ఫోన్ జప్తు.. గోప్యతను హరించడమే!

Follow

- జ్యుడీషియల్ వారెంట్ లేకుండా ఫోన్ తీసుకోవడం కుదరదు
- ఏమైనా ఆధారాలు దొరకొచ్చన్న సాకుతో ఫోన్లు సీజ్ చేయొద్దు
- వ్యక్తుల సమ్మతి తీసుకోకుండా ఫోన్ అన్‌లాక్ రాజ్యాంగ విరుద్ధం
- ‘విచారణకు ఫోన్’ కేసుల్లో గతంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘లాటరీ కింగ్’ కేసులో ఈడీ ఫోన్ల జప్తును తప్పుబట్టిన ధర్మాసనం
- వ్యక్తిగత పరికరాల జప్తు తగదన్న అప్పటి సీజేఐ చంద్రచూడ్
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ కేసు విచారణ సందర్భంగా మాజీమంత్రి కేటీఆర్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను తమకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. కోర్టు నుంచి జ్యుడీషియల్ వారెంట్ లేకుండా ఒక వ్యక్తి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకొనే అధికారం ఎవరికీ ఉండదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తి నుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌ను బలవంతంగా జప్తు చేస్తే అది ఆ వ్యక్తి గోప్యతను హరించడమేనని అంటున్నారు. దర్యాప్తు సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి ఆ వ్యక్తిపైనే వాడటం కుదరదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఫోన్లు జప్తు చేయడమేంటి?
ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ (లాటరీ కింగ్) కేసులో శాంటియాగో మార్టిన్, అతని కుటుంబ సభ్యుల ఫోన్లను నిరుడు ఈడీ అధికారులు జప్తు చేశారు. దీంతో మార్టిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఈడీ జప్తు చేయడాన్ని తప్పు బట్టింది. జప్తు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాల్లోని సమాచారాన్ని తీసుకోవడం లేదా కాపీ చేయడం వంటి పనులను మానుకోవాలంటూ ఈడీకి సూచించింది. ఇది వ్యక్తిగత గోప్యతను హరించడమేనని వ్యాఖ్యానించింది. మొబైల్ ఫోన్లను అప్పగించాలంటూ మిగతా నిందితులకు జారీ చేసిన సమన్లను వెనక్కి తీసుకోవాలని ఈడీని ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని పునరుద్ఘాటించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును గుర్తుచేస్తున్న న్యాయకోవిదులు.. ఏసీబీ అధికారులు కేటీఆర్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఇవ్వాలని కోరడం కూడా వ్యక్తిగత గోప్యతను హరించడం కిందకే వస్తుందని అంటున్నారు.
వారెంట్ లేకుండా కుదరదు
చైనా నుంచి నిధులు వస్తున్నాయన్న అభియోగాలతో 2023లో ‘న్యూస్‌క్లిక్’ ఆఫీసులో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌ను కూడా జప్తు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యున్నత ధర్మాసనం కొన్ని డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. కోర్టు నుంచి జ్యుడీషియల్ వారెంట్ ఉంటేనే వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను జప్తు చేసే అవకాశం ఉంటుందని అందులో పేర్కొం ది. అత్యవసర పరిస్థితుల్లో వారెంట్ లేకుండా ఒకవేళ ఫోన్లను జప్తు చేసినట్లయితే, వారెంట్ తీసుకోకపోవడానికి గల కారణాలను రికార్డు చేయాలని వెల్లడించింది. ఏమైనా ఆధారాలు దొరకవచ్చన్న సాకును చూపిస్తూ ఎలక్ట్రానిక్ పరికరాలను జప్తు చేయకూడదని వివరించింది. కేసులో నిందితుడు మినహా ఈ సూత్రం అందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. మరోవైపు, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను 2017లో సుప్రీంకోర్టు విచారించింది. వ్యక్తిగత గోప్యత రాజ్యాంగపరమైన హక్కు అని స్పష్టం చేసింది. ఆధార్ అనుసంధానం వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నదని తేల్చిచెప్పింది.
సమ్మతి తప్పనిసరి
ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను జప్తు చేసిన తర్వాత అందులోని సమాచారాన్ని వెలికితీయాలనుకొంటే దానికి ఫోన్ యజమాని సమ్మతి తప్పనిసరి అని ఢిల్లీకి చెందిన న్యాయ నిపుణులు సూరజ్ తెలిపారు. ఫోన్‌ను అన్‌లాక్ చేయాలంటే ఫోన్ యజమాని అనుమతి తీసుకోవాలని, ఒకవేళ అలా చేయకపోతే అది ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతాహక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ కేంద్రం (2017) కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. మొబైల్ ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారి ఎవరినైనా బలవంతంగా అడిగినట్లయితే అది ఆర్టికల్ 20(3) ప్రకారం మౌలిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని మరో న్యాయవాది సుధీర్ వర్మ తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి ఆ వ్యక్తిపైనే వాడటం కుదరదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొత్తంగా ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఇవ్వాలంటూ మాజీమంత్రి కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు కోరడం.. గోప్యతా హక్కులను కాలరాయడం కిందికే వస్తుందని న్యాయనిపుణులు చెప్తున్నారు.
ఫార్ములా-ఈ కేసు విచారణ సందర్భంగా మాజీమంత్రి కేటీఆర్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను తమకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.