బీజేపీలో అధ్యక్ష ముసలం.. కొత్త చీఫ్‌గా రామచందర్‌రావు.. పార్టీకి రాజాసింగ్ రాజీనామా

Follow

- చిచ్చురేపిన రాష్ట్ర సారథి ఎన్నిక
- ఒకే ఒక్క నామినేషన్ దాఖలు
- అధిష్ఠానం ‘ఎంపిక’ నిర్ణయంతో ఈటల, అర్వింద్ గ్రూపులకు షాక్
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సోమవారం నామినేషన్లు స్వీకరించగా రామచందర్‌రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఇబ్రహీంపట్నం వేద కన్వెన్షన్‌లో జరిగే సమావేశంలో పార్టీ పరిశీలకులు ఆయన పేరును లాంఛనంగా ప్రకటించనున్నారు. ఈ పదవి కోసం ఒక దశలో ఎంపీ ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపించినప్పటికీ, ఆరెస్సెస్ అండదండలు ఉన్న రామచందర్‌రావు పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. మరోవైపు, పార్టీ అధ్యక్ష ఎన్నికలో ఎవ్వరూ పాల్గొనకుండా పార్టీ అగ్రనేతలు జాగ్రత్తపడ్డారు. రామచందర్‌రావు మాత్రమే నామినేషన్ వేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అధ్యక్ష పదవికి ఒక్కటే నామినేషన్ దాఖలైంది. గతంలో అనేకమార్లు హైదరాబాద్ నేతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరిస్తూ వస్తుండగా, తాజా నియామకంతో ఆ సంప్రదాయమే మళ్లీ రిపీట్ అయినట్టయింది.
ఎన్నిక తూతూమంత్రం
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక ఒక ప్రహసనం అని పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరన్నది అధిష్ఠానమే నిర్ణయించిందని, ఏదో పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పేందుకు తూతూ మంత్రంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడం, దరఖాస్తుల స్వీకరణ అంతా ఉత్తుత్తదే అని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందని కార్యకర్తలు వాపోతున్నారు. కనీసం పార్టీ అధ్యక్ష పదవి కోసం అభిప్రాయ సేకరణ కూడా చేయకపోవడం, ఏకాభిప్రాయం లేకుండానే ఏకపక్షంగా నిర్ణయించడం పార్టీ కార్యకర్తలకు రుచించడంలేదు. అధ్యక్షుడు ఎవరన్నది ముందే నిర్ణయించి ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం విడ్డూరమని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. తొలిసారి పార్టీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా పార్టీ కార్యాలయం వేదికగా భిన్నస్వరాలు వినిపించాయి. కొంతమంది సీనియర్ నేతలు కూడా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది.
నామినేషన్లు వేయకుండానే బెదిరింపులు
నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా ఒకరిద్దరు నేతలు పోటీలో ఉంటారని భావిస్తున్నవారికి ఫోన్లు చేసి పార్టీ రామచందర్‌రావు పేరును ప్రతిపాదిస్తున్నదని, మీరు నామినేషన్లు వేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ వేసేందుకు రాగా ఆయనకు మద్దతు ఇచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులకు ఫోన్లు చేసి రాజాసింగ్‌కు మద్దతుగా సంతకాలు చేస్తే పార్టీలో నూకలు చెల్లుతాయని హెచ్చరించారు. దీంతో అధ్యక్ష ఎన్నికలో పాల్గొనాలంటే పది మంది సంతకాలు కావాల్సి ఉండగా రాజాసింగ్‌కు మద్దతుగా ముగ్గురు మాత్రమే సంతకాలు చేశారు. మిగిలినవారు సంతకాలు చేయకుండా వెనుదిరిగారు. పార్టీలోని కీలక నేతలే స్టేట్ కౌన్సిల్ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించడం బహుశా ఉమ్మడి రాష్ట్రం మొదలు.. నేటివరకు బీజేపీ చరిత్రలో ఎన్నడూ జరగలేదని రాజాసింగ్ విమర్శించారు.
రెండేండ్లకే రామచందర్‌రావు!
ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన రామచందర్‌రావు రెండేండ్ల వరకే ఉంటారనే ప్రచారం జరుగుతున్నది. 2027లో మళ్లీ పార్టీ అధ్యక్షుడిని మారుస్తారని, అప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనవారు మూడేండ్లపాటు ఆ పదవిలో ఉండాలి. అయితే, ప్రస్తుతం ఈటల రాజేందర్ వంటివారిని తప్పించేందుకు ఆయన వ్యతిరేక వర్గీయులు వ్యూహాత్మకంగా రామచందర్‌రావు పేరును తెరపైకి తీసుకొచ్చారని, రెండేండ్ల తర్వాత 2028 ఎన్నికల కారణంతో రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని, అప్పుడు బండి సంజయ్‌కు పగ్గాలు అప్పగించి ఎన్నికలకు వెళ్తారనే చర్చ నడుస్తున్నది.
బీజేఎల్పీ లీడర్‌గా పాయల్ శంకర్?
బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని కూడా తప్పిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మహేశ్వర్‌రెడ్డి స్థానంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఓసీకి ఇచ్చిన నేపథ్యంలో శాసనసభాపక్ష నేత పదవిని బీసీకి ఇస్తారని, రాబోయే శాసనసభ సమావేశాల్లోపే మార్పు ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ గుడ్‌బై
రామచందర్‌రావు పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్టు ఉదయమే వార్తలు రావడంతో అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ వర్గీయులు అధిష్ఠానం నిర్ణయంతో ఖిన్నులయ్యారు. మరోవైపు, రామచందర్‌రావు నియామకం పట్ల గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో పార్టీకి గుడ్‌బై చెప్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుత అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డికి రాజీనామా పత్రాన్ని అందించారు. పార్టీకి రాజీనామా లేఖ ఇచ్చానని, ఇక తాను బీజేపీ సభ్యుడిని కాదని, స్పీకర్‌కు ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పాలని కోరారు. పార్టీ కోసం సర్వం ధారపోశానని, టెర్రరిస్టులకు టార్గెట్‌గా ఉన్నానని ఆయన మీడియాతో చెప్పారు. ‘మీకో దండం, మీ పార్టీకి దండం’ అంటూ రాజాసింగ్ నిట్టూర్చారు. వాళ్లు అనుకున్న వాళ్లకే అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారని వ్యాఖ్యానించారు.
స్పీకర్‌కే రాజీనామా పత్రం పంపండి
- ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ వార్నింగ్
- క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరిందని ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించాలని బీజేపీ స్పష్టంచేసింది. రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తన నామినేషన్‌కు మద్దతిచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక చేతులెత్తేసి పార్టీ పోటీ చేయనివ్వడం లేదంటూ రాజాసింగ్ అబద్ధాలతో పార్టీపై అభాండాలు వేస్తున్నారని మండిపడింది. నామినేషన్ వేస్తానంటూ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్‌తో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్‌పాటిల్ చర్చించారని, ఆయనకు నామినేషన్ పత్రాలు ఇచ్చారని తెలిపింది. నామినేషన్ పత్రంపై పది మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలు అవసరం కాగా, రాజాసింగ్ కేవలం ముగ్గురు సభ్యుల సంతకాలతో ఉన్న పత్రాన్ని సమర్పించారని పేర్కొన్నది.
రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించాలని స్పష్టంచేసింది. గతంలో కూడా క్రమశిక్షణారాహిత్య వ్యవహారాలతో సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నామని గుర్తుచేసింది. ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు గోషామహల్ నియోజకవర్గానికి వచ్చినా సరే వారి కార్యక్రమాలకు రాజాసింగ్ హాజరు కాలేదని ఆరోపించింది. పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉన్నదని దుయ్యబట్టింది. బీజేపీకి వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని, పార్టీ క్రమశిక్షణను అనేక మార్లు రాజాసింగ్ ఉల్లంఘించారని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సోమవారం నామినేషన్లు స్వీకరించగా రామచందర్‌రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.