రాంచందర్‌రావుకు పట్టం

Follow
నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు
ఒకే ఒక్క నామినేషన్ కావడంతో లాంఛనమైన ఎన్నిక
నేడు అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధిష్టానం
ఎవరూ నామినేషన్ దాఖలు చేయకుండా ఏకగ్రీవం చేసిన అధిష్టానం
తెలంగాణ ప్రజలు బిజెపిని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు
మీడియాతో రామచంద్రరావు
మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం ఉత్కంఠకు తెరదించింది. ఆశావహులందరిని పక్కన పెట్టి అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్ రావు పేరును ఖరారు చేసింది. పార్టీ అధిష్టానం రామచంద్రరావు పేరును ప్రతిపాదించి రాష్ట్ర శాఖకు తెలియజేసింది. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు పార్టీ అధిష్టానం సోమవారం నామినేషన్లు స్వీకరించింది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించారు. మధ్యాహ్నాం రెండు గంటల సమయంలో రామచంద్రరావు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ముగిసింది. అప్పటి వరకు రామచందర్ రావు ఒక్కరే అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అయ్యింది.
రామచందర్ రావును అధ్యక్షుడిగా బిజెపి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం ప్రకటిస్తారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర కమల దళానికి నాయకత్వం వహించే అధ్యక్ష ఎన్నిక రేసులో మొదటి నుంచి బలంగా వినిపించిన ఎంపిలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ చివరికి అధిష్టానం నిర్ణయంతో అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో రామచందర్ రావు వైపు మొగ్గు చూపడంతో ఇంకెవరు అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయలేదు. అధిష్టానం ఆదేశాల మేరకు ఇతర నేతలు ఎవరు నామినేషన్ వేయకుండా పార్టీ జాగ్రత్త పడ్డంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు దోహదపడింది. అంతకు ముందు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేసేందుకు కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ర్యాలీగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆ కోలాహలం మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.
ప్రజలు బిజెపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు
గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని రాంచందర్ రావు చెప్పారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు. నేతలందరితో కలిసి పనిచేస్తానని, రాష్ట్ర బిజెపిలో ఎటువంటి గ్రూప్‌లు లేవని, అంతర్గతంగా ఎలాంటి వివాదాలు లేవని రామచంద్రరావు స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే ముందుకు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానని తెలిపారు. తనకు అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం తనకు చాలా పెద్ద బాధ్యత అప్పగించిందన్న ఆయన పార్టీ అంచనాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగబోతున్నాయని అన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు అందరితో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతానని చెప్పారు.
విద్యార్థి సంఘం నుంచి ఎమ్మెల్సీగా, పార్టీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ప్రస్థానం
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నుంచి ప్రస్తానం ప్రారంభించిన రామచంద్రరావు ఎమ్మెల్సీగా, ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా అంచలంచెలుగా ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా సాగింది. రామచందర్ రావు 1959 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో జన్మించారు. పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసి సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కాలేజీలో చేరి విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1982- నుంచి 1985 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. అలాగే భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర తొలి కార్యదర్శిగా కూడా నియమితులై తన వంతు సేవలు అందించారు. అనంతరం బిజెపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఇదిలావుంటే రామచందర్ రావు 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో 2,768 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. కాగా 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్, – రంగారెడ్డి -, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి జి.దేవీప్రసాద్ రావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు చేతిలో 73,698 ఓట్ల తేడాతో ఓటమి పొందారు. 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కూడా మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి చేతిలో ఓటమి పాలయ్యారు.
నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు ఒకే ఒక్క నామినేషన్ కావడంతో లాంఛనమైన ఎన్నిక నేడు అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధిష్టానం ఎవరూ నామినేషన్ దాఖలు చేయకుండా ఏకగ్రీవం చేసిన అధిష్టానం తెలంగాణ ప్రజలు బిజెపిని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు మీడియాతో రామచంద్రరావు మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం ఉత్కంఠకు తెరదించింది. ఆశావహులందరిని పక్కన పెట్టి అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్ రావు