యాదవులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. లేదంటే రాష్ట్రం అగ్నిగుండమే.. రాజారాం యాదవ్ డిమాండ్

Follow

- రెండో వారంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా
కవాడిగూడ, జూన్ 30: యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి అయినబోయిన రమేశ్‌యాదవ్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన యాదవుల సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజారాంయాదవ్ మాట్లాడుతూ ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ పాలన, కులపాలన సాగిస్తున్నారని విమర్శించారు. జూలై రెండో వారంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా చేపట్టి జాతీయస్థాయిలో సీఎం రేవంత్‌రెడ్డి బీసీ వ్యతిరేక వైఖరిని ఎండగడుతామని స్పష్టంచేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు, యాదవులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో యాదవులకు మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లుగా అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. యాదవులతో పాటు మున్నూరు కాపు, ఎంబీసీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.
యాదవ హక్కుల పోరాట జాతీయ అధ్యక్షుడు మేకల రాముయాదవ్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు యాదవులంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దీక్షా కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్‌యాదవ్, జాతీయ కార్యదర్శి రమేశ్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి లోడంగి గోవర్ధన్ యాదవ్, మాజీ చైర్మన్ సుందర్‌రాజుయాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, అటవీశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అరిగెల నాగేశ్వరరావు, గొర్ల పెంపకం దార్ల సహకార సంఘం మాజీ చైర్మన్ సుధాకర్‌యాదవ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్, హరిబాబుయాదవ్, అఖిల భారత యాదవ మహాసభ హైదరాబాద్ అధ్యక్షుడు మహేందర్‌యాదవ్ పాల్గొన్నారు.
యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.