మహారాష్ట్ర ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలన్న రాహుల్ గాంధీ.. ఈసీ సమాధానం ఇదే!

Follow

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఓటర్ల గోప్యత, భద్రతను నిర్ధారించడం అవసరమని చెబుతూ, పోలింగ్ కేంద్రాల CCTV ఫుటేజ్‌లను 45 రోజుల్లోపు నాశనం చేయాలనే తన నిర్ణయాన్ని కమిషన్ సమర్థించుకుంది. శనివారం (జూన్ 21), రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ ద్వారా ఎన్నికల కమిషన్ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తారు. కమిషన్ ముఖ్యమైన ఆధారాలను దాచిపెడుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆరోపించారు.
కేంద్రం ఎన్నికల సంఘం తీరుపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పోలింగ్ జరిగిన 45 రోజులకు సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిపాటు ఉండాల్సిన పోలింగ్ సీసీటీవీ ఫుటేజ్‌ను కేవలం 45 రోజుల తరువాత తొలగించాలని నిర్ణయించడం దారుణమని రాహుల్‌గాంధీ అన్నారు. పోలైన ఓట్ల వివరాలు అడిగితే కూడా ఈసీ నిరాకరిస్తోందని మండిపడ్డారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని , ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం ఇందుకు నిదర్శనమన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్‌గాంధీ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీతో కేంద్రం ఎన్నికల సంఘం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందన్నారు. ఎన్నికల ఫలితాలను తారు మారు చేశారన్నారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలోని CCTV ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల కారణంగా వాటిని బహిరంగపర్చలేమని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సీసీ ఫుటేజీలు బహిరంగపర్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే ఇలా చేయడం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మయూతీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే.. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ పదే పదే చెబుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కన్సాలిడేటెడ్, డిజిటల్ ఓటర్ రోల్స్‌ను ప్రచురించాలంటూ రాహుల్‌గాంధీ ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఓటర్ల గుర్తింపును బహిర్గతం చేసి వారి భద్రతకు హాని కలిగించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పారదర్శకత పేరుతో చేస్తున్న ఇటువంటి డిమాండ్లు 1950 మరియు 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని కమిషన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఓటర్ల భద్రత, గోప్యత మాకు అత్యంత ముఖ్యమైనవన్నారు. ఈ ఫుటేజీని ఎక్కువ కాలం భద్రంగా ఉంచినా లేదా బహిరంగంగా ఉంచినా, ఎవరు ఓటు వేశారో, ఎవరు ఓటు వేయలేదో గుర్తించడానికి దీనిని ఉపయోగించవచ్చని కమిషన్ వాదిస్తోంది. దీని ఆధారంగా, సామాజిక వ్యతిరేక శక్తులు ఓటర్లను బెదిరించవచ్చు లేదా వివక్షకు గురిచేయవచ్చని ఈసీ పేర్కొంది.
రాహుల్ గాంధీ ఆరోపణలకు ప్రతిస్పందనగా, ఎన్నికల కమిషన్ తన విధానాన్ని సమర్థించుకోవడమే కాకుండా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, వ్యక్తిగత గోప్యత మధ్య సమతుల్యతను కొనసాగించడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ప్రజాస్వామ్యం, న్యాయానికి ముడిపెడుతుండగా, కమిషన్ దానిని సున్నితమైన డేటా రక్షణ, ఓటర్ల స్వేచ్ఛకు ముడిపెడుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఓటర్ల గోప్యత, భద్రతను నిర్ధారించడం అవసరమని చెబుతూ, పోలింగ్ కేంద్రాల CCTV ఫుటేజ్‌లను 45 రోజుల్లోపు నాశనం చేయాలనే తన నిర్ణయాన్ని కమిషన్ సమర్థించుకుంది.