బడుగు జీవితాలపై సర్కారు కత్తి

Follow

- సిరిసిల్ల జిల్లా రంగంపేట పోడు భూముల్లో ప్లాంటేషన్!
- రంగంలోకి అటవీ అధికారులు
- పట్టాలు లేని వ్యవసాయ భూముల పరిశీలన
- పోడు భూములను గుంజుకునేందుకు స్కెచ్
- అధికారులపై రైతుల ఆగ్రహం
- మొక్కలు పెడితే ఊరుకోబోమని అన్నదాతల హెచ్చరిక
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, జూన్ 18: బడుగు జీవితాలపై కాంగ్రెస్ సర్కారు కత్తిగట్టింది. ఎవుసమే జీవనాధారంగా బతికే రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలోని పేదల నోటికాడి బుక్క ఎత్తగొడుతున్నది. పట్టాలు లేని పోడు భూముల్లో మెగా ప్లాంటేషన్ చేపట్టేందుకు బుధవారం అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లడంతో పోడు రైతుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశారు. తిండి పెట్టే భూముల్లో మొక్కలు పెంచి తమ కడుపు కొడితే ఊరుకోబోమని తెగేసి చెప్పడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు.
అండగా బీఆర్‌ఎస్ సర్కారు
రంగంపేటలో 20 ఏండ్లకు క్రితం నుంచే బీసీ, ఎస్సీ, ముస్లిం వర్గాల పేదలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. 2005లో అప్పటి ప్రభుత్వం ఎస్టీలు సాగు చేస్తున్న భూములపై సర్వే చేసింది. ఆ తర్వాత 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్టీలతోపాటు బీసీలు, ఎస్సీలు, ముస్లింలు సాగు చేస్తున్న భూమిపై సర్వే చేసిం ది. ఆయా వర్గాలకు చెందిన 202 మంది 250 ఎకరాల్లో పోడు సేద్యం చేస్తున్నట్టు గుర్తించి, అందుకు సంబంధించిన మ్యాప్‌ను కూడా తీసుకున్నది. వారిలో 100 మంది ఎస్టీ రైతులకు అదే ఏడాది పట్టాలు పంపిణీ చేయగా.. మిగిలిన వారికి సాంకేతిక కారణాలతో రాలేదు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పరిస్థితి మారిపోయింది. అధికారంలోకి వస్తే మిగిలిన రైతులకు పట్టాలిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ నాయకులు.. తీరా అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు. పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సాగు భూముల్లో ప్లాంటేషన్ ఏంటి?
పట్టాలు లేని భూముల్లో ప్లాంటేషన్‌కు ప్రణాళిక చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఎఫ్‌ఎస్‌వో పద్మలత బుధవారం తమ సిబ్బందితో కలిసి సాగులో ఉన్న పోడు భూములను పరిశీలించారు. ఆ విషయం తెలుసుకున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలిచ్చిన భూమిని ఆనుకుని ఉన్న 100 ఎకరాల పోడు భూమిలో ప్లాంటేషన్ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. భయంతో రోజంతా అక్కడే కాపుకాశారు. ప్లాంటేషన్ చేయనివ్వబోమని తెగేసి చెప్పడంతో అధికారులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
భూములు గుంజుకుంటే చావే దిక్కు
మాకు మూడెకరాలనర భూమి ఉంది. 20 ఏండ్ల నుంచి దున్నుకుంటున్నం. నా భర్త రామస్వామి నాలుగేండ్ల కింద కరోనా టైంల కాలం జేసిండు. ఎవుసం చేసే ముగ్గురు బిడ్డలను సాదుతున్న. సార్లు అచ్చి ఎవుసం జేసే భూమిల సెట్లు పెడ్తమంటే ఎట్ల ఊకుంటం. మా భూమి పక్కనున్నోల్లకు పట్టాలున్నయ్. మాకు ఇంకా రాలేదు. ఇగ వస్తయేమో అనుకునెసరికి ఇట్ల చేత్తున్నరు. మా భూములు గుంజుకుంటే మాకు చావే దిక్కు
– బొజ్జ మణవ్వ, పోడురైతు, రంగంపేట, వీర్నపల్లి
మా భూములు మాకే గావాలె
మాకు ఎక్కడ భూముల్లేవు. ఇక్కడ 30 ఏండ్లయింది దున్నుకోవట్టి. ఏదో ఇక్కన్నే కష్టపడి మక్కలు, జొన్నలు పండిచ్చుకున్నం. ఈడికి నేను 60 నుంచి 70 ఏండ్లున్న. బతుకుదెరువు సూపే భూమిల సెట్లు పెడ్తమని వచ్చిర్రు. అట్ల జేత్తే మేం సేండ్ల మందుతాగి ఎవల సేన్ల వాల్లం సచ్చిపోతం. మేమైతే ఇక్కడ సెట్లు పెట్టనియ్యం.
– పొన్నం లక్ష్మి, పోడురైతు, రంగంపేట, వీర్నపల్లి
2005కు ముందున్నదే లెక్క
రంగంపేటలో అటవీభూమి విషయంలో పోడు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. 2005కు ముందు సాగులో ఉన్న భూమిలో పట్టా ఇచ్చిన భూముల హద్దులు నిర్ణయిస్తాం. అలాగే హక్కు పత్రాలు రాని వారు కూడా 2005కు ముందే సాగులో ఉంటే టైంలైన్ మ్యాప్ ఆధారంగా గుర్తించి, హద్దులు నిర్ణయిస్తాం. ఆ తర్వాత కాలంలో డిస్టర్బ్ అయిన అటవీ భూమిని మాత్రం స్వాధీనం చేసుకుంటాం.
– శ్రీహరిప్రసాద్, ఎఫ్‌ఆర్‌వో, సిరిసిల్ల
బడుగు జీవితాలపై కాంగ్రెస్ సర్కారు కత్తిగట్టింది. ఎవుసమే జీవనాధారంగా బతికే రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలోని పేదల నోటికాడి బుక్క ఎత్తగొడుతున్నది.