రాజోళి రైతుకు బేడీలు.. పాలమూరు జైలు నుంచి హ్యాండ్‌కఫ్స్‌తో అలంపూర్‌ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Ethanol Factory Victim Farm
  • ఇద్దరిద్దరు రైతులకు కలిపి సంకెళ్లు
  • బేడీలను చూసి బంధువుల కన్నీళ్లు
  • జోగుళాంబ జిల్లా ఎస్పీ చెప్తేనే బేడీలు
  • వేశామన్న పోలీసుల వీడియో వైరల్‌
  • సర్కారు తీరుపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం
  • బేడీల ఘటనపై ప్రభుత్వం సీరియస్‌
  • ఆర్‌ఎస్సై, ఇద్దరు ఏఆర్‌ ఎస్సైలపై వేటు
  • మహబూబ్‌నగర్‌ జైలు నుంచి విడుదలైన
  • రైతులతో మాట్లాడిన శ్రీనివాస్‌గౌడ్‌

నిన్నటికి నిన్న భూములు ఇచ్చేది లేదని తిరగబడ్డ లగచర్ల రైతుకు బేడీలు వేసిన కాంగ్రెస్‌ సర్కారు.. నేడు పచ్చని పొలాల నడుమ ప్రాణాలు తీసే ఫ్యాక్టరీ వద్దని ఎదురుతిరిగిన రాజోళి రైతులను జైలుకు పంపి.. ఆనక వారికి సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చింది. 12 మంది అన్నదాతలకు బేడీలు వేసి మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ కోర్టుకు తీసుకురాగా వారిని చూసి బంధువులు కన్నీటిపర్యంతమవడం స్థానికులను కలచివేసింది. ‘మా వాళ్లు దొంగలా? ఉగ్రవాదులా? ఏ నేరం చేసిండ్రని బేడీలు వేసిండ్రు’ అంటూ కుటుంబీకుల్లో ఆగ్రహం వ్యక్తమైంది.

మహబూబ్‌నగర్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ తమకొద్దని పోరాడిన రైతులను జైలుకు పంపిన కాంగ్రెస్‌ సర్కారు ఇప్పుడు వారికి సంకెళ్లు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న 12 మంది రైతులకు మంగళవారమే బెయిల్‌ మంజూరైంది. అయితే, ఆర్డర్‌ కాపీ రాకపోవడంతో వారి విడుదల నిలిచిపోయింది. మరోవైపు, రిమాండ్‌ గడువు ముగియడంతో రై తులను బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ కోర్టుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారి చేతులకు సంకెళ్లు వేయడం విమర్శలకు కారణమైంది. రైతులకు బేడీలు వేసి తీసుకెళ్తున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇది లగచర్ల ఘటనను తలపించిందని, రాజోళి రైతుల విషయంలోనూ రేవంత్‌ సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తాయి. తమవారు కోర్టుకు వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు బేడీలతో ఉన్న రైతులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని చెప్తున్నారు.

ఫొటోలు తీస్తే కేసులేనన్న పోలీసులు

ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులు ఫ్యాక్టరీ యజమానులపై దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ నెల 4న పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 40 మందిపై కేసులు నమోదు కాగా 12 మంది రైతులను అదుపులోకి తీసుకుని 14 రోజుల రిమాండ్‌కు పంపారు. మంగళవారం సాయంత్రం గద్వాల జిల్లా ప్రత్యేక న్యాయస్థానం వీరికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. బెయిలు సాయంత్రం రావడం, పూచీకత్తు సమర్పించాల్సి ఉండటంతో విడుదల ఆలస్యమైంది. ఈ లోపు రిమాండ్‌ గడువు కూడా ముగిసింది. దీంతో వారికి బేడీలు వేసి తీసుకెళ్లి అలంపూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట ప్రవేశపెట్టడం సంచలనమైంది. రైతులకు బేడీలు వేసిన విషయం తెలుసుకు న్న మీడియా కోర్టు వద్దకు వెళ్లడానికి ముందే వారిని వాహనంలో నేరుగా కోర్టు లోపలికి తీసుకెళ్లారు. రైతులను ఎవరైనా ఫొటోలు, వీడియోలు తీస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఎస్పీ ఆదేశాల మేరకే సంకెళ్లు!

రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడాన్ని చూసి అక్కడే ఉన్న కొందరు పోలీసులను ప్రశ్నించారు. రిమాండ్‌లో ఉన్న వారికి సంకెళ్లు ఎందుకు వేశారని ప్రశ్నించగా ఓ పోలీసు బదులిస్తూ తమకేం తెలియదని, ఎస్పీ చెప్పినందుకే వేశామని తెలిపారు. కాగా, పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో ఎక్కువమంది బీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఉండటం గమనార్హం.

ముగ్గురు ఎస్సైలపై వేటు

రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ముగ్గురు ఎస్సైలను సస్పెండ్‌ చేస్తూ గద్వాల జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. అన్నదాతలను కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆర్‌ఎస్సై చంద్రకాంత్‌, ఏఆర్‌ఎస్సైలు సురేశ్‌, ఆంజనేయులును సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. కాగా, అంతకుముందే రాజోళి ఎస్సై జగదీశ్వర్‌ రైతులపైనా ఇలాంటి ఆరోపణలే రావడంతో తొలుత ఆయనను ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లాకు బదిలీ చేశారు. మరోవైపు, రాజోళి మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీపై నిజనిర్ధారణ చేపట్టడానికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర నేతలను గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూమి కోసం పోరాడే రైతులకు సంకెళ్లు వేస్తారా? అంటూ అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, శాట్‌ మాజీ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ మండిపడ్డారు. జైలు నుంచి విడుదలైన రైతులు కర్నూల్‌ వెళ్లి ఎమ్మెల్యే విజయుడును కలిశారు.

ఇది రాక్షస ప్రభుత్వం: నిరంజన్‌రెడ్డి

కాంగ్రెస్‌ది రైతు ప్రభుత్వం కాదని, రాక్షస ప్రభుత్వమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అన్నదాతలకు సంకెళ్లు వేయడం ప్రభుత్వ నిరంకుశ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, ఎమర్జెన్సీ పాలన అని దుయ్యబట్టారు. ప్రశ్నించే వారిని, ఎదిరించిన వారిని తప్పుడు కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి వెన్నుపోటు పొడిచిందని, ఇథనాల్‌ కంపెనీ వద్దన్న రైతులపై ఉక్కుపాదం మోపుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాకాసిలా రేవంత్‌ సర్కారు: ఆంజనేయగౌడ్‌

ఆంధ్రా కంపెనీకి కాపలాదారుగా మారిన రేవంత్‌ సర్కారు నడిగడ్డ రైతుల పాలిట రాకాసిలా దాపురించిందని శాట్‌ మాజీ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రాజోళి రైతులపై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులను అరెస్ట్‌ చేసి, దారుణంగా హింసించారని, జైలుకు పంపి ఏరువాక పండుగకు దూరం చేశారని మండిపడ్డారు. భూమి కోసం పోరాడిన రైతులకు ఉగ్రవాదుల్లా సంకెళ్లు వేయడం దారుణమన్నారు. సొంత జిల్లా ప్రజలపై కనీస మమకారం చూపని రేవంత్‌ ప్రభుత్వాన్ని ఉమ్మడి పాలమూరు ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు.

రేవంత్‌.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం: హరీశ్‌

జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు సంకెళ్లు వేయడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులకు సంకెళ్లు వేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. ‘లగచర్ల నుంచి రాజోళి దాక రైతు చేతులకు సంకెళ్లు.. పౌరహక్కుల నేతలపై నిర్బంధాలు, ఇవేనా రేవంత్‌రెడ్డీ నువ్వు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఆనవాళ్లు!’ అని ప్రశ్నించారు.

పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ జైలు నుంచి విడుదలైన రైతులను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరామర్శించారు. జైలు వద్దే వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై పోరాటంలో కలిసి నడుస్తామని భరోసా ఇచ్చారు. రైతులపై రేవంత్‌ సర్కారు వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పొలాల్లో పరిశ్రమ సరికాదని, పచ్చని పొలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. రైతులను దొంగల్లా చూస్తూ బేడీలు వేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు.

​కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ తమకొద్దని పోరాడిన రైతులను జైలుకు పంపిన కాంగ్రెస్‌ సర్కారు ఇప్పుడు వారికి సంకెళ్లు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న 12 మంది రైతులకు మంగళవారమే బెయిల్‌ మంజూరైంది. అయితే, ఆర్డర్‌ కాపీ రాకపోవడంతో వారి విడుదల నిలిచిపోయింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *