవికుమార్‌, కోశాధికారిగా కొడాలి కృష్ణారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా కే సునీల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శులుగా ముద్దసాని రమేశ్‌రెడ్డి, జీ నాగయ్య, పీ రమేశ్‌బాబు, గోపగాని వెంకటనారాయణ, టీ శ్రీనివాస్‌ ఆచార్య, ఎండీ గౌస్‌మెయినుద్దీన్‌లతో పాటు మొత్తం 33 మందితో కార్యవర్గాన్ని ప్రకటించారు.

బాధతోనే ఏకమయ్యాం: రమేశ్‌బాబు

ప్రభుత్వం బకాయి పడిన రూ. 8 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో బాధతోనే తామంతా కన్సార్షియంగా ఏర్పడ్డామని ఏఎఫ్‌టీహెచ్‌ఐ అధ్యక్షుడు రమేశ్‌బాబు తెలిపారు. సర్కారుకు రైతులు, కాంట్రాక్టర్లు, ఇతర సంక్షేమ పథకాలు మొదటి ప్రాధాన్యం అయ్యాయని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చివరి ప్రాధాన్యం కావడం తమను తీవ్రంగా కలిసివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. తామున్నామన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. ఫెడరేషన్‌ తరపున మరో వారం రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి బకాయిలు విడుదల చేయాలని వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు.

డిమాండ్లివే..

  • టోకెన్లు జారీ అయిన 2 వేల కోట్ల బకాయిలను 30లోపు విడుదల చేయాలి.
  • 2023-24 విద్యాసంవత్సరం బకాయిలను సెప్టెంబర్‌ 30లోపు ఇవ్వాలి.
  • 2024-25 విద్యాసంవత్సరం బకాయిలను డిసెంబర్‌ 30లోపు విడుదల చేయాలి.

​ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో విసిగి వేసారిపోయిన కాలేజీల యాజమాన్యాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఇన్నాళ్లు వేర్వేరుగా పోరాడిన ఇంజనీరింగ్‌, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్‌ కాలేజీల యాజమాన్యాలన్నీ కన్సార్షియంగా ఏర్పాటయ్యాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *