మృత్యు సిగాచి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– రియాక్టర్‌ పేలి 19 మంది కార్మికులు మృతి
– పాశమైలారం సిగాచి కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
– ఎగసిపడిన మంటలు…కూలిన భవనాలు
– ఆచూకీ లేని మరో 40 మంది కార్మికులు
– ఘటనా సమయంలో విధుల్లో 110 మంది కార్మికులు
– పదుల సంఖ్యలో క్షతగాత్రులు
– శిధిలాల తొలగింపులో జాప్యం
– కంపెనీ ఎదుట బాధిత కుటుంబాల ఆందోళన
– హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లిన మంత్రులు, అధికారులు
– ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి
– సహాయచర్యలపై సీఎం ఆరా
– బాధితుల్ని పరామర్శించిన సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

కోట్ల రూపాయల టర్నోవర్‌. ఇంకా లాభాలు గడించాలనే అత్యాశ. దానికోసం ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలో అన్‌స్కిల్డ్‌ వలస కార్మికులతో రియాక్టర్ల ఆపరేటింగ్‌. సోమవారం పాశమైలారంలోని సిగాచీ ఇండిస్టీస్‌లో జరిగిన ఈ కక్కుర్తి తప్పిదం విలువ 19 ప్రాణాలు గాలిలో కలిసిపోవడం, పదుల సంఖ్యలో క్షతగాత్రులు కావడం, మరో 40 మంది ఆచూకీనే లేకుండా పోవడం. తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు ఈ భారీ విస్పోటనంలో యాజమాన్యంతో పాటు ప్రభుత్వాలదీ భాగస్వామ్యమే! రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండంటూ పారిశ్రామిక విధానాన్ని సరళీకరించిన ఫలితం ఇది. పరిశ్రమల్లో తనిఖీలు చేయకుండా అన్ని శాఖల చేతుల్ని కట్టిపడేశారు. ఆన్‌లైన్‌లో తనిఖీలు చేస్తే చాలంటూ చట్టాలను సవరించారు. ఇలాంటి పిచ్చి చేష్టల ఫలితమే ‘సిగాచి’ అగ్ని ప్రమాదం.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచి కెమికల్‌ పరిశ్రమలో సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో కెమికల్‌ రియాక్టర్‌ పేలింది. దానితో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద ధాటికి కంపెనీ ఆవరణలోని మూడంతస్తుల భవనం కుప్పకూలి పోయింది. మరో భవనం బీటలు వారింది. ఈ ప్రమాదంలో 19 మంది కార్మికులు, సిబ్బంది మరణించారు. పదుల సంఖ్యలో క్షతగా త్రులయ్యా రు. 40 మంది ఆచూకీ తెలియడంలేదు. వారంతా శిధిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో సిగాచి కెమికల్‌ పరిశ్రమలో 110 మంది కార్మికులు పని చేస్తున్నారు. కెమికల్‌ తయారీ ప్రాసెస్‌లో భాగంగా కొందరు కార్మికులు రియాక్టర్‌ వద్ద పని చేస్తారు. ప్రమాదం జరగ్గానే అక్కడి కార్మికుల దేహాలు వంద మీటర్ల ఎత్తుకు ఎగిరిపడ్డాయి. పేలిన రియాక్టర్‌ కాల పరిమితి తీరినదిగా చెబుతున్నారు. మరోవైపు అనుభవంలేని అన్‌స్కిల్డ్‌ కార్మికుల్ని తక్కువ జీతాలతో పని చేయిస్తున్నారని తెలిసింది. ఈ విషయాన్ని అదే కంపెనీలో పనిచేస్తూ, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కార్మికులు చెప్పారు. కాలం చెల్లిన రియాక్టర్‌ను అన్‌స్కిల్డ్‌ కార్మికులు ఆపరేట్‌ చేయడం వల్లే ప్రమాదం సంభవించిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులేనని ప్రాథమికంగా తెలిసింది. మృతుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఘటనా ప్రాంతం మరుభూమిని తలపిస్తుంది. పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన 13 మంది కార్మికులను అంబులెన్స్‌ల ద్వారా మదీనగూడలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల్ని అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. సహాయ చర్యల్ని వేగవంతం చేయాలని చెప్పారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. ప్రమాదం గురించి తెలియగానే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి సంఘటనా స్థలానికి వెళ్లారు. బాధితుల్ని పరామర్శించారు. అధికారుల్ని అప్రమత్తం చేశారు. 30 ఫైర్‌ ఇంజిన్లతో ఆ ప్రాంతంలో మంటల్ని అదుపు చేస్తున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు శిథిóలాలను తొలగించే పనులు చేపట్టాయి. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటనా స్థలంలో ఉండి సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.

19 మంది మృతి, 37 మంది క్షతగాత్రులు
అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్టుగా గుర్తించారు. మృతుల్లో రాజనాల్‌ గజన్‌మోహన్‌, నాగజిత్‌, శశిభూషన్‌ను గుర్తించారు. మరో 37 మందిని మదీనగూడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న వారిలో నగజిత్‌, రామ్‌సింగ్‌, సంజరుకుమార్‌, నాగర్‌ జిత్‌ తివారి (ఒడిశా), రాంరాజ్‌, గణేష్‌కుమార్‌, అభిషేక్‌ కుమార్‌, దేవ్‌చంద్‌, ధన్‌బీర్‌ కుమార్‌ దాస్‌ (బీహార్‌), రాజశేఖర్‌రెడ్డి (ఏపీ) వారితో పాటు ఇంకొందరున్నారు. డ్యూటీలో 110 మంది ఉండగా 40 మంది ఆచూకీ లభించకపోవడంతో శిథిలాలను తొలగిస్తున్నారు.

శిథిలాల తొలగింపులో జాప్యం
భారీ అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. భారీ కెమికల్‌ రియాక్టర్‌, షెడ్‌ తునాతునకలై చెల్లాచెదురైంది. మంటలు, దట్టమైన రసాయన వాయువుల వల్ల మొదట్లో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగింది. 30 ఫైర్‌ ఇంజన్లు, 30 క్రేన్స్‌, జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నప్పటికీ అనుకున్నంత వేగంగా జరగట్లేదని కార్మికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యల్ని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్య, ఎస్పీ పంకజ్‌ పారితోష్‌, ఇతర పోలీస్‌ అధికారులు పర్యవేక్షించారు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తమ వాళ్ల అచూకీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఎవరెవరు ఉన్నారో వివరాలు చెప్పేందుకు కంపెనీ ప్రతినిధులు ఎవరూ అందుబాటులో లేరు. ఈ ప్రాంతమంతా బంధువుల రోదనలతో కన్నీటి పర్యంతమైంది. క్షతగాత్రుల వివరాలు వెల్లడించేందుకు సంగారెడ్డిలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేసినట్టు జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య తెలిపారు. వివరాల కోసం 08455-276155 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

కాలం చెల్లిన రియాక్టర్‌, అన్‌స్కిల్డ్‌ లేబర్‌
సికాచి కెమికల్‌ పరిశ్రమలకు చెందిన రియాక్టర్‌ కాల పరిమితి తీరినట్టుగా చెబుతున్నారు. ఫార్మా, కెమికల్‌ పరిశ్రమల్లో రియాక్టర్లను కాల పరిమితి తీరగానే
మార్చుకోవాలి. అయితే రియాక్టర్లను మార్చాలంటే వాటి వ్యయం కోట్లల్లో ఉండటంతో పాటు భారీ సెట్టింగ్‌ను మార్పు చేయాలి. దాంతో కంపెనీ యజమానులు తమ లాభాల కోసం పాత రియాక్టర్లే ఉపయోగిస్తున్నారు. వాటికి తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నారు. వీటిపై అనుభవమున్న స్కిల్డ్‌ వర్కర్లతోనే పని చేయించాల్సి ఉంటుంది. సిగాచి యజమానులు మాత్రం 10 రోజుల క్రితం నియమించిన అన్‌స్కిల్డ్‌ కార్మికులతో పని చేయించినట్టు తెలుస్తోంది. రియాక్టర్ల వద్ద పని చేయాలంటే స్కిల్డ్‌ కార్మికులకు ఎక్కువ జీతభత్యాలివ్వాల్సి వస్తుందని, తక్కువ జీతంతోనే అన్‌స్కిల్డ్‌ వలస కార్మికుల్ని పెట్టి పని చేయిస్తున్నారు. అందుకే రియాక్టర్‌ పేలిందని ప్రమాదం నుంచి బయటపడిన కార్మికులు చెప్తున్నారు.

ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ
పరిశ్రమలో ఇతర రాష్ట్రాలవారే ఎక్కువమంది పనిచేస్తున్నారు. యూపీ, బీహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, బెంగాల్‌ రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువ మంది ఉన్నారు. పటాన్‌చెరులోని అన్ని పరిశ్రమల్లోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే పనిచేస్తున్నారు. సిగాచి పరిశ్రమలోనూ ఆ రాష్ట్రాల వారే ఎక్కువమంది ఉన్నట్టు కార్మికులు చెబుతున్నారు. తమ వారిని చూపించాలని బాధిత కుటుంబ సభ్యులు పరిశ్రమ గేటు ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

బాధితుల్ని ఆదుకుంటాం: మంత్రులు దామోదర, వివేక్‌
అగ్ని ప్రమాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకుంటామనీ, క్షతగాత్రులకు వారికి మెరుగైన వైద్యం అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి చెప్పారు. వీరు ప్రమాద సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. బాధితులకు మెరుగైన ఎక్స్‌గ్రేషియా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా పరిశ్రమల్లో అవసరమైన భదత్రా చర్యలు తప్పని సరిగా అమలు చేస్తామన్నారు. రియాక్టర్‌ పేలుడు ఎయిర్‌ ఫైర్‌ సిస్టమ్‌లో ప్రెషర్‌ వల్లే చోటు చేసుకుందని తెలిపారు. పరిశ్రమల శాఖ ద్వారా విచారణ ప్రారంభమైందన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు : చుక్క రాములు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు
కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్‌ ఆఫ్‌ ఇన్స్‌స్పెక్టర్స్‌ పర్యవేక్షణ లేకపోవడంతో, నిర్లక్ష్యం వల్లే పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సిగాచి అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. క్షతగాత్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వడంతో పాటు గాయాలపాలైన వారికి తగిన ఎక్స్‌గ్రేషియా, మెరుగైన వైద్యం అందించాలన్నారు. పరిశ్రమల యజమానుల లాభాపేక్షతోనే రియాక్టర్లు పేలుతున్నాయన్నారు. అన్‌స్కిల్డ్‌ వర్కర్లతో రియాక్టర్ల వద్ద పని చేయించడం సరైంది కాదన్నారు. ప్రమాదాలపై సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శిథిలాల కింద చిక్కిన వాళ్లను కాపాడేందుకు సహాయ చర్యల్ని వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట సీఐటీయూ జిల్లా నాయకులు కె.రాజయ్య, అతిమేల మాణిక్‌, రాజు తదితరులు ఉన్నారు.

ప్రధాని దిగ్భ్రాంతి
ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. రాష్ట్రపతి ముర్ముకూడా ప్రగాఢసానుభూతి తెలిపారు.

కోటి పరిహారమివ్వాలి ఎస్‌.వీరయ్య, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు
సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలాన్ని ఆయన సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కంపెనీలో 110 మంది పని చేస్తుండగా ఇంకా 40 మంది ఆచూకీ లభించలేదన్నారు. శిథిలాల కింద ఎందరున్నారో తెలీదనీ, కార్మికుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నా కంపెనీ వాళ్లు చెప్పడంలేదని విమర్శించారు. కార్మిక, వైద్యారోగ్య శాఖల మంత్రులు పర్యటించి వెళ్లడం తప్ప, కార్మికులకు భరోసా ఇవ్వలేకపోయారన్నారు. ప్రభుత్వం నుంచి ఏం సహాయం చేస్తారో ప్రకటించలేదన్నారు. నష్టం కలిగించిన యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేదన్నారు. కాలం చెల్లిన రియాక్టర్‌, అన్‌స్కిల్డ్‌ వర్కర్లతో పని చేయించడం వల్లనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సంఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు.

గవర్నర్‌, సీఎం దిగ్భ్రాంతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం ఎప్పటికప్పుడు అక్కడున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై డీజీపీ, సీఎస్‌తో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్‌ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌, లేబర్‌ డిపార్టుమెంట్‌ పీఎస్‌, హెల్త్‌ సెక్రెటరీ, ఫైర్‌ సర్వీసెస్‌ అడిషనల్‌ డీజీపీని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసర మైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్య మంత్రి అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. పాశమైలారంలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని మంగళవారం (నేడు) ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సందర్శించనున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిశోర్‌ను కోరారు.

సమగ్ర విచారణ జరపాలి : భద్రతా చర్యలు పాటించని యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి : సీపీఐ (ఎం)
సంగారెడ్డి జిల్లా, పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్‌ పేలిన ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 16 మంది కార్మికులు మరణించినట్లు, ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తుందన్నారు. సిగాచి పరిశ్రమ యాజమాన్యం లాభాలమీద వున్న శ్రద్ధ కార్మికుల భద్రత విషయంలో లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందివ్వాలనీ, గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలనీ, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలనీ, భద్రతా చర్యలు పాటించని యాజమాన్యంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ఆయన డిమాండ్‌ చేశారు.

The post మృత్యు సిగాచి appeared first on Navatelangana.

​– రియాక్టర్‌ పేలి 19 మంది కార్మికులు మృతి– పాశమైలారం సిగాచి కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం– ఎగసిపడిన మంటలు…కూలిన భవనాలు– ఆచూకీ లేని మరో 40 మంది కార్మికులు– ఘటనా సమయంలో విధుల్లో 110 మంది కార్మికులు– పదుల సంఖ్యలో క్షతగాత్రులు– శిధిలాల తొలగింపులో జాప్యం– కంపెనీ ఎదుట బాధిత కుటుంబాల ఆందోళన– హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లిన మంత్రులు, అధికారులు– ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి– సహాయచర్యలపై సీఎం ఆరా– బాధితుల్ని పరామర్శించిన సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు
The post మృత్యు సిగాచి appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *