బ్లాకౌట్‌ బాంబ్‌!.. మిస్టీరియస్‌ మిసైల్‌ను ప్రదర్శించిన డ్రాగన్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
China, Blackout Bomb
  • శత్రు దేశాల విద్యుత్తు వ్యవస్థలే లక్ష్యం

బీజింగ్‌: పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా గురువారం కొత్త రకం గ్రాఫైట్‌ బాంబు (బ్లాకౌట్‌ బాంబు)ను ప్రదర్శించింది. ఇది శత్రు దేశాల విద్యుత్తు స్టేషన్లను నాశనం చేసి లక్షిత ప్రాంతంలో కరెంట్‌ లేకుండా చేయగలదని చైనా చెప్తున్నది. ఈ ఆయుధాన్ని గ్రాఫైట్‌ బాంబుగా చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ (సీసీటీవీ) గుర్తించకపోయినప్పటికీ గ్రాఫైట్‌ మందుగుండుకు ఉండే లక్షణాలను అది కలిగి ఉన్నట్టు స్పష్టమవుతున్నది. భూమిపై ఓ వాహనం నుంచి ఈ బాంబును ప్రయోగించడంతో దాని నుంచి సిలిండర్‌ ఆకారంలో ఉన్న 90 చిన్న బాంబులు (సబ్‌మ్యునిషన్స్‌) బయటికి దూసుకొచ్చినట్టు చూపుతున్న ఓ యానిమేటెడ్‌ వీడియోను సీసీటీవీ తన సోషల్‌ మీడియా చానల్‌లో షేర్‌ చేసింది.

ఆ చిన్న బాంబులు గగనతలంలో పరస్పరం ఢీకొని పేలిన తర్వాత హై-ఓల్టేజీ విద్యుత్తు వ్యవస్థల్లో షార్ట్‌-సర్క్యూట్‌ కలిగించేందుకు రసాయనికంగా శుద్ధి చేసిన కార్బన్‌ ఫిలమెంట్లను వెదజల్లినట్టు కనిపిస్తున్న ఆ వీడియో ప్రస్తుతం ‘ఎక్స్‌’లో వైరల్‌ అవుతున్నది. కనీసం 10 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించడం ద్వారా శత్రు దేశాల కమాండ్‌, కంట్రోల్‌ వ్యవస్థలకు విఘాతం కలిగించడమే ఈ బ్లాకౌట్‌ బాంబు లక్ష్యమని సీసీటీవీ పేర్కొన్నది. ‘దేశీయంగా తయారైన మిస్టీరియస్‌ టైప్‌ మిసైల్‌’గా దాన్ని అభివర్ణించింది. కానీ, ఆ ఆయుధం లేదా దాని స్థితికి సంబంధించిన ఇతర వివరాలేమీ వెల్లడించలేదు. షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. 490 కిలోల బరువైన వార్‌హెడ్‌తో కూడిన ఈ ఆయుధం 290 కి.మీ. పరిధిని కలిగి ఉంటుందని, సైనిక సబ్‌స్టేషన్లు, ఇతర విద్యుత్తు మౌలిక వసతులపై దాడులకు అనువుగా ఉండేలా ఈ బాంబును రూపొందించారని తెలుస్తున్నది.

తైవాన్‌కు ముప్పు?

చైనా ఆవిష్కరించిన బ్లాకౌట్‌ బాంబుతో తైవాన్‌ విద్యుత్తు గ్రిడ్‌కు ముప్పు ఉంటుందని సోషల్‌ మీడియాలో చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. బ్లాకౌట్‌ బాంబులు తైవాన్‌ రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయగలవని భావిస్తున్నారు.

​పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా గురువారం కొత్త రకం గ్రాఫైట్‌ బాంబు (బ్లాకౌట్‌ బాంబు)ను ప్రదర్శించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *