మా కూడు లాక్కుంటరా?​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
01

తెలంగాణ బీసీ జాబితాలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్న బలిజ, కళింగ, కొప్పుల వెలమ, తూర్పు కాపు, శెట్టిబలిజ తదితర వర్గాల ప్రజలు, వారి తరఫున మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజాప్రతినిధులకు నాదొక ప్రశ్న. తూర్పు కాపులను బీసీల్లో చేర్చవద్దని ఆందోళనలు చేసిన మీరు మా తెలంగాణలో బీసీ జాబితాలో వారిని చేర్చాలని ఎలా డిమాండ్‌ చేస్తారు? 2017 మార్చి 20న అమలాపురంలోని శ్రీరాంపురంలో ప్రస్తుత ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌ అధ్యక్షతన బీసీ సంఘాల నేతృత్వంలో ఆందోళనలు జరిగింది నిజం కాదా? కార్మిక శాఖ మంత్రికే కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలనూ ఇదే ప్రశ్న అడుగుతున్నా.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేరాలనుకుంటున్న మీతో పోలిస్తే మా తెలంగాణ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా, రాజకీయ, ఉద్యోగపరంగా వెనుకబడిపోయారు. అందుకే మీ మూలంగా తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ, యువతకు, మొత్తంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతున్నదనే కారణంగా తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకున్నది. స్వరాష్ట్రం ఏర్పడింది. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదమంటే అన్ని రకాల వనరులు అని అర్థం.

2016లో ఏపీ బీసీ జాబితాలోని ఏడు తెలంగాణ బీసీ కులాలను తొలగించారు. మీరు మీ రాష్ట్రంలో మా తెలంగాణ బీసీ కులాలను ఉంచి, ఇక్కడ డిమాండ్‌ చేయడంలో ఒక అర్థముంటుంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో దళిత, బీసీ, గిరిజన, మైనారిటీల పేరుతో చాలామంది దొడ్డిదారిన చేరిపోయారు. కల్మష మెరుగని తెలంగాణ ప్రజలను ఈ విధంగా మోసం చేయడం న్యాయమా? మీ చేరిక వల్ల బీసీల విద్యకు తీవ్రమైన ఆటంకం కలుగుతుంది. జాతీయ/రాష్ట్ర విద్యాసంస్థల్లో సీట్లన్నీ మీ విద్యార్థులే తన్నుకుపోతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లలోనూ తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో చేరాలనుకుంటున్న కళింగ, వెలమ, రెడ్లు, కమ్మ సామాజికవర్గాలు క్రీ.శ.1323-1724 మధ్యకాలంలో ఆంధ్రా ప్రాంతంలో రాజ్యాలు ఏలినవే. చారిత్రక క్రమంలో దొడ్డిదారిన వీళ్లు వివిధ కులాల పేర, ఇంటి పేర లేదా వృత్తి పేరిట బీసీల్లో చేరిపోయారు.

ఉద్యోగాలే కాదు, రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయ పదవులనూ వారు ఎత్తుకుపోయే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బీసీ జాబీతాలో చేరిన తర్వాత వాళ్లు కూడా తెలంగాణవారవుతారు. అసలు వాళ్లను తెలంగాణలోకి ఎందుకు ఆహ్వానం పలకాలి? వారు వచ్చేది రాశిపై పడి దోచుకుతినడం కోసమే కదా?

తెలంగాణ భూమితో, సామాజిక అస్తిత్వంతో సంబంధాలు ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణవాళ్లు అవుతారు. నిజానికి ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఒక జాబితాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రజల అస్తిత్వం, సామాజిక స్థితిగతుల ఆధారంగానే ఇది జరుగుతున్నది. దాని ఆధారంగా చూసుకున్నా మీరు తెలంగాణవాళ్లు కాదని తేలిపోతుంది. 11వ శతాబ్దం కంటే ముందు నుంచే మీ అస్తిత్వం అక్కడే ఉంది కదా?

50 ఏండ్ల నుంచి తెలంగాణలో ఉన్నామంటున్న మీరు మీ ప్రాంతంలో ఉన్న బీసీ జాబితాలోని మీ వాటానేమైనా తీసుకొస్తున్నారా? సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా చూసినా, ఏ రూపంలో చూసినా తెలంగాణ బిడ్డలకు అన్యాయాన్ని తలపెట్టడానికే వస్తున్నారని చెప్పక తప్పదు. ఇక్కడి బీసీలు తమకు దక్కాల్సిన స్థాయిలో వాటా దక్కలేదని పోరాటాలు నిర్మిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సందట్లో సడేమియాలాగా మీ వలసవాదంతో మా వాటా కొల్లగొడతారా? మా నోటికాడి ముద్దని ఎత్తుకుపోతారా? అసలు బీసీ సంఘాలు దీనికి ఎందుకు ఒప్పుకుంటున్నాయి? ఏమైనా లోపాయికారి ఆర్థిక ఒప్పందం జరిగిందని అర్థం చేసుకోవాలా?

అయినా ఆధిపత్య కులాలకున్న తెగింపు బీసీ వర్గాల ప్రజలకు గాని, ప్రజాప్రతినిధులకు గాని లేదు. అంటే రాశిని దోచిపెట్టడంలో మన వాళ్ల పాత్ర కూడా ఉన్నదని అర్థమవుతున్నది. ఆంధ్రా కులాలను కలపడం ఆపకపోతే ప్రత్యేక పోరాటాలు చేయక తప్పదు. తెలంగాణ బీసీలకు, ప్రజలకు ద్రోహం తలపెట్టడం కోసం కుయుక్తులు పన్నుతున్న వాదులారా జాగ్రత్త! ‘ప్రాంతంవాడైనా దోపిడీ చేస్తే తన్ని పాతేస్తాం’ అన్న కాళోజీ సూక్తిని అమలు చేయక తప్పదేమో. తస్మాత్‌ జాగ్రత్త!
(వ్యాసకర్త: కుల నిర్మూలన వేదిక అధ్యక్షులు)

-పాపని నాగరాజు
99488 72190

​స్తవానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేరాలనుకుంటున్న మీతో పోలిస్తే మా తెలంగాణ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా, రాజకీయ, ఉద్యోగపరంగా వెనుకబడిపోయారు. అందుకే మీ మూలంగా తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ, యువతకు, మొత్తంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతున్నదనే కారణంగా తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకున్నది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *