భాషాపరిశోధన మేరునగం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Acharya Tumati Donappa
  • నేడు ఆచార్య తూమాటి దొణప్ప శత జయంతి

భాషా పరిశోధకునిగా, సాహిత్య విమర్శకునిగా, వ్యాకరణ పండితునిగా, ఆచార్య వర్యునిగా లబ్ధప్రతిష్టులైన వారు ఆచార్య తుమాటి దొణప్ప. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పాతికేండ్లకు పైచిలుకుగా తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రిన్సిపాల్‌గా, రిజిస్ట్రార్‌గా, తెలుగు విశ్వవిద్యాలయం తొలి వైస్‌-చాన్స్‌లర్‌గా పాలనాదక్షతను కనబరిచారు.

విద్యార్థి దశలో పదేండ్ల వయస్సులోనే ఆశువుగా అలవోకగా పద్యాలు చెప్పిన ప్రజ్ఞ వీరిది. కవిత్వానికే పరిమితం కాకుండా, కథ, నవల, నాటకం వంటి ఇతర సృజనాత్మక సాహితీ ప్రక్రియలలో కూడా వీరు చేసిన రచనలు నాటి పలు పత్రికలలో అచ్చయి, వీరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే వాటికే పరిమితం కాకుండా, అక్కడే ఆగిపోకుండా సృజనతోపాటు పరిశోధన వైపు దృష్టిసారించారు. విమర్శనాత్మకమైన సాహిత్యంలో విశేషమైన కృషితో పాటు, తెలుగు భాషా చారిత్రిక అంశాలలో లోతైన పరిశ్రమ చేశారు. శిష్ట సాహిత్యం, జానపద సాహిత్యం రెండింటినీ సమాంతరంగా అనుశీలించారు. భాష, వ్యాకరణం, నిఘంటు నిర్మాణం వంటి విషయాలను సశాస్త్రీయంగా విశ్లేషించారు. ఒక ప్రముఖుని గురించి రాసేటప్పుడు ఆ వ్యక్తి వరకే రాయడం కాకుండా, అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు తరచిచూసి, పరిశోధించి రాయడం వీరి నైజం. దానివల్ల అనేక చారిత్రిక విషయాలతో పాటు, సమకాలీన రాజకీయ, ఆర్థిక సామాజిక, సాంస్కృతిక, భాషా విషయక విశేషాలెన్నో మనకు తెలిసివస్తాయి. తెలుగు భాషా సాహిత్య అధ్యయనపరులకు వీరి రచనలు దారిదీపాలు.

వీరి ‘ఆంధ్ర సంస్థానాలు-సాహిత్య పోషణము’, ‘భాషా చారిత్రిక వ్యాసావళి’, ‘తెలుగులో కొత్త వెలుగులు’, ‘జానపద కళా సంపద’, ‘తెలుగు హరికథా సర్వస్వం’, ‘వైకృత పద స్వరూప నిరూపణం’, ‘ఆకాశ భారతి’, ‘బాలల శబ్ద రత్నాకరం’ వంటి ప్రామాణిక గ్రంథాలు వీరి పాండితీ పరిశోధనా శేముషికి నికషోపలాలు. వీటిల్లో ‘ఆంధ్ర సంస్థానాలు-సాహిత్య పోషణము’, ‘తెలుగు హరికథా సర్వస్వము’, ‘జానపద కళా సంపద’ అన్న గ్రంథాలకు 1965-66; 1975-76; 1978లలో మూడు సార్లు ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ద్వారా అవార్డులు పొందిన ఘనత వీరిది. సాధారణంగా ఒక వ్యక్తి ఆయా రంగాలలో చేసిన అపూర్వ కృషికి గుర్తింపుగా విశ్వవిద్యాలయాలు ‘డి.లిట్‌’ పేరిట గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తూ ఉంటాయి. కానీ ఆచార్య దొణప్ప 1982లోనే రచించిన ‘తెలుగు హరికథా సర్వస్వం’ గ్రంథానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు డి.లిట్‌ ప్రదానం చేయడం చెప్పుకోదగిన విశేషం.

భాష నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. పాత పదాలు మరుగునపడి కొత్త పదాలు వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలో అసాధు రూపాలు సాధురూపాలుగా చెలామణిలోకి వస్తాయి. సంప్రదాయవాదులకు ఇవి పంటికింది రాయిలా అనిపిస్తాయి. దొణప్ప రచనలను పరిశీలిస్తే ఇవి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆయన రచనలలోని భాషాశైలి, పద ప్రయోగాలు విలక్షణంగా ఉంటాయి.

నేడు వాడుకలో ఉన్న పదాలకు సరైన పదాలు ఇవీ అంటారు. ఆధ్వర్యం-ఆధ్వర్యవం; నాగరికత-నాగరకత; చారిత్రక-చారిత్రిక; దేవాదాయ, ధర్మాదాయ-దేవదాయ, ధర్మదాయ; సమిష్టి-సమష్టి; అదేవిధంగా ఆయన తరచుగా దిద్ది తీర్చి అని రాసేవారు. మామూలుగా ‘తీర్చిదిద్ది’ అన్నది తరచుగా వాడే మాట. ‘సుస్వాగతం’ అన్న మాట అశుభసందర్భాలలో వాడేది, ‘స్వాగతం’, ‘శుభస్వాగతం’ అనాలి అంటారు.

‘చెదురు ముదురు’ కాదు ‘చెదురుమదురు’. ‘ఇబ్బడి ముబ్బడి’, ‘సరీసాటీ’, ‘తీరుతీయాలు’, ‘జగా పండితులు’, ‘చిల్లర మల్లర’, ‘ప్రఖ్యాపన’ (ప్రసిద్ధం అనే అర్థంలో); ‘వీను మిగిలినవారు’ (పేరు పొందినవారు); కోసరం (కోసం), యష్టి (ఆకృతి, రూపం); అప్పటప్పట ‘అప్పుడప్పుడు); ససిగా (సరిగ్గా); పొద్దు వాటారింది (పొద్దుపోయింది), అహరహం; అహమహమిక; చికీర్షువు (అభిలాష); అకలుష వర్తనం (దుష్ప్రవర్తన), దండత్తయిన (ఎత్తయిన), నిస్తుల (తులలేనిది-అసమానము); తరిబీతు (తర్ఫీదు), మస్తుగా (అధికంగా); తూర్లు (సార్లు) ఇలా కొన్ని వ్యాకరణ సిద్ధరూపాలు, అన్యదేశ్యాలు; మాండలికాలు వంటి పదజాలంతో వారి రచనాశైలి ఆకర్షణీయంగా మణిప్రవాళ శైలిలాగా అనిపిస్తుంది.

నేడు ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతి సందర్భంగా వారి పాండితీ ప్రకర్షకు తెలుగు సాహితీలోకం కైమోడ్పు చికీర్షితం.

– ఆచార్య టి.గౌరీశంకర్‌

​భాషా పరిశోధకునిగా, సాహిత్య విమర్శకునిగా, వ్యాకరణ పండితునిగా, ఆచార్య వర్యునిగా లబ్ధప్రతిష్టులైన వారు ఆచార్య తుమాటి దొణప్ప. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పాతికేండ్లకు పైచిలుకుగా తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *