మొదటివారంలో భారీ వర్షాలు… వచ్చే మూడ్రోజులు మోస్తరు వానలు

Follow

- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- వెల్లడించిన వాతావరణ శాఖ
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ఈ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. పశ్చిమ నైరుతి నుంచి వీస్తున్న గాలుల కారణంగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. మంగళ, బుధ, గురువారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువగా, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో అత్యధికంగా 5.52 సెం.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది. భధాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండలో 5.36 సెం.మీ, జూలూరుపాడ్‌లో 5.34 సెం.మీ, అన్నపురెడ్డిపల్లిలో 4.51 సెం.మీ, అశ్వారావుపేటలో 4.13 సెం.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో కౌటాలలో 4.71 సెం.మీ, వరంగల్ జిల్లా ఖానాపూర్ లో4.66 సెం.మీ, ములుగు జిల్లా మల్లంపల్లిలో 4.33 సెం.మీ, ఖమ్మం జిల్లా కామేపల్లిలో 4.30 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గార్లలో 4.11 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొనసాగుతున్న లోటు వర్షపాతం
నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. రాష్ట్రంలో లోటు వర్షపాతమే కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో దాదాపు 90 మండలాల్లో 73 మి.మీ తీవ్రలోటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నది. కేవలం 11 జిల్లాల్లోని 205 మండలాల్లో సాధారణ వర్షపాతం, మరో 59మండలాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు వివరించింది. అలాగే 10 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.