మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి.. సమావేశంలో మహిళా జర్నలిస్టులు

Follow

ఖైరతాబాద్, జూన్ 30: జర్నలిస్టు స్వేచ్ఛ మరణంపై మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని, నైతికతతో వ్యవహరించాలని మహిళా జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు వనజ మాట్లాడుతూ.. స్వేచ్ఛ మరణానంతరం మీడియా కథనాలు, ప్రసారాల్లో సున్నితమైన అంశాలను చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వేచ్ఛ మరణంపై ఆమె కుమార్తె అయిన మైనర్ బాలికను ఇంటర్వ్యూను చేయడం సరికాదని పేర్కొన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు కొన్ని యూట్యూబ్ చానళ్లు వ్యూస్ కోసం తహతహలాడుతున్నాయని, అభ్యంతరకరమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నాయని విచారం వ్యక్తం చేస్తూ.. ఇకనైనా స్వేచ్ఛ కుటుంబాన్ని వేధించడం ఆపాలని స్పష్టం చేశారు.
స్వేచ్ఛ మరణానికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని, ఇదే తరుణంలో మీడియా నైతికతను పాటించాలని కోరారు. కొన్ని ప్రధాన చానళ్లు యూట్యూబ్‌లను అనుసరిస్తున్నాయని, చట్టాన్ని, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నాయని జర్నలిస్టు సలీమా పేర్కొన్నారు. సమావేశంలో మహిళా జర్నలిస్టులు కట్టా కవిత, కృష్ణ జ్యోతి, రాజేశ్వరి, వంగపల్లి పద్మ, ‘భూమిక’ సంస్థ పత్రినిధి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు స్వేచ్ఛ మరణంపై మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని, నైతికతతో వ్యవహరించాలని మహిళా జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు.