రెండు ట్రిప్పులు ఇంటికి.. నాలుగు బైటికి.. ‘ఇందిరమ్మ ఇండ్ల’ పేరిట ఇసుక దందా!

Follow

- క్వారీల వద్ద కనిపించని పర్యవేక్షణ
- ఇష్టారీతిగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు
- పట్టుకుంటే బయట పడుతున్న అక్రమ రవాణా
- అనుకున్నదానికంటే అధికంగా వసూళ్లు
- లబ్ధిదారులకు తప్పని ఆర్థిక భారం
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండగా.. ఇదే సమయంలో దందా జోరుగా నడుస్తున్నది. అయితే, దీనికొక నిర్ధిష్టమైన ప్రణాళిక లేక పోవడంతో ఇసుకాసురులు దొరికిందే తడువుగా, లబ్ధిదారుల పేరు చెప్పి ఇతర నిర్మాణాలకు తరలిస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. ట్రిప్పుకొకటి చొప్పున పంచాయతీ కార్యదర్శులు ఇస్తున్న కూపన్లను ఇసుక ట్రాక్టర్ల ఓనర్లు పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నట్టు తెలుస్తున్నది. పైగా మొత్తంలోనే వసూలు చేస్తుండడంతో లబ్ధిదారులపై ఆర్థిక భారం పడుతున్నది.
కరీంనగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అందిస్తున్న ఉచిత ఇసుక పక్కదారి పడుతున్నది. లబ్ధిదారుల పేరు చెప్పి ఇతర నిర్మాణాలకూ తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇండ్లకు ఉచితంగా ఇసుక అందించే లక్ష్యంతో పంచాయతీ కార్యదర్శులకు కూపన్లు పంపిణీ చేసే బాధ్యతలు అప్పగించారు. 400 చదరపు అడుగుల్లో నిర్మించుకునే ఒక్కో ఇంటికి 24 క్యూబిక్ మీటర్లు అంటే 8 ట్రాక్టర్ల ఇసుక వే బిల్ లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బేస్‌మెంట్ లెవల్లో 2, రూప్ లెవల్లో 2, స్లాబ్ లెవల్లో 2, ఫినిషింగ్ లెవల్లో మరో 2 ట్రిప్పులు అందించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను పరిశీలించి అవసరమైన మేరకు కూపన్లు జారీ చేయాలి. లబ్ధిదారులకు ఇసుక అవసరం ఉన్నట్టు సంబంధిత అసిస్టెంట్ ఇంజినీర్లు కూడా అటెస్టేషన్ చేయాలి. ఏ రోజు జారీ చేసిన కూపన్ మీద ఆ రోజు ఇసుక తెచ్చుకోవాలి. మరుసటి రోజు ఆ కూపన్ చెల్లదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఇసుక తరలించాలి. ఇలాంటి కొన్ని నిబంధనలతో అధికారులు ఇసుక సరఫరాను చేస్తుండగా, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్నది.
పట్టుబడితేనే వెలుగులోకి..
జిల్లాలో ప్రస్తుతం అనేక క్వారీల నుంచి ఇసుక తరలిస్తున్నారు. కూపన్లు లేకుండానే పొద్దంతా యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు పట్టుకుని పరిశీలిస్తేనే అది అక్రమమా..? సక్రమమా..? అనేది వెలుగులోకి వస్తుంది. లబ్ధిదారుల పేరు చెప్పి పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులను అన్నిచోట్ల అడ్డగించే పరిస్థితి లేదని స్వయంగా అధికారులే ఒప్పుకుంటున్నారు. వీణవంక మండలం రెడ్డిపల్లి క్వారీ నుంచి నాలుగైదు రోజులుగా పెద్ద మొత్తంలో ఇసుక అక్రమ రవాణా సాగుతున్నది. ఇదంతా ఇందిరమ్మ ఇండ్ల కోసమేనని చూసే వారెవరైనా అనుకుంటున్నారు. కానీ, అధికారులు తనిఖీలు చేయడంతో అక్రమంగా తరలించే విషయం బయటికి వచ్చింది. పది ట్రాక్టర్లను పట్టుకున్న అధికారులు డ్రైవర్లను ప్రశ్నించగా ఇందిరమ్మ ఇండ్లకేనని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇక చిగురుమామిడి మండలం రామంచ పరిధిలోని మోయతుమ్మెద వాగు నుంచి కూడా నాలుగైదు రోజుల వరకు ఇందిరమ్మ పేరు చెప్పి ఇష్టారీతిగా తరలించినట్టు తెలుస్తున్నది.
మండల అధికారుల దృష్టికి రావడంతో క్వారీ వద్ద రెవెన్యూ, మైనింగ్ సిబ్బందిని నియమించారు. దాని పక్కనే ఉన్న తిమ్మాపూర్ మండలం రేణికుంట నుంచి రోజుకు కొన్ని వందల ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. రామంచ నుంచి చిగురుమామిడి, రేణికుంట నుంచి తిమ్మాపూర్ మండల లబ్ధిదారులకు ఇసుక తరలించాల్సి ఉంది. ఒక లబ్ధిదారుడికి రెండు కూపన్లు ఇచ్చినా ఒక ట్రాక్టర్ యజమాని ఇద్దరు ముగ్గురు లబ్ధిదారులకు చేరవేసినా నాలుగు నుంచి ఆరు ట్రిప్పుల ఇసుక తీసుకెళ్లే వెసులు బాటు ఉంటుంది. కానీ, ఈ రెండు క్వారీల్లో వారం పది రోజులుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నాయి. ఏ ట్రాక్టర్ ఇసుక ఎటు వెళ్తుందో అధికారులకు తెలిసే పరిస్థితి కనిపించడం లేదు. రామడుగు మండలం మోతె వాగు నుంచి గంగాధర మండలంలోని కొన్ని గ్రామాలు, రామడుగు మండలంలోని కొన్ని గ్రామాలకు ఇసుక అందిస్తున్నారు. ఇసుక మాఫియాగా ఏర్పడిన కొందరు కూపన్లు ఉన్నా, లేకున్నా యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు వీరికి అండగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
లబ్ధిదారులకు దూర భారం
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి కొన్ని క్వారీలు దూరంగా ఉండడం కూడా అందుకు కారణమవుతున్నది. గంగాధర మండలంలోని కొన్ని గ్రామాలకు కరీంనగర్ మండలం ఇరుకుల్ల వాగును కేటాయించడం, హుజూరాబాద్ పట్టణానికి జమ్మికుంట మండలం తనుగుల, వీణవంక మండలం చల్లూరు, ఇప్పలపల్లి కేటాయించడం, శంకరపట్నం మండలానికి చల్లూరు, ఇప్పలపల్లి వాగులు కేటాయించడం, సైదాపూర్ మండలానికి చల్లూరు, తనుగుల వాగులు కేటాయించడంతో లబ్ధిదారులకు దూర భారం తప్పడం లేదు. ఫలితంగా ట్రాక్టర్ యజమానులు దూరాన్ని బట్టి రవాణా చార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఎంపీడీఓలు శ్రద్ధ తీసుకుని ధరలు నిర్ణయించగా చాలా మండలాలకు ట్రాక్టర్ల యజమానులు చెప్పిన ధర చెల్లించక తప్పడం లేదు. దూరాన్ని బట్టి ట్రిప్పునకు 1,800 ధర కనిష్ఠంగా కనిపిస్తుండగా, 3 వేలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు ఇసుక ఉచితంగా ఇచ్చిన ఫలితం ఏమున్నదనే వాదనలు లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకుని అక్రమ ఇసుక దందాను అరికట్టడమే కాకుండా లబ్ధిదారులకు కిలో మీటరుకు కొంత చొప్పున రవాణా చార్జీలు నిర్ణయిస్తే లబ్ధిదారులకు కొంత ప్రయోజనం ఉండవచ్చు.
ఇష్టారాజ్యంగా తరలింపు
పంచాయతీ కార్యదర్శులు ఇస్తున్న కూపన్లను పట్టుకుని కొందరు ట్రాక్టర్ల యజమానులు పెద్ద మొత్తంలో ఇసుక దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఒక ట్రాక్టర్‌కు ఒక కూపన్ మాత్రమే పంచాయతీ కార్యదర్శులు ఇస్తున్నారు. కానీ, ట్రాక్టర్ల యజమానులు మాత్రం ఇచ్చిన ఒక కూపన్‌ను దగ్గర పెట్టుకుని నాలుగైదు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. కొన్ని క్వారీల వద్ద పర్యవేక్షణ కోసం రెవెన్యూ, మైనింగ్ సిబ్బందిని నియమించగా చాలా క్వారీల వద్ద ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఉదయం 10 గంటల తర్వాతనే క్వారీలోకి వెళ్లాలని, సాయంత్రం 5 గంటల తర్వాత ఇసుక తీయరాదనే నిబంధన ఉన్నా ట్రాక్టర్ల యజమానులు ప్రతి రోజూ తెల్లవారు జాము నుంచే ఇసుక తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. రెవెన్యూ, మైనింగ్ సిబ్బంది ఇంకా క్వారీకి రాకముందే యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. సిబ్బంది వచ్చిన తర్వాత తీసుకెళ్లే ఇసుకకు మాత్రం కూపన్లు చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. కొన్ని క్వారీల్లో ట్రాక్టర్ వెంట లబ్ధిదారులు కూడా రావాలని ఎంపీడీవోలు నిబంధన పెట్టుకున్నారు. కానీ, లబ్ధిదారులు రాకున్నా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఇంటి నిర్మాణం బేస్‌మెంట్ స్థాయిలో ఉంటే రెండు ట్రిప్పులకు కూపన్లు తీసుకుని వాటిని దగ్గర పెట్టుకుని నాలుగైదు ట్రిప్పులు తీసుకెళ్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఒక కూపన్ ఒక ట్రిప్పునకు మాత్రమే వాడుకోవాల్సి ఉండగా అనేక ట్రిప్పులు జార వేయడం విమర్శలకు తావిస్తున్నది. పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితికి కారణమని స్పష్టంగా తెలుస్తున్నది.
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండగా.. ఇదే సమయంలో దందా జోరుగా నడుస్తున్నది. అయితే, దీనికొక నిర్ధిష్టమైన ప్రణాళిక లేక పోవడంతో ఇసుకాసురులు దొరికిందే తడువుగా, లబ్ధిదారుల పేరు చెప్పి ఇతర నిర్మాణాలకు తరలిస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది.